ప్రాణాలు కాపాడుతున్న ప్రభుత్వ దవాఖాన

Sun,March 17, 2019 02:16 AM

-ప్రాణాలు కాపాడుతున్న డయాలిసిస్ కేంద్రం
-జిల్లా కేంద్రంలో డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు
-సకాలంలో రోగులకు అందుతున్న వైద్యం
-టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దీవెనలు
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ సర్కార్ మూత్రపిండాల బాధితులకు పునర్జన్మనిస్తుంది. ఖరీదైన వైద్యం అందిస్తూ పేదల ప్రాణాలకు భరోసా ఇస్తోంది. మారుమూల ప్రాంతాల్లో ఉచితంగా సేవల ందిస్తూ ప్రభుత్వం ప్రాణాలు కాపాడుతోంది. డయాలిసిస్ చేయాలంటే గతంలో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రుల్లో మాత్రమే సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా డయాలిసిస్ కేంద్రాలను ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కార్పొరేట్ దవాఖానకు దీటుగా వైద్యం అందిస్తుంది. జిల్లా కేంద్రంలో డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో చాలా మంది పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఒకప్పుడు డయాలిసిస్ చేయించుకోవాలంటే జిల్లా వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లాకేంద్రంలోని ఏరియా దవాఖానలో గత సంవత్సరం డయాలిసిస్ సెంటర్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి రోగులు ఇక్కడే వైద్య సేవలుచేయించుకుంటున్నారు. మూత్ర పిండాలు పని చేయని స్థితిలో ఉన్నప్పుడు కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియను డయాలిసిస్ అంటారు. మూత్ర పిండాలకు రెండు పద్దతుల ద్వారా వైద్యం చేయించుకోవచ్చు. మొదటికి మూత్ర పిండాలను మార్పిడి చేయడం, రెండోది డయాలిసిస్ చేయడం. మూత్ర పిండాల మార్పిడి చాలా ఖర్చుతో కూడుకున్నది. పేద, మధ్యతరగతి ప్రజలు డయాలిసిస్‌పై ఆధారపడాల్సి వస్తోంది. దీనిని గుర్తించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాలైన ఇల్లందు, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు ప్రాంతాల్లో గత సంవత్సరం డయాలిసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రారంభించారు.

జిల్లాలో డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు
జిల్లాలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల కోసం డయాలిసిస్ సెంటర్‌ను జిల్లా కేంద్రంలో గత సంవత్సరం ప్రారంభించారు. 2018 ఏప్రిల్ 10న అప్పటి రాష్ట్ర వైద్యాఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి ప్రారంభించారు. గిరిజనులు ఎక్కువగా నివసించే మహబూబాబాద్ ఏరియా దవాఖానలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. డయాలిసిస్ కోసం జిల్లా కేంద్రం నుంచి పొరుగు జిల్లాలకు వెళ్లడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగేవి. దీంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లా కేంద్రంలో డయాలిసిస్ సెంటర్‌ను ప్రారరంభించింది. 2018 మే23 నుంచి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. నాటి నుంచి 36మంది రోగులు డయాలిసిస్ చేయించుకుంటున్నారు. డయాలిసిస్ సెంటర్‌లో సింగిల్ యూజ్ సిస్టంను అమలు చేస్తున్నారు.

రూ.75లక్షలు ఆదా..
జిల్లా ఏరియా దవాఖానలో డయాలిసిస్ సెంటర్‌ను ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు 36 మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు. 36మంది రోగులకు 2,500 సార్లు డయాలిసిస్ చేశారు. ఒక రోగికి ఒకసారి డయాలిసిస్ చేస్తే కనీసం రూ.3వేల ఖర్చు వస్తుంది. ఆరోగ్య శ్రీ సేవల ద్వారా పూర్తిగా ఉచితంగా ప్రభుత్వం రోగులకు సేవలు అందిస్తుంది. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే రూ.75లక్షలు ఖర్చు అయ్యేది. కానీ, 36మంది రోగులకు రూ.75లక్షలు ఆదా అయినట్టే. వ్యాధి తీవ్రతను బట్టి రోగికి మూడు సార్లు, మరోరోగికి వారానికి రెండుమార్లు డయాలిసిస్ చేస్తున్నారు.

వారానికి మూడుమార్లు చికిత్స
వ్యాధి తీవ్రతను బట్టి కొంతమందికి వారానికి మూడు మార్లు, మరికొంతమందికి వారానికి రెండు మార్లు డయాలిసిస్ చేస్తున్నారు. నిత్యం ఏరియా ఆసుపత్రిలో ఒక డాక్టర్, ఇద్దరు కాంపౌండర్లు, మరో ఇద్దరు సహాయకుల పర్యవేక్షణలో నాలుగు విభాగాలు చికిత్స అందిస్తున్నాయి. ఒక రోగికి డయాలిసిస్‌కు కనీసం 4గంటల సమయం పడుతుంది. నిత్యం నాలుగు షిప్టులుగా వైద్యం అందిస్తున్నారు.

ఏడు లక్షలు ఖర్చు చేశాను
మాది నెల్లి కుదురు మండలంలోనిచెట్ల ముప్పారం. గత సంవత్సరం అక్టోబర్‌లో కాళ్లు బాగా వాపు రావడంతో మానుకోటలో ఒక డాక్టర్‌ను సంప్రదించగా కిడ్నీలు పాడైపోయాయని డయాలసిస్ చేయాలని అన్నారు. దీంతో, నేను హైదరాబాద్‌లోని యశోద దవాఖనలో డయాలసిస్ చేయించుకున్నాను. దాదాపు రూ. 6 నుంచి 7లక్షల వరకు ఖర్చు వచ్చింది. మహబూబాబాద్ ఏరియా దవాఖానలో డయాలసిస్ సెంటర్ ఉందని తెలిసి డిసెంబర్ నుంచి ఇక్కడ చిక్సిత యించుకుంటున్నాను.

ఎలికట్ట దేవేందర్,చెట్ల ముప్పారంపేదలకు వరం..
మాది బయ్యారం మండలంలోని బాలాజీ పేట. నాలుగు నెలల క్రితం వైద్య పరీక్షలు చేయించగా కిడ్నీలు పాడైపోయాయని డాక్టర్లు తెలిపారు. ఆరోగ్య శ్రీ కార్డు తో ఉస్మానియా దవాఖానలో రెండు నెలలు డయాలసిస్ చేయించుకున్నాను. మహబూబాబాద్‌లో డయాసిస్ సెంటర్ ఉందని తెలిసినప్పటి నుంచి ఇక్కడే చిక్సిత చేయించుకుంటున్నాను. సెంటర్‌ను ఏర్పాటు చేయడం వరంగా భావిస్తున్నాను.

గుడిబోయిన వాసుదేవ రావు, బాలాజి పేట, బయ్యారం మండలం
హైదరాబాద్‌కు వెళ్లే వాడిని
మాది కేసముద్రం మండలం. నేను గత సంవత్సరం నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను. రెండు నెలలు హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స చేయించుకున్నాను. ఒకసారి డయాలసిస్ చేస్తే రూ. మూడు వేలు తీసుకుంటారు. వారానికి మూడు సార్లు వెళ్లాలంటే బాగా ఖర్చుయ్యేది. హైదరాబాద్ వెళ్లి రావడం చాలా కష్టంగా ఉండేది. ఏరియా దవాఖానలో కేంద్రం ఏర్పాటు చేయడంతో నాకు ఖర్చు తగ్గింది.

రామ్‌సింగ్, కేసముద్రం
కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నారు
మాది గూడురు మండలంలోనిఅవుసల్ తండా. రెండు సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను. గతంలో ఉస్మానియా దవాఖానలో డయాలసిస్ చేయించుకున్నాను. తర్వాత హన్మకొండలోని ఓ దవాఖానలో అరోగ్యశ్రీ కార్డు తో ఉచితంగా చేయించుకున్నాను. కానీ, వారంలో మూడు సార్లు వెళ్లి రావాలంటే చార్జీలు అయ్యేవి. ఇప్పుడు మనుకోట సెంటర్‌లో వైద్యం చేయించుకోవడంతో ఖర్చు తగ్గింది. ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటా.
-టి. వీరసింగ్, అవుసలి తండా, గూడూరు

అప్రమత్తంగా ఉండాలి
జాల్లా కేంద్రంలో డయాలిసిస్ సెంటర్‌ను ప్రారంభించడంతో ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంది. ఎంతో మంది ఇక్కడ చికిత్స పొందుతున్నారు. కార్పోరేట్ స్థాయిలో వైద్యం అందిస్తుండటంతో రోగులందరూ ఏరియా దవాఖాకే వస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఇప్పటి వరకు 36 మందికి డయాలిసిస్ చేశాం. మరింత మందికి సేవలందించేందుకు కృషి చేస్తాం. ఒక రోజుకు నాలుగు షిప్టుల్లో రోగులకు చికిత్స అందిస్తున్నం. షుగర్, బీపీ, పెయిన్ కిల్లర్ మందులు ఎక్కువగా వాడొద్దు.

45
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles