మోగిన నగారా...

Sun,April 21, 2019 01:58 AM

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : స్థానిక ఎన్నికల నగారా మోగింది. శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. జెడ్పీ,ఎంపీటీసీ ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేయడంతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లాలో ఉన్న 16జెడ్పీటీసీలతో పాటు 198ఎంపీటీసీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. శనివారం ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల సంఘం రాష్ట్ర కమిషనర్ నాగిరెడ్డి విడుదల చేశారు. మొదటి విడత నోటిఫికేషన్ 22న నోటిఫికేషన్ విడుదల కానుంది. జిల్లాలో ఉన్న 16 మండలాల్లో నిర్వహించే జెడ్పీటీసీతో పాటు 198ఎంపీటీసీ స్థానాలకు ఇప్పటికే రిజర్వేషన్లను అధికారులు ప్రకటించారు. మొత్తం 16 మండలాల్లో మొదటి విడతలో 7 మండలాలు, రెండవ విడతలో 5 మండలాలు, మూడవ విడతలో 4 నాలుగు మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో 16 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 198 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,085 పోలింగ్ కేంద్రాలు, 476 లోకేషన్లను ఏర్పాటు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించే ఎన్నికల కోసం 2170 మంది ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. మూడు విడతల్లో నిర్వహించే స్థానిక ఎన్నికలకు మొత్తం 3820 మంది పోలింగ్ సిబ్బందిని అధికారులు నియమించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు జెడ్పీటీసీకి అయితే రూ. 4లక్షలు, ఎంపీటీసీ స్థానానికి అయితే రూ.1.50లక్షలు ఖర్చు చేయాలనే నిబంధన ఉంది.

మొదటి విడత పోలింగ్ మే 6న
మొదటి విడత ఎన్నికలకు ఈ నెల 22న నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. 22నుంచి 24వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 25 నామినేషన్ల పరిశీలన, 26న అప్పీల్ చేయడం, 27న అప్పీల్‌ను పరిశీలన, 28న నామినేషన్ల ఉప సంహరణ, అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. మే 6న మొదటి విడత పోలింగ్‌ను ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించనున్నారు. జిల్లాలో మొదటి విడతలో బయ్యారం,గార్ల, కొత్తగూడ, గంగారం, తొర్రూర్, పెద్దవంగర, డోర్నకల్ మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. 7 మండలాల పరిధిలో 7 జెడ్పీటీసీలతో పాటు 70 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏడు మండలాల పరిధిలో 1,58,312 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మొదటి విడతలో 394 పోలింగ్ కేంద్రాలు, 170 లోకేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

మే 10న రెండో విడత పోలింగ్..
రెండవ విడత ఎన్నికలకు 26న నోటిఫికేషన్‌ను విడుదల కానుంది. ఈ నెల 26నుంచి 28వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 29న నామినేషన్ల పరిశీలన, 30న అప్పీల్ చేయడం, మే 1న అప్పీల్‌ను పరిశీలించడం, మే 2న నామినేషన్ల ఉప సంహరణ, అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. మే 10న రెండవ విడత పోలింగ్ నిర్వహించనున్నారు. మరిపెడ, కురవి, నర్సింహులపేట, దంతాలపల్లి, చిన్నగూడురు మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఐదు జెడ్పీటీసీలతో పాటు 61 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటి పరిధిలో 1,53,863 మంది ఓటర్లు ఉన్నారు. 319 పోలింగ్ స్టేషన్లు, 149 లోకేషన్లు ఏర్పాటు చేశారు.

మూడో విడత మే 14న
మూడవ విడత ఎన్నికలకు ఈ నెల 30న నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. 30నుంచి మే2వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మే 3న నామినేషన్ల పరిశీలన. మే4న అప్పీల్ చేయడం, మే 5న అప్పీల్‌ను పరిశీలించడం, మే 6న నామినేషన్ల ఉప సంహరణ, అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. మే 14న మూడవ విడత పోలింగ్‌ను ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మహబూబాబాద్, కేసముద్రం, నెల్లికుదురు, గూడురు మండలాల్లో ఎన్నికల నిర్వహించనున్నారు. నాలుగు జెడ్పీటీసీ స్థానాలతో పాటు 67 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటి పరిధిలో 1,75,621 మంది ఓటర్లు ఉండగా 372 పోలింగ్ కేంద్రాలు, 157 లోకేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే స్థానిక ఎన్నికలకు ఓటర్ల జాబితా తుది ముసాయిదాను విడతల చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు కూడా ఖరారు అయ్యాయి.

27న ఫలితాల వెల్లడి
జిల్లా వ్యాప్తంగా 16 జెడ్పీటీసీ, 198 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలను మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మే 23న వెల్లడి కానున్నాయి. వీటి తర్వాత మే 27న మొత్తం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నిర్వహించిన ఓట్ల లెక్కింపు నిర్వహించి, ఫలితాలను ఎన్నికల అధికారులు వెల్లడించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో అన్ని రాజకీయ పార్టీలు స్థానిక ఎన్నికలపై దృష్టి సారించాయి. ఈనేపథ్యంలో ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్ పార్టీ జిల్లాల వారీగా, నియోజకవర్గాలు, మండలాల వారీగా ఇన్‌చార్జిలను నియమించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జిల్లా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో జిల్లా వ్యాప్తంగా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

53
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles