మూడు వాగులపై 30 చెక్‌డ్యాంలు

Mon,March 18, 2019 02:06 AM

నర్సింహులపేట, మార్చి 17 : రైతుల పంటలకు సాగునీరు అందిచడంతో పాటు, భూగర్భ జలాలు పెరిగేందుకు డోర్నకల్ నియోజవర్గంలోని పాలేరు, మున్నేరు. ఆకేరు వాగులపై రూ.100 కోట్లతో మరిన్ని చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టనున్నట్లు డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ తెలిపారు. ఆదివారం మండలంలోని ముంగిముడుగు శివారు ఆకేరు వాగుపై రూ. 2.98 కోట్లతో చేపట్టిన చెక్‌డ్యాం నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ.. గతంలో నిర్మించిన చెక్‌డ్యాం నీటి ప్రవాహానికి తెగిపోయిందని దీంతో మళ్లీ చెక్‌డ్యాం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ నిర్మాణం వల్ల ఇరువైపులా ఉన్న పంటపొలాలకు సాగు అందనుందని వివరించారు.

ఇప్పటికే పాలేరు, మున్నేరు, ఆకేరు వాగులపై 30 చెక్‌డ్యాంల నిర్మాణం చేసినట్లు వెల్లడించారు. అవసరమైన ప్రతీ చోట చెక్‌డ్యాం నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మండలంలోని కౌసల్యదేవిపల్లి శివారు వద్ద తెగిపోయిన చెక్‌డ్యాం నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. జయపురం, బొజ్జన్నపేట శివారు ఆకేరు వాగుపై, కొమ్ములవంచ, నెల్లికుదురు మండలం మదనతుర్తి శివారు ఆకేరు వాగుపై, డోర్నకల్ మండలం మున్నేరు వాగుపై గుర్రపతండా, ముల్కలపల్లి, బంజార, సత్యతండా, పాతదుబ్బతండా వద్ద చెక్‌డ్యాంలు నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఇరిగేషన్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. దంతాలపల్లి మండలంలోని వివిధ గ్రామాల శివారు పాలేరు వాగుపై చేపట్టిన 6 చెక్‌డ్యాంలు నిర్మాణం త్వరలో పూర్తికానున్నట్లు ఎమ్మెల్యే రెడ్యా వెల్లడించారు.

నీరు నిల్వ ఉండేలా చర్యలు..
డోర్నకల్ నియోజవర్గంలోని ఆకేరు, పాలేరు, మున్నేరు వాగులపై ప్రతీ రెండు కిలోమీటర్లకు ఒక చెక్‌డ్యాంను నిర్మించి, నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. వాగులో నీరు నిల్వ ఉంటే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్టంలో చెక్‌డ్యాంల నిర్మాణం కోసం రూ. 2వేల కోట్లు కేటాయించారని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను చేపడుతుందని ఎమ్మెల్యే వివరించారు.

రైతులకు టేకు మొక్కల పంపిణీ ..
తెలంగాణ ప్రభుత్వం హరితహారం పథకంలో భాగంగా అన్ని గ్రామాల్లో నూతనంగా నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నట్లు డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని ఫకీరతండా శివారులో ఏర్పాటు చేసిన నర్సరీని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న టేక్ మొక్కలను రైతులు తమ పొలం గట్లపై పెంచుకోవాలని సూచించారు. అలాగే ప్రతీ ఇంటి ఆవరణంలో 6 మొక్కలు నాటుకొని సంరక్షించుకోవాలన్నారు. గ్రామాల్లోని నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను వచ్చే వానకాలం నాటికి రైతులకు, ప్రజలకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ డోర్నకల్ నియోజవర్గ యువ నాయకుడు డీఎస్ రవిచంద్ర, సర్పంచ్‌లు మేరుగు శంకర్‌గౌడ్, శంకర్ నాయక్, బొడపట్ల నర్సయ్య, ఎంపీటీసీ నాయకీ, మనోహర్, నాయకులు వెంకన్న, కాలు, ఉదయ్, బాబురావు, సూరయ్య, ఎల్లగౌడ్, రంగన్న, భీముడు, వీరన్న ఉన్నారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles