ఉద్యమకారులను దగా చేస్తున్న తెలంగాణ జన సమితి


Thu,September 13, 2018 01:34 AM

మహబూబాబాద్ టౌన్, సెప్టెంబర్ 12: తెలంగాణ జన సమితి(టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, జిల్లా ఇన్‌చార్జి డోలి సత్యనారాయణ తప్పుడు నిర్ణయాలు, అమ్ముడుపోయే విధానాలు ఉద్యమకారులను దగా చేసేలా ఉన్నందువల్ల టీజేఎస్ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు అందజేసినట్లు తెలంగాణ దగాపడ్డ ఉద్యమకారుల వేదిక వ్యవస్థాపకుడు ధరంసోత్ నారాయణసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన బంజార గిరిజన నిరుద్యోగిని అయిన తాను కాకతీయ యూనివర్సిటీలో పోస్టు గ్రాడ్యుయేట్ చదువుతూ తెలంగాణ మలివిడత ఉద్యమం ఆవిర్భావం నుంచి పాల్గొన్నానని తెలిపారు. ఆమరణ నిరాహార దీక్షలు మొదలు.. పల్లెపల్లె పాదయాత్ర సహా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ జేఏసీ తొలినాళ్ల నుంచి క్రియాశీల ఉద్యమకారుడిగా ఉన్నానని తెలిపారు. తదనంతరం కోదండరాం నేతృత్వంలో ఏర్పడిన తెలంగాణ జనసమితి.. ప్రగతి కోసం, అవినీతి అంతం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయమే లక్ష్యంగా పని చేస్తుందని భ్రమపడ్డానని తెలిపారు.

దీంతో నా చదువు, నా కుటుంబ వ్యవహారాలను వదిలిపెట్టి తెలంగాణ జన సమితిలో పని చేశాను అని పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీలో సెలక్షన్, కలెక్షన్ తప్ప ఎలక్షన్‌ల్లో సిద్ధాంత ప్రాతిపదికన వెళ్లే పరిస్థితి లేదని ఆరోపించారు. అవకాశవాదంతో డబ్బులకు అమ్ముడుపోతున్న పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. మొదటి నుంచి పోరాడిన ఉద్యమకారులను విస్మరిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం, మహబూబాబాద్‌తో ఏనాడూ సంబంధం లేని ములుగు ప్రాంతానికి చెందిన పోరిక అభినందనను ఎమ్మెల్యే చేస్తామంటూ మాయమాటలతో మభ్యపెట్టి నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. టీజేఏసీ, తెలంగాణ జనసమితి పార్టీగా ఏర్పాటయ్యాక అక్రమ వసూళ్లు, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలే పరమావదిగా వ్యవహరించడం శోచనీయమన్నారు. ఉద్యమ పార్టీ అంటూ వారు చెప్పే మాయమాటలు, మోసపూరిత ప్రగల్భాలను విద్యార్థులు, యువకులు, ప్రజలు నమ్మొద్దని కోరారు. బుధవారం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను కలిసి రాజీనామా లేఖను సమర్పించినట్లు స్పష్టం చేశారు. ప్రజాస్వామిక వాదులంతా తెలంగాణ జనసమితి ముసుగులో అనగారిన సామాజిక వర్గాలకు చేస్తున్న మోసాలను ఖండించాలని ఆ ప్రకటనలో నారాయణసింగ్ పిలుపుచ్చారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...