నామినేషన్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు

Mon,March 18, 2019 02:05 AM

-జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ : నామినేషన్ల కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉన్నటువంటి పలు పార్టీల అభ్యర్థులు ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎదుట ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 వరకు నామినేషన్స్ దాఖాలుచేసుకోవచ్చని తెలిపారు. నామినేషన్ ఫైల్ చేసే అభ్యర్థులు మహబూబాబాద్ పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తే మందుగానే ర్యాలీ పర్మిషన్ తీసుకోవాలని ఆదేశించారు.

నామినేషన్ ఫైలింగ్ సందర్భంగా పటాకులు కాల్చడం, ప్రమాదకరమైన పెట్రోలుతో విన్యాసాలు చేయకూడదని హెచ్చరించారు. నామినేషన్ ఫైలింగ్‌కు 3 వాహనాలు మాత్రమే అనుమతి ఉందని గుర్తుచేశారు. ర్యాలీకి మైక్ పర్మిషన్ అవసరమైతే ముందుగానే అనుమతి తీసుకోవాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు చూపించిన రూటు మ్యాప్ ప్రకారం నడుచుకోవాలన్నారు. ఒకే రోజు ఒకటి కంటే ఎక్కువ అభ్యర్థులు పట్టణంలో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేసే సందర్భంలో మొదటగా వచ్చిన అప్లికేషన్‌కు మొదటి ప్రాధాన్యత రెండో అప్లికేషన్‌కు రెండో ప్రాధాన్యతగా పరిగణించి అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ర్యాలీ అనుమతి పొందిన వారు అనుమతి పత్రంలో ఉన్న నిబంధనలను పాటించి ర్యాలీ పూర్తి చేయాలని సూచించారు. మహబూబాబాద్ పట్టణంలో భారీగా పోలీస్‌బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.

35
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles