పరిశీలిస్తూ.. పర్యవేక్షిస్తూ..

Sun,April 21, 2019 01:57 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ/తొర్రూరు రూరల్, ఏప్రిల్ 20 : గ్రామీణ ప్రజల్లో అవగాహన పెంచి వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి పరమేశ్వరన్‌అయ్యర్ అన్నారు. మండలంలోని అమ్మాపురం, ఖానాపురం గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, వినియోగంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి సంస్థ కమిషన్ నీతూకుమారిప్రసాద్‌తో కలిసి శనివారం మరుగుదొడ్లను పరిశీలించారు. అమ్మాపురంలో కిన్నెర పరశురాములు ఇంటి ఆవరణలో ఎస్‌బీఎం ద్వారా నిర్మించుకున్న వ్యక్తిగత మరుగుదొడ్డిని, గంగా ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంకుడుగుంతను పరిశీలించారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా లబ్ధిదారులు మరుగుదొడ్లను నిర్మించుకోవడం, వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నారు. నిర్మించుకున్న దానికి ఎన్ని నిధులు మంజూరయ్యాయి, గ్రామాల్లో ఎంత శాతం పూర్తి చేశారు తదితర విషయాలను నీతూకుమారిప్రసాద్ లబ్ధిదారులను అడిగి కేంద్ర కార్యదర్శికి వివరించారు. ఖానాపురం గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకోవడం పై ప్రజలు, అధికారుల కృషిని అభినందించారు. ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డిని నిర్మించుకోవడం గౌరవానికి సూచిక అన్నారు. అధికారులు ప్రజల్లో అవగాహన పెంచాలని, మహిళలు ఆత్మగౌరవానికి ఇంట్లో మరుగుదొడ్డి ఉండేలా చూసుకోవాలన్నారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతీ ఒక్కరు ఎస్‌బీఎం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేసుకోవచ్చని తెలిపారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న మహిళలతో మాట్లాడారు. అమ్మాపురం గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంత మంది ఇళ్లలో మరుగుదొడ్డి నిర్మించుకున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. గృహాలు నిర్మించుకున్న వారు సొంతంగా ఇళ్లలో మరుగుదొడ్డి నిర్మించుకున్న వారు ఎంత మంది ఉన్నారని అడిగారు. మరుగుదొడ్డి నిర్మించుకున్న వారందరికి బిల్లులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ స్వచ్చభారత్ మిషన్‌లో నిధులకు కొరత లేదని, ఎస్‌బీఎం, ఈజీఎస్, ఎంబీఏ పథకాల్లో ఎన్ని నిధులు ఖర్చు చేయడానికైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని నీతూకుమారిప్రసాద్ తెలిపారు. గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు, చేపట్టే పనులు, ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు తెలిపేందుకు రాష్ట్రంలో సగానికి పైగా గ్రామాల్లో మొబైల్ మైక్‌సెటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

మిషన్ భగీరథ నీరు అందుతుందా?
తెలంగాణ ప్రభుత్వం తాగునీటికి శాశ్వత పరిష్కారం చేపేట్టేందుకు చేపట్టిన భగీరథలో భాగంగా ఎన్ని అవాసాలకు తాగునీరు అందుతుందని అడిగి తెలుసుకున్నారు. ప్రతీ ఇంటికి నల్లా ద్వారా నీరు అందజేయాలన్న ముఖ్యమంత్రి లక్ష్యాన్ని నెరవేరుస్తున్నారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. నీరందని వారికి రెండు నెలల్లోపు అందేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. వేసవిలో తాగు నీటి కొరత లేకుండా చూడాలని, మిషన్ భగీరథ పనులను వేగవంతం చేసి ప్రతీ ఇంటికి శుద్ధ తాగునీరు అందించాలన్నారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ శివలింగయ్య అమ్మాపురం, ఖానాపురం గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు ఉన్న పురోగతి, వందశాతం నిర్మించుకున్న గ్రామాలు, పారిశుధ్యం, తాగునీరు అందించడానికి చేపడుతున్న చర్యలను వారికి వివరించారు. అమ్మాపురంలో 4215 జనాభా ఉండగా 1093 ఇళ్లు ఉన్నాయని, 664 మరుగుదొడ్లను నిర్మించుకున్నారని, ఎస్‌బీఎం ద్వారా 263 మరుగుదొడ్లను పూర్తి చేసినట్లు తెలిపారు. 166 వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. 2019 జూన్ 2 నాటికి బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 1,52,028 గృహాలు ఉండగా 48,570 గృహాలు మరుగుదొడ్లు నిర్మించుకున్నాయని, స్వచ్చభారత్‌లో 1,33,458 మరుగుదొడ్లు మంజూరవగా 62వేల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని, 41,457 వివిధ నిర్మాణాల దశలో ఉన్నాయని మొత్తంగా 73శాతం మరుగుదొడ్లు పూర్తయ్యాయని వివరించారు. వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకున్న ఖానాపురం గ్రామస్తులు అధికారులకు పూలమాలలతో ఘన స్వాగ తం పలికారు. గ్రామంలోని వీధుల్లో తిరిగి మరుగుదొడ్ల నిర్మాణం, లబ్ధిదారులు ఉపయోగించుకున్న తీరుపై పలువురు మహిళలతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుతున్నాయా? లేదా అనే పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో బల రాం, డీహెచ్‌ఎస్‌వో సూర్యనారాయణ, ఆర్డీవో ఈశ్వరయ్య, డీపీఆర్వో ఆయూబ్‌అలీ, తహసీల్దార్ గట్టు రమేశ్‌బాబు, ఎంపీడీవో గుండె బాబు, స్వచ్చభారత్ మిషన్ జిల్లా కో ఆర్డినేటర్లు శ్రావణ్, రవి, ఐకేపీ ఏపీడీ ఖాదిర్, ఏపీఎం తిలక్, ఈజీఎస్ ఏపీవో భీమ్లానాయక్, అమ్మాపురం, ఖానాపురం గ్రామాల సర్పంచులు కడెం యాకయ్య, చెటుపెల్లి కవిత, మాజీ సర్పంచ్ స్వప్నవీరేశ్, వార్డు సభ్యులు, పంచాయతీ, రెవెన్యూ కార్యదర్శు లు, ఐకేపీ, ఈజీఎస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles