నేటి నుంచి సర్పంచ్‌లకు శిక్షణ

Thu,February 21, 2019 03:09 AM

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లా వ్యాప్తంగా ఇటీవల కొత్తగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచ్‌లకు నేటి నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. 2018లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టంపై శిక్షణతో పాటు అవగాహన కల్పించనున్నారు. 21 నుంచి మార్చి 13 వరకు నాలుగు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. 2019 జనవరి 21, 25, 30 తేదీల్లో మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కొత్త సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించనున్నారు. కొత్త సర్పంచ్‌లకు నూతన పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి 4ఎంపీడీవోలు, ఇద్దరు ఈవోపీఆర్డీలు, 4 రిసోర్స్ పర్సన్స్ హైదరాబాద్‌లో 5రోజుల పాటు శిక్షణ పొందివచ్చారు. అక్కడ శిక్షణలో నేర్చుకున్న అంశాలన్నీ జిల్లాలోని సర్పంచ్‌లకు కులంకషంగా వివరించనున్నారు. జిల్లాలో మొత్తం 16 మండలాల పరిధిలో 461 గ్రామపంచాయతీలు ఉండగా ఇందులో 458 గ్రామపంచాయతీలకు, 3,999 మంది వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ముందుగా జిల్లాలో ఉన్న 458మంది సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు. సర్పంచ్‌లకు శిక్షణ పూర్తైన తర్వాత ఉప సర్పంచ్‌లకు, అనంతరం వార్డు సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. 21నుంచి మార్చి13వరకు మొత్తం 4విడతల్లో నిర్వహించనున్నారు. ఒక్కో విడతలో 4మండలాలకు చెందిన సర్పంచ్‌లకు అవగాహన కల్పించనున్నారు.

ప్రతీ నాలుగు మండలాలను యూనిట్‌గా తీసుకొని రెండు బ్యాచ్‌లుగా విభజించారు. రెండు మండలాలకు ఒక బ్యాచ్ చొప్పున ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని మహబూబాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతీ విడతలో 5 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తండాలు, గూడేలను గ్రామపంచాయతీలుగా చేసి దశాబ్ధాల నాటి ప్రజల కలను నేరవేర్చింది. 1994 పంచాయతీరాజ్ చట్టం స్థానంలో 2018 కొత్త పంచాయతీరాజ్‌చట్టానికి రూపకల్పన చేసి అమలులోకి తెచ్చింది. దీంతో కొత్త చట్టంపై అవగాహన కల్పించేందుకు అధికారులు సమాయత్తం అయ్యారు. 21 నుంచి మార్చి 13 వరకు రిసోర్స్‌పర్సన్ వీరికి అనేక అంశాలపై అవగాహన కల్పిస్తారు. జిల్లా వ్యాప్తంగా 16 మండలాల పరిధిలో ఉన్న 458 మంది సర్పంచ్‌లను నాలుగు బృందాలుగా విభజించారు. ఒక్కో బృందంలో 4మండలాలకు చెందిన సర్పంచ్‌లు నూతన పంచాయతీరాజ్ చట్టంపై సర్పంచ్‌లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం ద్వారా రాబోయే ఐదేళ్లలో గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు మరింత అంకితభావంతో పనిచేసేలా దిశానిర్ధేశం చేయనున్నారు. గతంలో ఉన్న చట్టానికి ప్రస్తుతమున్న చట్టంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో చెక్‌పై సర్పంచ్‌తో పాటు గ్రామకార్యదర్శి సంతకం చేసేవారు. కొత్తచట్టం ప్రకారం సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్ సంతకం తప్పనిసరి చేశారు.

జిల్లాకు చేరిన మెటీరియల్
కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభం కానుంది. సర్పంచ్‌లకు శిక్షణ కోసం కావాల్సిన మెటీరియల్‌ను ప్రభుత్వం జిల్లాకు పంపించింది. ఇందులో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం -2018 పుస్తకంతో పాటు గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల కరదీపిక, ఒక నోట్‌బుక్, ఒక పెన్నును సర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమం-2019, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం మహబూబాబాద్ జిల్లా అని రాసి ఉన్న బ్యాగ్‌లో మెటీరియల్‌ను అందించనున్నారు. శిక్షణకు వచ్చే ప్రతీ సర్పంచ్‌కు ఈ మెటీరియల్‌ను అందజేస్తారు. సర్పంచ్‌లు కరదీపికను చదవాల్సి ఉంటుంది. అందులో ఉన్న సెక్షన్ల ప్రకారం ఎలా అమలు చేయాలో పంచాయతీరాజ్ చట్టం-2018 బుక్‌లో చూస్తే సులువుగా అర్ధం కానుంది. 5రోజుల పాటు వారు జిల్లా కేంద్రంలో ఉండటానికి, భోజన సదుపాయంతో వసతి ఏర్పాట్లు చేశారు. జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి పర్యవేక్షిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా ముఖ్య అతిథులుగా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌లు పాల్గొననున్నారు.

ఏర్పాట్లు పూర్తి
జిల్లా వ్యాప్తంగా ఉన్న 458మంది కొత్త సర్పంచ్‌లకు కొత్త చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్యంగా ప్రతీగ్రామంలో నర్సరీతో పాటు ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు పెంచేవిధంగా చూడాల్సిన బాధ్యత సర్పంచ్‌లదే. అంతేకాకుండా మిషన్ భగీరథ ద్వారా వచ్చే స్వచ్ఛమైన మంచినీటిని ప్రతీ గడపకు అందించాలి. నిత్యం గ్రామంలో చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించేలా చూడాలి. ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి కట్టుకునేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా అనేక అంశాల్లో కొత్తచట్టంపై సర్పంచ్‌లకు అవగాహన కల్పించనున్నారు. జిల్లా వ్యాప్తం గా 16 మండలాలను 8 బృందాలుగా విభజించారు. ఒక్కో విభాగంలో 4మండలాల పరిధిలోని సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు. గురువారం నుంచి శిక్షణను మహబూబాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తారు. మొదట జిల్లా కేంద్రంలోని ఐటీడీఏ గిరిజనభవన్‌లో నిర్వహించాలని అధికారులు నిర్ణయించినప్పటికీ అనివార్య కారణాలతో వేదికను మహబూబాబాద్ ఎంపీడీవో కార్యాలయానికి మా ర్చారు. 21నుంచి 25 వరకు మహబూబాబాద్, గార్ల, డోర్నకల్, బయ్యారం మండలాలకు చెందిన 120 మంది సర్పంచ్‌లకు, రెం డో విడతలో 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు కురవి, గంగారం, కొత్తగూడ, నెల్లికుదురు మండలాలకు చెందిన 117 మంది సర్పంచ్‌లకు, మూడో విడతలో మార్చి 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కేసముద్రం, దం తాలపల్లి, గూడూరు, నర్సింహులపేట మం డలాలకు చెందిన 118 మందికి, 4వ విడతలో మార్చి 9 నుంచి 13 వరకు తొర్రూరు, పెద్దవంగర, మరిపెడ, చిన్నగూడురు మండలాలకు చెందిన 103 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 4 విడతల్లో 458 మంది సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.

విడతల వారీగా ప్రజాప్రతినిధులకు శిక్షణ
- డీపీవో రంగాచారి
జిల్లా వ్యాప్తంగా ఉన్న 458మంది సర్పంచులకు గురువారం నుంచి శిక్షణ ప్రారంభిస్తున్నాం. 21నుంచి మార్చి 13వరకు కొనసాగుతుంది. 16 మండలాల పరిధిలోని సర్పంచ్‌లకు నాలుగు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో విడతలో 4మండలాల పరిధిలోని సర్పంచ్‌లు శిక్షణ పొందుతారు. మొత్తం 458మంది సర్పంచ్‌లకు నాలుగు విడతల్లో శిక్షణ ఇస్తాం. సర్పంచ్‌ల శిక్షణ ముగిసిన తర్వాత ఉప సర్పంచ్‌లకు, అనంతరం వార్డు సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

77
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles