అర్హులందరూ ఓటేయాలి..

Mon,March 25, 2019 02:26 AM

- జిల్లా కలెక్టర్ శివలింగయ్య
- మహబూబాబాద్‌లో ఓటర్ల అవగాహన ర్యాలీ

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, మార్చి24: అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ శివలింగయ్య పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని ఆదివారం స్వీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటర్ల అవగాహన కార్యక్రమం, సిగ్నేచర్ క్యాంపెయిన్‌లో కలెక్టర్ శివలింగయ్య, జూనియర్ కామన్‌వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ గోల్డ్ మెడలిస్ట్ ఎర్ర దీక్షిత, స్టేట్ చెస్ ఛాంపియన్ రాజేశ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్‌లోని మదర్ థెరిస్సా విగ్రహం నుంచి ఆర్టీసీ బస్‌స్టేషన్ వరకు ఓటర్లను చైతన్య పర్చేందుకు ప్లకార్డులతో పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. అనంతరం.. బస్‌స్టేషన్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా స్వీప్ కార్యక్రమాల ద్వారా అభ్యర్థులు తమ పేరు ఓటర్ లిస్ట్‌లో ఉందాలేదా అనే విషయాన్ని ఆన్‌లైన్‌లో పరిశీలించుకోవాలన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు తదితర నినాదాలతో హోర్డింగ్‌లు, కళాజాత ద్వారా విస్తృత ప్రచారం చేసి సాధారణ ప్రజలు, యువత, దివ్యాంగ ఓటర్లకు ఓటు హక్కు నమోదు, వినియోగంపై చైతన్యం కల్పించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో స్వీప్ ప్రచార కార్యక్రమాల వల్ల జనాభా ప్రకారం ఉండవలసిన నాలుగు శాతం కన్నా ఎక్కువ యువ ఓటర్లు నమోదయ్యారని అన్నారు.

అదే విధంగా మూడు శాతం దివ్యాంగులు నమోదు కావాల్సి ఉండగా 3.5శాతం నమోదయ్యారని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 88.8శాతం పోలింగ్ నమోదవగా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతం అధికంగా పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. 2016 పీడబ్ల్యూడీ యాక్ట్ ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో దివ్యాంగులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. దివ్యాంగులకు ఇంటి నుంచి పోలింగ్ కేంద్రం వరకు ఉచిత రవాణా, పోలింగ్ కేంద్రాల వద్ద వీల్‌చైర్ ఏర్పాటు మూగ, చెవిటి వారికి సైన్ లాంగ్వేజ్ ద్వారా వివరణ, అంధులకు బ్రెయిలీ లిపి ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అంతేగాకుండా ప్రత్యేక క్యూలైన్లు, టాయిలెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల అనుభవాలతో ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జేసీ డేవిడ్ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సేవకుడిని తమ అమూల్యమైన ఓటు హక్కుతో ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. ఓటర్లందరూ నిజాయితీగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం నిర్వహించిన సిగ్నేచర్ క్యాంపెయిన్‌లో కలెక్టర్ శివలింగయ్య, జేసీ డేవిడ్, అడిషనల్ ఎస్పీ గిరిధర్, జిల్లా ఎన్నికల అధికారులు స్వచ్ఛందంగా ఓటు వేస్తామని సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారులు శ్రీనివాస్‌రావు, సత్యప్రియ, జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు, డీఎస్పీ నరేశ్‌కుమార్, ఆర్డీవో పీఈటీలు, అంగన్‌వాడీలు, ఆశవర్కర్లు, ఐకెపీ సిబ్బంది, కళాజాత బృందాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు పాల్గొన్నాయి.

46
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles