భూమిని రక్షించుకోవాలి..

Tue,April 23, 2019 02:30 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 22: ప్రాణకోటి అనుకూలంగా ఉన్న ఏకైక గ్రహం భూమి అని, భూగ్రహాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య పేర్కొన్నారు. 49వ ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్ అధ్యక్షతన సోమవారం మహబూబాబాద్‌లోని అటవీశాఖ అతిథి గృహం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1969 కాలిఫోర్నియాలో సముద్రతీరంలో చమురు పేరుకుపోయిన కారణంగా వేలాది సముద్ర జీవులు మరణించగా ఒక ఫోరం ఏర్పాటు చేసి 22 ఏప్రిల్ 1970 సంవత్సరం నుంచి ధరిత్రి దినోత్సవం జరుపుకుంటన్నారని అన్నారు. విశ్వంలో ఉన్న 9 గ్రహాల్లో భూగ్రహం ప్రత్యేకత కలిగి ఉందని ఈ గ్రహంలో దాదాపు 87 లక్షల జీవరాశులు జీవిస్తున్నారని అన్నారు. 49వ ధరిత్రి దినోత్సవం సందర్భంగా అంతరిస్తున్న, అంతరించే ప్రమాదంలో ఉన్న జీవ జాతులను రక్షించాలన్నారు. వన్యప్రాణి సంరక్షణ ఈ భూమిపైన ప్రతి మనిషి కర్తవ్యంగా భావించి అందుకు చర్యలు చేపట్టాలన్నారు.

అన్ని ప్రాణులకు మనుషులు, జంతువులు, ఇతర జాతులకు ఆవాసంగా ఉండి అభయమిచ్చే దరిత్రి అందరికీ అన్నింటికి తల్లి వంటిదని తెలిపారు. పారిశ్రామీకరణ అమితంగా పెరిగిపోవడం, మనుషుల నిర్లక్ష్య ధోరణి వల్లే భూగ్రహానికి చేటు వాటిల్లుతుందని ప్రజల్లో ఈ విషయంపై అవగాహన పెంచడానికి ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే రోజున అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లా అటవీశాఖాధికారి కిష్టగౌడ్ మాట్లాడుతూ జీవరాసుల సహజీవనంతో ఉంటేనే మానవ మనుగడ సాధ్యమని తెలిపారు. కనీసం 50 శాతం అడవులు ఉంటేనే పర్యావరణ సమతుల్యత ఉంటుందన్నారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని రక్షించాలన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ వేత్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ నిర్వహించిన వ్యాసరచన పోటీలలో మొత్తం 36 మంది పాల్గొనగా విజేతలుగా ఏడుగురిని ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్, అటవీ అభివృద్ధి అధికారి కృష్ణమాచారి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నారాయణ, వ్యవసాయ అధికారి చత్రునాయక్, ఆర్డీవో కొమురయ్య, అటవీ శాఖ సిబ్బంది, పర్యావరణ ప్రేమికులు, ప్రజలు పాల్గొన్నారు.

64
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles