లోకరక్షకుడు ఏసుక్రీస్తు

Sat,April 20, 2019 01:47 AM

మహబూబాబాద్ టౌన్, మార్చి 30: కరుణామయుడు ఏసుక్రీస్తు అని, ప్రజలకు సుఖ శాంతులు అందించడం కోసమే ఏసు క్రీస్తు శిలువ వేయబడ్డాడని వరంగల్ ఫాతిమా చర్చి పీఠాధిపతి ఉడుముల బాల అన్నారు. శుక్రవారం మహబూబాబాద్‌లో గుడ్‌ప్రైడేను క్రైస్తవులు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు చర్చిల్లో ప్రార్థనలు, కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఫాతిమా స్కూలు నుంచి ఏసు క్రీస్తు వేషధారణ లో బెనార్డ్‌ప్రాన్సిస్ భక్తుడు శిలువతో శనిగపురంలోని ఏసు గుట్ట వరకు శిలువ యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన్ను క్రైస్తవులు అనుసరించి ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు శిలువ వేయబడ్డ నాటి సంఘటనలు, ఏసుక్రీస్తు శిలువ ప్రయాణంతోపాటు రక్తం చిందించిన తీరును కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. విచారణ గురువుగా శ్రావణ్, ఫాదర్ థామస్, థామస్, ప్రసాద్ వ్యవహరించారు. తీవ్ర ఎండను కూడా లెక్క చేయకుండా భక్తులు ఈ శిలువయాత్రలో పాల్గొన్నారు. శుభ శుక్రవారాన్ని ఎంతో పవిత్ర దినంగా భావించే క్రైస్తవ సోదరులు తన భక్తుల కోసమే ఏసు క్రీస్తు ప్రాణాలు అర్పించారని విశ్వసిస్తారు.

గుడ్‌ఫ్రైడే వేడుకల్లో భాగంగా మానుకోట శివారు శనిగపురంలోని ఏసుగుట్ట వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉడుముల బాల మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సమాజిక సేవ చేయాలనే సంకల్పంతో మహబూబాబాద్ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాన్ని చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా దేవుని మార్గంలో మంచి ఆలోచనలు ప్రేమ కరుణ కలిగి ఉండే విధంగా ఈ ప్రాంత ప్రజలకు సందేశాన్ని అందిస్తామని అన్నారు. అంతేకాకుండా పేద వాళ్ల కొరకు, స్త్రీల సంక్షేమం కోసం కుట్టు శిక్షణ, విద్యార్థుల కోసం కంప్యూటర్ శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలలో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ప్రపంచ శాంతి కోసం ఏసుక్రీస్తు శిలువ వేయబడ్డాడని తెలిపారు. ప్రతి ఒక్కరూ దైవం పట్ల ప్రేమ భావంతో మెలగాలని కోరారు. తోటి వారికి సేవ చేసినట్లయితే ఆ ఏసు క్రీస్తుకు సేవ చేసినట్లేనని చెప్పారు. ఆపదలో ఉన్న వారికి చేయూత అందించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలన్నారు. ఏసుక్రీస్తు శిలువ వేయబడిన 3 రోజుల సమయానికి తిరిగిలేచి దైవ లోకానికి చేరుకున్నారని చెప్పారు.

చర్చిల్లో ప్రార్థనలు
పట్టణంలోని సీఎస్సై చర్చి, ఏసుశక్తి సహవాస ఆలయం, బిలీవర్డ్స్, ఎల్షద్దాయ్ చర్చిల్లో గుడ్‌ఫ్రైడేను భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఉదయంనుంచే భక్తులు చర్చి వద్దకు చేరుకుని ప్రార్థనలు చేపట్టారు. ఏసు క్రీస్తు బోధనలను పాస్టర్లు వినిపించారు. గుడ్‌ఫ్రైడే రోజున ఏసు క్రీస్తు శిలువ వేయబడ్డ తీరును భక్తులకు సవివరంగా తెలియజేశారు. ఈసందర్భంగా ఏసు నామ స్మరణతో చర్చిలు మారుమోగింది. ఈ కార్యక్రమంలో డీఈఓ సత్యప్రియ,పిజె. వివేకానంద, బిషప్ ఎం.ఎడ్వర్డ్, అనుదీప్,ప్రేమానందం, ఎం.షీబారాణి, హనీశీలత పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles