ధాన్యం సేకరణకు సిద్ధం

Wed,April 17, 2019 01:55 AM

-రేపటి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
-జిల్లా వ్యాప్తంగా 75 కేంద్రాలు ఏర్పాటు
-70వేల మెట్రిక్ టన్నుల సేకరణే లక్ష్యం
-48గంటల్లో రైతులకు చెల్లింపులు
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ధాన్యం సేకరణకు రంగం సిద్ధం చేశారు. ఈనెల 18నుంచి జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో శిక్షణ ఇవ్వనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వరికోతలు షురూ అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 75 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా 10లక్షల గన్నీ బ్యాగ్‌లు సిద్ధంగా ఉన్నాయి. గ్రేడ్-ఏ రకం ధాన్యానికి రూ.1770, కామన్ రకానికి రూ.1750మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ధాన్యం సేకరణ లక్ష్యం 70వేల మెట్రిక్ టన్నులు వస్తుందని పౌరసరఫరాల సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 16మండల కేంద్రాల్లో 75 సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం వరికోతల పనుల్లో రైతులు పూర్తిగా నిమగ్నమయ్యారు.

ఇప్పుడిప్పుడే ధాన్యం వస్తుండటంతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉండే ధాన్యాన్ని తరలించేందుకు జిల్లా యంత్రాంగం రవాణా కాంట్రాక్టర్లను వాహనాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. రైతులు ధాన్యం అమ్మిన తర్వాత 48 గంటల్లో చెల్లింపులు జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైతు కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మగానే నిర్వాహకులు రైతుల వివరాలను తమ వద్ద ఉన్న ట్యాబ్‌లో నమోదు చేస్తారు. అవి ఆన్‌లైన్ ద్వారా హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయానికి చేరుతాయి. అక్కడి నుంచి ఆన్‌లైన్ ద్వారా జిల్లా పౌరసరఫరాల సంస్థకు చేరుకుంటాయి. ఇక్కడ కొనుగోలు కేంద్రాలనుంచి వచ్చిన వివరాలతో డీఎం అధికారులు సరిచూసుకొని కన్ఫర్మేషన్ చేస్తారు. వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. జిల్లా వ్యాప్తంగా 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సుమారు 10 లక్షల గన్నీబ్యాగులను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే గోదాంలలో ఉన్న గన్నీస్‌ను అధికారులు సిద్ధం చేసి ఉంచారు. వీటిని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన తర్వాత అక్కడికి చేరవేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ధాన్యం నింపిన ఆ బస్తాలను లారీల్లో లోడ్‌చేసి సమీపంలోని మిల్లులకు తరలిస్తారు. కాగా జిల్లాలో ఇప్పటి వరకు గన్నీస్ కొరత లేదు.

75 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
జిల్లా వ్యాప్తంగా 16మండలాల్లో కలిపి మొత్తం 75 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఐకేపీ 22, సహకార సంఘాలు 45, జీసీసీ 5, మెప్మా 3 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా నిర్వాహకులకు క్వింటాల్‌కు రూ.32లు కమీషన్ ఇస్తున్నారు. అదే విధంగా హమాలీలకు క్వింటాల్‌కు రూ. 5.30లు ఇస్తున్నారు. జిల్లాలో మొత్తం 75 కొనుగోలు కేంద్రాల ద్వారా 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతుల వద్ద ధాన్యం సిద్ధంగా ఉండటంతో వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. 18 నుంచి వరుసగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

70వేల మెట్రిక్ టన్నుల లక్ష్యం
గత ఏడాది ఇదే సీజన్‌లో 60వేల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని పెట్టుకోగా ఈ సీజన్‌లో 70వేల మెట్రిక్ టన్నులు లక్ష్యంగా నిర్ధారించుకున్నారు. 75కొనుగోలు కేంద్రాల ద్వారా ఇవి సేకరించాలని నిర్ణయించారు. దీంతో పౌరసరఫరాల సంస్థ నిర్ధేశించిన లక్ష్యాన్ని దాటినప్పటికీ అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారు. ఈ సారీ సీజన్‌లో వరిపంట ఎక్కువ స్థాయిలో ఉండటంలో లక్ష్యాన్ని దాటుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎంతధాన్యం వచ్చినప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా కొనుగోలు కేంద్రాల్లో టార్పాయిన్లు కూడా అందుబాటులో ఉంచారు. అలాగే రైతులకు తాగునీరు, టాయిలెట్స్ తదితర సౌకర్యాలు సమకూర్చనున్నారు.

కొనుగోలు కేంద్రాలు ఇవే..
జిల్లా వ్యాప్తంగా 75కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో ఐకేపీ 22, పీఏసీఎస్45, జీసీసీ 5, మెప్మా3 ఉన్నాయి.
ఐకేపీ కేంద్రాలు ఇవే.. బయ్యారం మండలం వెంకట్‌రాంపురం, చిన్నగూడురు మండలం జయ్యారం, గూడురు, అయోధ్యపురం, కురవి మండలంలో కాంపెల్లి, తాళ్లసంకీస, కొత్తూరు (సి), సీరోలు, నేరడ, మహబూబాబాద్ మండలంలో కంబాలపల్లి, ఈదులపూసపల్లి, మల్యాల, ముడుపుగల్, రెడ్యాల, మాధవపురం, పర్వతగిరి, మరిపెడ మండలంలో రాంపురం, నెల్లికుదురు మండలంలో రామన్నగూడెం, బ్రాహ్మణకొత్తపెల్లి, మునిగలవీడు, పెద్ద వంగర, తొర్రూర్ మండలంలో మడిపల్లి. పీఎసీఎస్ కేంద్రాలు ఇవే.. బయ్యారం, దంతాలపల్లి మండలంలో గున్నెపల్లి, డోర్నకల్ మండలంలో మన్నెగూడెం, చిల్కోడు, గార్ల, గూడురు,

అప్పరాజుపల్లి, అయోధ్యపురం, కేసముద్రం మండలంలో ధన్నసరి, కాట్రపల్లి, ఇనుగుర్తి, కల్వల, కొత్తగూడ మండలంలో పోగులపల్లి, సాయిరెడ్డిపల్లి, గుండంపల్లి, ఎదుల్లపల్లి, మైలారం, మోకాళ్లపల్లి, బాతులపల్లి, కొత్తగూడ, కురవి మండలంలో కాంపెల్లి, గుండ్రాతిమడుగు(విలేజ్), కురవి, చింతపల్లి, నేరడ, మహబూబాబాద్ మండలంలో జంగిలిగొండ, కంబాలపల్లి, నడివాడ, అయోధ్య, మహబూబాబాద్ మార్కెట్, అమనగల్, మరిపెడ మండలంలో బురాన్‌పురం, నర్సింహులపేట, నెల్లికుదురు మండలంలో రామన్నగూడెం, శ్రీరామ్‌గిరి, ఆలేరు, నెల్లికుదురు, ఎర్రబెల్లిగూడెం, మేచరాజుపల్లి, పెద్దవంగర మండలంలో చిట్యాల, తొర్రూర్ మండలంలో అమ్మపురం, హరిపిరాల, చర్లపాలెం, మటెడు. జీసీసీ కేంద్రాలు ఇవే.. గూడురు మండలంలో మాచర్ల, కొత్తగూడ మండలంలో కొత్తగూడ, ఓటాయి, వెలుబెల్లి, మైలారం మెప్మా కేంద్రాలు.. మహబూబాబాద్ మండలం శనిపురం, జమాండ్లపల్లి, మరిపెడ ప్రాంతాల్లో ఉన్నాయి.

56
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles