పేదల కుటుంబాల్లో వెలుగులు

Sat,April 20, 2019 01:47 AM

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కొలువులు వచ్చాయి. నిరుద్యోగుల కలలు సాకారం అయ్యాయి. కొత్త ఉద్యోగంతో కొత్త వెలుగులు నింపాయి. మొత్తం వారి కుటుంబాల్లో ఆనందం నింపింది. కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. రాష్ట్ర వ్యాప్త ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తించి జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 345పోస్టులకు పరీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థుల వద్ద దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం పరీక్ష నిర్వహించింది. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. జిల్లాకు ఎంపిక కాబడిన వారిలో అత్యధికంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఉద్యోగాలకు ఎంపిక కావడంపై వారి కళ్లలో ఆనందం నెలకొంది. తమ ఇంట్లో కొడుక్కి, కూతురుకు సర్కారు కొలువు రావడం ఆనందంగా ఉందని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత కొలువులన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తమ కుటుంబాలకు అండగా నిలిచిందని. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని ఉద్యోగాలు సాధించిన వారు తెలిపారు. ఒక ప్రభుత్వం ఉద్యోగం ఆ కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలుస్తుంది. దీందో ఉద్యోగం పొందిన వ్యక్తితో పాటు ఆ కుటుంబ సభ్యులు ఆనందంతో పొంగిపోతున్నారు. జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల పోస్టులు సాధించిన వారిలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని జాతిపిత అన్నారు. తెలంగాణలో గ్రామ స్వరాజ్యం వెల్లువిరుస్తుంది. సమగ్ర గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషితో గ్రామాల్లో పరిపాలన కొంగొత్త రీతుల్లో సాగనుంది. కొత్త గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు ఇటీవలే కొలువు దీరారు. ఇప్పుడు ప్రస్తుతం కొత్త కార్యదర్శులను ప్రభుత్వం నియమించడంతో పాలన జెట్ స్పీడుతో ముందుకు సాగనుంది. ఇటీవలే అర్హులైన వారికి అధికారులు నియామక పత్రాలు అందజేశారు. పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాలు భర్తీ చేయడంతో సర్కారీ కొలువులు సాధించామనే సంతోషం యువతలో కనిపిస్తుంది. గ్రామాలకు కొత్తగా పంచాయతీ కార్యదర్శులు రావడం వల్ల తమ సమస్యలు తీరుతాయని వివిధ గ్రామాల ప్రజలు భావిస్తున్నారు.

అమ్మనాన్నల ప్రోత్సాహంతో...
- ముత్యాల సంతోశ్‌కుమార్, జయపురం పంచాయతీ కార్యదర్శి
మాది చిన్న కిరాణ దుకాణం. నన్ను చదివించేందుకు నా తల్లిదండ్రులు వెనుకడుగు వేయలేదు. వారి కష్టాన్ని గుర్తించి అమ్మనాన్నల ఆశయాలను నెరవేర్చేందుకు శ్రమించాను. నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన నేను పంచాయతీ కార్యదర్శిగా కొలువు సాధించాను. డిగ్రీతో పాటు టీటీసీ చేశాను. నాకు నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా బాధ్యలు అప్పగించారు. ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ఏడాది పాటు ఇంట్లోనే ఉండి కష్టపడి చదివాను. పంచాయతీ కార్యదర్శి కొలువు కొట్టాను.

వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా
- భూక్య సుధాకర్, పంచాయతీ కార్యదర్శి పెద్దనాగారం స్టేజీ
మరిపెడ మండలం తానంచర్ల ఆనకట్టతండా మా ఊరు.. మా అమ్మనాన్న వ్యవసాయం చేస్తారు. నేను ఎం ఫార్మసీ చదివాను. ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నర్సింహులపేటకు చెందిన కొత్త గోవర్థన్‌రెడ్డి, అన్నం కలింగారెడ్డిలను ఆదర్శంగా తీసుకున్నాను. ఏడాది క్రితం గ్రూప్-2 కోసం హన్మకొండలో కొచింగ్ తీసుకున్నాను. పంచాయతీ కొలువు సాధించాను. పెద్దనాగారం స్టేజీ పంచాయతీ కార్యదర్శిగా జనరల్‌లోనే ప్రభుత్వ ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో మా అమ్మ, నాన్నతో పాటు కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. ప్రభుత్వానికి చెందిన ప్రతి పథకాన్ని ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తా.

పంచాయతీ కార్యదర్శి,కురవి
కులవృత్తినే నమ్ముకున్న తండ్రి కష్టాన్ని చూస్తూ పెరిగాను. రూపాయి రూపాయి కూడబెట్టి నన్ను చదవించిన నాన్న కష్టం గెలిచింది. మరిపెడ మండలం ఎడ్జర్ల గ్రామానికి చెందిన సమకూరి అశోక్ కురవి మండలం కొత్తూరు(సీ) పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో తన అనుభవాలను ఆయన మాటల్లోనే...నాన్న సమకూరి పిచ్చియ్య కల్లుగీత కార్మికుడు, అమ్మ లక్ష్మి ఇంటిపనితోపాటు అవసరమైన కూలీపనికి వెళ్లేది. ఎకరం వ్యవసాయ భూమిలో సాగుచేస్తూ ఇద్దరు చెల్లెల్లను, నన్ను ఎంతో కష్టపడి చదివించాడు. వారి ఆశయాలకు తగ్గట్టుగా ఎంతో కష్టపడి చదువుకున్నాను. ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చదువుకున్నాను. ఇంతలో పంచాయతీ కార్యదర్శుల నోటీసు పడగానే పరీక్ష రాశాను. ఉద్యోగంలో చేరడంతో ఎంతో సంతోషమేసింది. టీఆర్‌ఎస్ పుణ్యమాని ఉద్యోగం వచ్చింది. వచ్చిన ఉద్యోగానికి నా చదువును తోడుగా చేసుకుని కొత్తూరు(సీ) గ్రామాన్ని సర్పంచ్, పాలకమండలి సహాయంతో రూపురేఖలు మారుస్తాను. నా చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను చూశాను. పేదోళ్లకు సహయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తాను. తెలంగాణ రాష్ట్రం బంగారు రాష్ట్రంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ అసమానమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పల్లెసీమలు పచ్చగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా తయారుఅవుతుందని సీఎం కేసీఆర్ నమ్మకం. అందుకు తగ్గట్టుగా ప్రతీ పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండాలని తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం వలనే ఈ ఉద్యోగం వచ్చింది. దీని కోసం ఎంతో కష్టపడ్డాను. మానాన్న కష్టం...నా నిబద్దత కలిసి వచ్చింది. పంచాయతీ కార్యదర్శుల్లో ఒపెన్‌లో 95వర్యాంకు వచ్చింది.

ఆడపిల్లగా పుట్టడం సంతోషం
-మోతుకూరి సంధ్య, గుండ్రాతిమడుగు(విలేజ్) కార్యదర్శి- కురవి
ఆడపిల్లకు చదువెందుకులే అని నా తల్లిదండ్రులు అనుకుని ఉంటే నా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండేదో. గార్లమండల కేంద్రానికి చెందిన మోతుకూరి సంధ్య కురవి మండలం గుండ్రాతిమడుగు(విలేజ్) పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించింది. తన ఆనందం తన మాటల్లోనే.....సెంటు భూమి లేకున్నా...మా నాన్న వెంకటరాజ్యం, తల్లి జయమ్మలు కష్టపడి నన్ను మా అన్నయ్యను, మా అక్కయ్యలను చదివించారు. మేం గౌడ కులస్థులం. నాన్న కల్లుగీత కార్మికుడు. అమ్మ కూలీ పనులు చేస్తూ మమ్ములను చదవించింది. నేను బీఎస్సీ బీఈడీ చదివాను. నా లాంటి పేదోళ్లకు సహాయం చేయవచ్చు అనే ఆశయంతో ఈ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. అంతేకాకుండా నాకున్న చదువుతోపాటు స్థానికుల సహకారంతో గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్ధేందుకు కృషిచేస్తాను. మాతల్లిదండ్రుల కష్టం ఎప్పుడు నా కళ్ల ముందే మెదులుతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతనే మాలాంటి పేదోళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశ పెరిగింది. ఎటువంటి లంచం లేకుండా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ సాకారమవుతుంది.

148
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles