మొదటి రోజు నిల్

Tue,March 19, 2019 02:33 AM

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్‌ను రిటర్నింగ్ అధికారి సీహెచ్ శివలింగయ్య సోమవారం విడుదల చేశారు. ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో నోటిఫికేషన్ విడుదల చేయగా, 11గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించినప్పటికీ మొదటి రోజు నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ నెల 18 నుంచి 25వ తుదీ వరకు ప్రతీ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 26వ తేదిన నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉప సంహరణకు ఈనెల 28 మధ్యాహ్నం 3గంటల వరకు గడువు ఉంది. అనంతరం ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు.

నామినేషన్ వేయడానికి అభ్యర్థితో పాటు మరో నలుగురికి రిటర్నింగ్ కార్యాలయంలోకి వెళ్లేందుకు అవకాశం కల్పించారు. ఒక అభ్యర్థి నాలు గు సెట్ల నామినేషన్లు సమర్పించవచ్చు. రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వందమీటర్ల దూరంలో ఉండాలి. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. రిటర్నింగ్ అధికారి కార్యాలయం సమీపంలో 144సెక్షన్ అమలు చేస్తున్నారు. నిబంధనలు ఎవరు అతిక్రమించినా కేసులు నమోదు చేయనున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకర్గంలో 1735 పోలింగ్ కేంద్రాలకు 2148 బ్యాలెట్ యూనిట్లు, 2148 కంట్రోల్ యూనిట్లు, 2749 వీవీ ప్యాట్లు కేటాయించారు. వీటి మొదటి లెవల్ చెకింగ్ పూర్తి చేసి సిద్ధంగా ఉంచారు.

నోటిఫికేషన్ విడుదల..
మహబూబాబాద్ (ఎస్టీ) పార్లమెంట్ నియోజకవర్గ నామినేషన్ల నోటిఫికేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శివలింగయ్య విడుదల చేశారు. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ను రిటర్నింగ్ అధికారి కార్యాలయంతో పాటు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లి నియోజకవర్గాలు అయిన ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సహాయ రిటర్నింగ్ అధికారి కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యాలయాల్లోని నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించినట్లు శివలింగయ్య తెలిపారు. 18 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో 21న హోళి, 23న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు, 24న ఆదివారం ప్రభుత్వ సెలవు లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ఉండదు. పలు పార్టీలకు చెందిన నాయకులు ఇది గమనించాలని శివలింగయ్య తెలిపారు.

మొదటి రోజు బోణీ కొట్టలేదు..
నామినేషన్ల షెడ్యూల్ విడుదలైన తర్వాత మొదటి రోజైన సోమవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. రెండో రోజైన మంగళవారం నామినేషన్లు దాఖలయ్యే అవకాశం తక్కువగా ఉంది. కాగా, రిటర్నింగ్ అధికారి కార్యాలయ సమావేశ మందిరంలో నామినేషన్లు వేసే వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నామినేషన్ పత్రాలు కూడ ఈ కేంద్రం నుంచి పొందాల్సి ఉంటుంది. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థులు రూ.12,500 నగదు, చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

60
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles