కరుణలేని వరుణుడు

Sun,April 21, 2019 01:57 AM

నర్సింహులపేట, ఏప్రిల్ 20 : కాలం కానీ కాలంలో పడుతున్న వానలు రైతులను నిండాముంచుతున్నాయి. ఆరుగాలం శ్రమకోర్చి వేసిన పంటలు కళ్లెదుటే ధ్వంసమవుతున్నాయి. పెట్టిన పెట్టుబడి దక్కుతుందో లేదోనని అన్నదాతలు గుబులు చెందుతున్నారు. నాలుగైదు రోజులుగా ఈదురుగాలులు వర్షం, వడగండ్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మహబూబాబాద్, కురవి, కేసముద్రం, గూడూరు మండలాల్లోని ఆయా గ్రామాల్లో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీనికి తోడు తొర్రూరు, నర్సింహులపేట, నెల్లికుదురు, పెద్దవంగర మండలాల్లో పాక్షికంగా మామిడి, వరి పంటలకు నష్టం జరిగింది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో కష్టనష్టాలకు ఓర్చి మామిడి చెట్లకు నీరు పారించుకుంటే తక్కువ శాతం కాయలు కాశాయి. అవి సైతం గాలివానతో రాలి పోవడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

తల్లడిల్లుతున్న రైతులు..
జిల్లా వ్యాప్తంగా పగలు ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్నా సాయంత్రం కాగానే ఉరుములు, మెరుపులు, గాలివానతో ప్రజలు, రైతులు భయభ్రాతులకు గురవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి భగభగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సాయంత్రం అకస్మాతుగా వాతవరణంలో వచ్చిన మార్పులతో రైతులు తల్లడిల్లుతున్నారు. ఇప్పటికే చేతికి వచ్చిన వరి పంటను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

3వేల ఎకరాల్లో మామిడి పంటకు నష్టం..
జిల్లా వ్యాప్తంగా 15వేల ఎకరాల్లో మామిడి పంటలు ఉండగా.. సూమారు 3 వేల ఎకరాల్లో 20 నుంచి 25 శాతం వరకు రైతులు నష్టపోయినట్లు వ్యవసాధికారులు అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. మహబూబాబాద్, కురవి, కేసముద్రం, గూడూరు మండలాల్లో ఎక్కువ శాతం నష్టం వాటిల్లగా, నెల్లికుదురు, నర్సింహులపేట, తొర్రూరు, పెద్ద వంగర, దంతాపలపల్లి మండలాల్లో 35 శాతం పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు.

నేలరాలిన 30 శాతం మామిడి కాయలు
నెల్లికుదురు : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం వీచిన గాలివాన బీభత్సానికి 30 శాతం మామిడికాయలు నేలపాలైనట్లు ఉద్యానశాఖ అధికారి సీహెచ్ రాకేశ్ తెలిపారు. మండల కేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో.. మాట్లాడుతూ మండల కేంద్రంతోపాటు రావిరాల, మునిగలవీడు, చిన్నముప్పారం, ఆలేరు తదితర గ్రామల్లో మా మిడికాయలు నేలరాలినట్లు తెలిపారు. మూడు రోజులు ఇదే వాతావరణం ఉంటుందని తదుపరి పంటనష్ట జాబితాను సిద్ధం చేస్తామని చెప్పారు.

33.8 శాతం వర్షపాతం నమోదు
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ : మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి వివిధ గ్రామాల్లో ధాన్యం తడిసి ముైద్దెంది. గాలిదుమారానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలి రోడ్లపై పడి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించాయి. కొత్తబజారులో చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై పడడంతో రాత్రి నుంచి ఉదయం వరకు కరంటు సరఫరా నిలిపివేశారు. మహబూబాబాద్ మండలంలోని శనిపురం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడవడంతో ధాన్యాన్ని ఆరపోశారు. అమనగల్‌లోని మామిడి తోటలో కాయలు రాలిపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో కురిసిన వర్షాపాతం వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వర్షపాతం 33.8 శాతంగా నమోదై జిల్లా సగటు వర్షాపాతం 2.81గా ఉంది.. జిల్లాలోని 16 మండలాల్లో అత్యధికంగా మహబూబాబాద్‌లో 17.8 శాతం నమోదైంది. కాగా బయ్యారంలో 9.2, డోర్నకల్‌లో 2.8, కేసముద్రంలో 2.2 వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.

38
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles