టార్గెట్ జెడ్పీ పీఠం..

Thu,April 18, 2019 01:55 AM

- పల్లెల్లో మొదలైన పరిషత్ సందడి
- జిల్లా పరిధిలో 16 జెడ్పీటీసీలు, 198 ఎంపీటీసీ స్థానాలు
- అన్ని స్థానాలపై టీఆర్‌ఎస్ ప్రత్యేక దృష్టి..
- అభ్యర్థుల ఎంపికపై కసరత్తు..

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ క్లీన్‌స్వీప్ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ, పంచాయతీ, లోక్‌సభ ఎన్నికలను టీఆర్‌ఎస్ శ్రేణులు విజయవంతంగా నిర్వహించారు. జెడ్పీ ఎన్నికల షెడ్యూల్ ఈ నెలలో వెలువడనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భారీ విజయం సాధించే దిశగా టీఆర్‌ఎస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఎన్నికల ఇన్‌చార్జిగా రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు బాధ్యతలు అప్పగించారు. జిల్లా వ్యాప్తంగా 16 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 198 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించే విధంగా ప్రణాళిక రూపొందించారు. అయితే అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు మాత్రం ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ అప్పగించడంతో అశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఏ ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుంది. 2018 డిసెంబరులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. 2019 జనవరిలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్ మద్దతుదారులు అధికసంఖ్యలో గెలుపొందారు. 11న నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌లో సైతం టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. త్వరలో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఈ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ హవా కొనసాగేలా నాయకులు చర్యలు చేపట్టారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో 4జెడ్పీటీసీ స్థానాలు, డోర్నకల్ నియోజకవర్గంలో మరిపెడ, కురవి, డోర్నకల్, నర్సింహులపేట, దంతాలపల్లి, చిన్నగూడురు మండలాలకు చెందిన జెడ్పీటీసీలు, తొర్రూరు, పెద్దవంగర, బయ్యారం, గార్ల, కొత్తగూడ, గంగారం మండలాల జెడ్పీటీసీలతో పాటు 198 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

జెడ్పీ ఎన్నికల్లో వీటన్నింటినీ గెలుచుకునేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి. ఎంపీ ఎన్నికల సందడి ఇలా ముగిసిందో లేదో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు రానే వచ్చాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోలాహలంతో జిల్లాలో మరో పోరుకు రంగం సిద్ధమవుతోంది. జెడ్పీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయి. 2014 నిర్వహించిన జెడ్పీ ఎన్నికలకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు జెడ్పీ ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా 6జిల్లాలుగా విభజితమైంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, మహబూబాబాద్, ములుగు, భూపాల్‌పల్లి జిల్లాలుగా ఏర్పడ్డాయి. ఇందులో మహబూబాబాద్ జిల్లా పరిధిలో 16జెడ్పీటీసీలతో పాటు 198 ఎంపీటీసీ స్థానాలపై టీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. మెజార్టీ స్థానాలు గెలుపొంది అటు జెడ్పీపీఠంతో పాటు ఇటు ఎంపీపీ స్థానాలు కైవసం చేసుకునేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి. జిల్లా ఇన్‌చార్జిగా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును నియమించడంతో టీఆర్‌ఎస్ పార్టీలో మరింత జోష్ నెలకొంది. మాస్ లీడర్‌గా పేరున్న మంత్రి దయాకర్‌రావును జిల్లాకు ఇన్‌చార్జిగా నియమించడంతో నాయకులు, కార్యకర్తల్లో ఆనందం నెలకొంది. మంత్రి సమక్షంలోనే అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది.

అభ్యర్థుల ఎంపికపై ప్రధాన దృష్టి..
టీఆర్‌ఎస్ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై ప్రధాన దృష్టి సారించింది. త్వరలోనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో త్వరలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, నాయకులు త్వరలోనే సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీలో ముందు నుంచి కష్టపడి పని చేస్తున్న వారితో పాటు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయనున్నారు. ఇప్పటి నుంచే రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అలాగే పార్టీలో ఎక్కడ విభేదాలు తలెత్తకుండా ఉండే విధంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థుల ఎంపికపైనే టీఆర్‌ఎస్ నాయకులు ప్రధాన దృష్టి సారించారు. అనంతరం ప్రచార బాధ్యతలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సారథ్యంలో ఎమ్మెల్యేలతో కలిసి ప్రచారం చేపట్టనున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో టీఆర్‌ఎస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అభివృద్ధి, సంక్షేమమే ప్రచారం
జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమమే ప్రధానంశంగా ప్రచారం నిర్వహించనున్నారు. జిల్లా ఇన్‌చార్జిగా రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు ప్రచార బాధ్యతలు చేపట్టనున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు త్వరలో చేపట్టబోచే సంక్షేమ కార్యక్రమాలను జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు వివరించనున్నారు. జెడ్పీ పీఠం దక్కించుకోవాలనే ఉద్ధేశంతో టీఆర్‌ఎస్ నాయకులు ఇప్పటికే ప్రచార వ్యూహాలను రచిస్తున్నారు. అభివృద్ధి , సంక్షేమమే ద్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించి జెడ్పీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రజలను కోరనున్నారు.

62
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles