మొదటి విడత నోటిఫికేషన్ విడుదల

Tue,April 23, 2019 02:28 AM

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలకు సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 16మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 16 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 198 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తొలి విడతలో ఏడు మండలాలకు చెందిన ఏడు జెడ్పీటీసీ, 70ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఇందులో మొదటి రోజు జెడ్పీటీసీ అభ్యర్థులకు 01 నామినేషన్, ఎంపీటీసీ అభ్యర్థులకు 10 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఏడు మండలాల పరిధిలో 1,58,312 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొదటి విడతలో 394 పోలింగ్ కేంద్రాలు, 170 లోకేషన్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.

ఈ నెల 24న సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మొదటి విడత మే6న, రెండోవిడత మే 10న, మూడోవిడత మే14న పోలింగ్ నిర్వహించనున్నారు. మే6న మొదటి విడత ఎన్నికల్లో కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల, తొర్రూర్, పెద్దవంగర, డోర్నకల్ మండలాల పరిధిలో 7 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 70ఎంపీటీసీ స్థానాలకు, మే 10న నిర్వహించే రెండో విడత ఎన్నికల్లో నర్సింహులపేట, మరిపెడ, కురవి, చిన్నగూడురు, దంతాలపల్లి మండలాల పరిధిలోని 5 జెడ్పీటీసీలతో పాటు 61ఎంపీటీసీ స్థానాలకు మే 10న, మే 14న నిర్వహించే మూడో విడత ఎన్నికల్లో మహబూబాబాద్, నెల్లికుదురు, కేసముద్రం, గూడురు మండలాల పరిధిలోని నాలుగు జెడ్పీటీసీలు, 67 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి ఎన్నికల్లో రూ.4లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి రూ.1.50లక్షలు ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మొదటి విడత ఎన్నికల్లో తొలిరోజు కొత్తగూడ మండలంలో ఒక జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు కాగా, ఎంపీటీసీలకు గార్ల-03, కొత్తగూడ-01, తొర్రురు-05, పెద్దవంగర-01 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

24 వరకు నామినేషన్ల స్వీకరణ..
మొదటి విడతలో ఏడు మండలాల్లో జెడ్పిటీసీతో పాటు 70ఎంపీటీసీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఏడు జెడ్పిటీసీ స్థానాలతో పాటు డోర్నకల్-12, బయ్యారం-12, గార్ల-11,కొత్తగూడ-08, గంగారం-03, తొర్రురు-15, పెద్దవంగర-09 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడతలో నిర్వహించే జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల కోసం ఈ నెల 24న సాయంత్రం 5గంటలవరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 25న నామినేషన్ల పరిశీలన. 26న ఆర్డీవోకు అప్పీల్ చేయడం, 27న వచ్చిన అప్పీళ్లను పరిశీలించడం. 28న నామినేషన్ల ఉపసంహరణ, అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. మే 6న పోలింగ్‌ను ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించనున్నారు.

ఆన్‌లైన్‌లో నామినేషన్లు..
ఈసారి నిర్వహించే స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నామినేషన్‌ను దాఖలు చేసే అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసినప్పటికీ కూడా హార్డ్ కాపీ మాత్రం రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు కాకుండా నేరుగా ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి సంబంధిత రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేయవచ్చును. ఎంపీడీవో కార్యాలయంలో మూడు, నాలుగు, జెడ్పీటీసీ స్థానాలకు ఒక్కో నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ అభ్యర్థులు ఎంపీడీవో కార్యాలయంలోని ఎంపీడీవోకు నామినేషన్ పత్రాలు అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతీ మండలానికి ఎంపీడీవో కార్యాలయంలో మూడు, నాలుగు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు నామినేషన్ వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

పల్లెల్లో మొదలైన సందడి..
జిల్లాలో మొదటి విడత స్థానిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభం కావడంతో పల్లెల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. గ్రామాలు, తండాల్లో ఏ ఇద్దరు కలిసినా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపైనే చర్చ సాగుతుంది. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పల్లెల్లో సందడి నెలకొంది. 2018 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు, ఈ ఏడాది జనవరిలో పంచాయతీ ఎన్నికలు, ఈ నెల 11న ఎంపీ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రావడంతో పల్లెల్లో సందడి సందడిగా మారింది. పార్టీ గుర్తులపై జరిగే స్థానిక ఎన్నికలు కావడంతో ప్రజలు కూడ ఏ పార్టీ నుంచి ఎవరికి టికెట్ వస్తుందని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పల్లెలు, తండాలు, గూడెల్లో ఎన్నికల హడావుడి మొదలైంది.

56
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles