విద్యార్థులు అధైర్యపడొద్దు

Mon,April 22, 2019 01:44 AM

-ర్యాంకులు, మార్కులేప్రామాణికం కాదు
-చావు సమస్యకు పరిష్కారం కాదు
-తల్లిదండ్రులు, విద్యార్థులకు ఎస్పీ కోటిరెడ్డి సూచనలు
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 21 : ఇటీవల ఇంటర్‌మీడియట్ ఫలితాలు వెలువడడంతో విద్యార్థులను ఉద్దేశించి జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫలితాల వేళ రాష్ట్రవ్యాప్తంగా పలువురు విద్యార్థులు తనువు చాలించి వారి కుటుంబసభ్యులకు గుండెకోతను మిగిల్చారని గుర్తుచేశారు. ఫెయిల్ అయితే ఇక జీవితంలో ఏమీ లేదనే రీతిలో విద్యార్థులు తమకు తాము మరణ శాసనం రాసుకుంటున్నారని తెలిపారు. జీవితంలో పరీక్షలు అనేవి ఒక భాగం మాత్రమే అని పరీక్షలే జీవితం కాదన్నారు. చదువు లేకున్నా విషయ జ్ఞానాన్ని, హార్డ్ వర్క్, ఫ్యాషన్‌ను నమ్మి ఎంతో మంది జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారని వివరించారు. ర్యాంకులు, మార్కులు తోటి విద్యార్థులతో పోలికలు... ఇవన్నీ కలగలిపి విద్యార్థులను తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయన్నారు. బతకడం కోసం విజ్ఞానం కోసం నేర్చుకోవాల్సిన చదువులు, యువతను మానసిక ఒత్తిడికి గురిచేసి వారిని ఆత్మహత్యల వైపు నడిపిస్తుండడం బాధాకరం. దేశమంతటా వెలుగుచూస్తున్న విద్యార్థుల బలవన్మరణాలు సామాజిక రుగ్మతగా పరిణిమిస్తున్నాయన్నారు.

తల్లిదండ్రులు ఎస్పీ సూచనలు
తమ పిల్లలు ఫెయిల్ అయ్యారనే బాధ తల్లిదండ్రుల్లో ఉండడం సహజమే కానీ అదే సమయంలో పిల్లలతో దురుసుగా ప్రవర్తించొద్దు. వారిని సానుకూల దృక్పథంతో ఓదార్చాలి. తమను ర్యాంకులు తెచ్చిపెట్టే యంత్రాల్లా చూస్తున్న పెద్దవారి సంకుచిత ధోరణిపై నిరసన తెలియజేయడానికి తాము ఓడిపోయామని ప్రకటించడానికి విద్యార్థులు ఆత్మహత్యను ఓ మార్గంగా ఎంచుకుంటున్నారు. మీ పిల్లల మార్కులు, ర్యాంకుల కంటే కూడా వారి జీవితం, వారి యొక్క జీవించే హక్కు వారు జీవించి ఉండడం మీకు అత్యంత ప్రాధాన్యమైనదని మీరు గుర్తించండి. విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన అన్ని దారులు మూసుకుపోయాయని అనుకోవద్దని ఎస్పీ తెలిపారు.

కోచింగ్ సెంటర్లకు సూచనలు..
హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ లక్ష్యంగా చూపించే కోచింగ్ సెంటర్లు.. మార్కులు రాకపోతే ఇంకా దేనికి పనికిరావనే అభద్రతా భావాన్ని విద్యార్థుల్లో పెంచుతున్నారని ఎస్పీ అన్నారు. ఈ టెన్షన్ వాతావరణాన్ని తట్టుకోలేక దేశ వ్యాప్తంగా ఏటా కొన్ని వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని పిల్లలపై ఒత్తిడి చేయడం, హోమ్‌వర్క్, స్టడీ అవర్స్, డైలీ ఎగ్జామ్స్, వీక్లి టెస్ట్, ఇలా కోచింగ్ సెంటర్లో క్షణం తీరిక లేకుండా విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి తేవడం మంచిదికాదన్నారు. విద్యార్థులు డిప్రెషన్ నుంచి బయట పడేందుకు వారిని వ్యాయామం, యోగా మెడిటేషన్ చేయమని పోత్స్రహించాలని సూచించారు. మోటివేషనల్ బుక్స్ గొప్ప గొప్ప వారి జీవిత చరిత్రలను చదివేలా ఎంకరేజ్ చేయాలన్నారు.

63
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles