కారు జోరు.. విపక్షాల బేజారు..

Wed,September 12, 2018 03:14 AM

-ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్
-పొత్తులతో ప్రతిపక్ష పార్టీల్లో అయోమయం
-ఆయా స్థానాలపై ఎవరి ధీమా వారిది
మహబూబాబాద్‌జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : జిల్లాలో కారు జోరు కొనసాగుతోంది. టీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ జిల్లాకు చెందిన అభ్యర్థులను ప్రకటించారు. పేర్లను ప్రకటించిన మరుసటి రోజు నుంచి అభ్యర్థులు ముందుగా పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే కేసీఆర్‌కు తిరిగి పట్టం కట్టనున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి తమను ఆశ్వీరిదించాలని ప్రజలను కోరుతున్నారు. టీఆర్‌ఎస్ జోరుతో ప్రతిపక్షాలు పొత్తుల వ్యవహారంలో ఇంకా నీలినీడలు కొనసాగుతుండడంతో జిల్లాలో టికెట్ ఆశిస్తున్న నాయకులు అయోమయంలో ఉన్నారు. ఇప్పటికే ప్రచారంలో నిత్యం టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రతీ మండలంలో ప్రచారం చేస్తూ దూసుకుపొతున్నారు.
మహబూబాబాద్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యుల ఇంటికి వెళ్లి కలిశారు. జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ నాయకులను కలిసి ఆశ్వీరాదాలు తీసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలను కోరుతున్నారు. జిల్లా కేంద్రంలోని వీర బ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ప్రజల ఆదరణ టీఆర్‌ఎస్ పార్టీకి ఉందని, ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు చేసినా నియోజకవర్గంలో గెలుపు తనదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ పేరును కేసీఆర్ ప్రకటించిన తరువాత దంతాలపల్లి నుంచి మరిపెడ వరకు రెడ్యానాయక్ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యువత పెద్ద ఎత్తున తరలివచ్చి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే దంతాలపల్లి, నర్సింహులపేట, చిన్నగూడురు, మరిపెడ, కురవి, డోర్నకల్ మండలాల్లో ఆయన జోరుగా పర్యటిస్తున్నారు. ముఖ్యమైన నాయకులతో పాటు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని సూచిస్తున్నారు. మంగళవారం కురవి మండలం నేరడలో పర్యటించారు. అనంతరం కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యను మర్యాదగా పూర్వకంగా కలిశారు.

పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు, పెద్దవంగర మండల కేంద్రాల్లో తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రచార జోరు పెంచారు. రెండు మండలాల్లో దయాకర్‌రావు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఇల్లెందు నియోజకవర్గానికి సంబంధించి బయ్యారం, గార్ల మండలాల్లో తాజా మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య దూసుకెళ్తున్నారు. రెండు మండలాల్లో ఇతర పార్టీల నుంచి భారీ ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. దీంతోపాటు మంగళవారం బయ్యారం, గార్ల మండలాల్లో వేలాది మంది యువతతో బైక్‌ర్యాలీ నిర్వహించి రెండు మండలాల్లో టీఆర్‌ఎస్ జెండాలు రెపరెపలాడించారు. ఈ రెండు మండలాల్లో టీఆర్‌ఎస్ ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
ములుగు నియోజకవర్గానికి చెందిన కొత్తగూడ, గంగారం మండలాల్లో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఇప్పటికే మంత్రి అజ్మీరా చందూలాల్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో విజయభేరీ మోగించేందుకు గడపగడపకూ ప్రచారాన్ని జోరుగా చేసేలా నాయకులు, కార్యకర్తలకు సలహాలు, సూచనలు ఇచ్చారు.

గందరగోళంలో విపక్షాలు..
జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇంకా గందరగోళంలోనే ఉన్నాయి. కాంగ్రెస్, టీడీపీ పొత్తుల వ్యవహారం ఇరుపార్టీల నాయకుల్లో కీచులాటకు దారితీస్తోంది. ఇప్పటికే మానుకోట స్థానాన్ని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారే తమకు కావాలంటే తమకు కావాలని రాజధానిలో ముఖ్యనేతల వద్ద ఉండి ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ నుంచి డాక్టర్ మురళీనాయక్, కేంద్ర మాజీ సహాయ మంత్రి పోరిక బలరాంనాయక్, సుచిత్ర, దసృనాయక్, హుస్సేన్‌నాయక్ ఆశిస్తున్నారు. టీడీపీ నుంచి తనకే ఈ స్థానాన్ని కేటాయించాలని మోహన్‌లాల్ పట్టుపడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితుడని మానుకోట నియోజకవర్గం సీటు పొత్తులో టీడీపీకి వస్తుందని, తనకే టిక్కెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఈ రెండు పార్టీల నాయకులు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మానుకోట నియోజకవర్గాన్ని ఏ పార్టీకి కేటాయిస్తారో అనే అంశంపై ఆయా పార్టీల కార్యకర్తలు, నాయకుల్లో గందరగోళం నెలకొంది. ఒక పార్టీకి కేటాయిస్తే మరో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ అభ్యర్థికి మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని పలువురు భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ టికెట్ కేటాయిస్తే ఎమ్మెల్యే టికెట్‌కు ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో ఒకరికి టికెట్ ఇస్తే మిగతా నలుగురు అభ్యర్థులు ఓడించే అవకాశం ఉన్నందున ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీ పార్టీనే లేదని, కనీసం నాయకులు కూడా కనిపించడం లేదని కాంగ్రెస్ నాయకులు తమ పార్టీకే టికెట్ కేటాయించాలని అధిష్టానం వద్ద డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఇలా ఉండగా సీపీఐ, తెలంగాణ జన సమితి పార్టీ నాయకులు తమకే ఈ స్థానాన్ని కేటాయించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్, టీడీపీ మధ్య సఖ్యత లేదని బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. ఇక సీపీఐ, తెలంగాణ జన సమితి ఓటు బ్యాంకు లేకున్నా ఎలా టికెట్ అడుగుతారని, ఇతర పార్టీల నాయకులు వారి అధిష్టానం వద్ద ఫిర్యాదులు చేస్తున్నారు. మానుకోట టికెట్‌పై అటు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి మధ్య పొత్తుల వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో కార్యకర్తలు, నాయకుల్లో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.

ఇక డోర్నకల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకే టికెట్ ఇవ్వాలని నాయకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు నాయకుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. జాటోత్ రామచంద్రునాయక్, మాలోత్ నెహ్రూనాయక్ పేర్లు ప్ర ముఖంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి టికెట్ ఆశించకపోవడంతో దాదాపు కాంగ్రెస్‌కే ఖరారు కావచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక్కడ టికెట్ ఎవరికి ఇచ్చినా టీఆర్‌ఎస్ అభ్యర్థి రెడ్యానాయక్ గెలుపు ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
టీఆర్‌ఎస్ జోష్..
టీఆర్‌ఎస్ అభ్యరులు ఇంటింటి ప్రచారం ప్రారంభించి అన్ని పార్టీలకంటే ముందంజలో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు పొత్తులు, సీట్ల వ్యవహారం కొలిక్కి రాకముందే టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో జోష్ పెంచారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆట, పాటలు, నృత్యాలతో స్వాగతం పలుకుతున్నారు. పొత్తుల వ్యవహారం తేలకపోవడం, ఏయే పార్టీకి ఏ నియోజకవర్గంలో స్థానం కల్పిస్తారో ఇప్పటి వరకూ స్పష్టత లేకపోవడంతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని టీఆర్‌ఎస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

158
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles