ఎన్‌క్యూఏఎస్‌కు అర్హత..

Wed,September 12, 2018 03:13 AM

-తొర్రూరు, బయ్యారం పీహెచ్‌సీలకు మహర్దశ
-మూడేళ్లపాటు ఏటా రూ. 3 లక్షల చొప్పున దవాఖానల అభివృద్ధికి నిధులు
-ఫలించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారుల కృషి
-బయ్యారం పీహెచ్‌సీకి 76.60 పాయింట్లు
-తొర్రూరు పీహెచ్‌సీకి 75.50 పాయింట్లు
-ఆనందం వ్యక్తం చేసిన డీఎంహెచ్‌వో శ్రీరాం
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి/బయ్యారం, నమస్తే తెలంగాణ:
రోగులకు ఉత్తమ సేవలు అందించడమేకాకుండా.. ఆరోగ్యకరమైన వాతావరణం కలిగి ఉన్న జిల్లాలోని రెండు పీహెచ్‌సీలు ఎన్‌క్యూఏఎస్‌కు అర్హత సాధించాయి. కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఎన్‌క్యూఏఎస్(నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్) తనిఖీ బృందం ఇటీవల చేసిన పరిశీలనలో జిల్లాలోని తొర్రూరు, బయ్యారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎంపికైనట్లు మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం అందింది. బయ్యారం పీహెచ్‌సీకి 76.60 పాయింట్లు, తొర్రూరు పీహెచ్‌సీకి 75.50 పాయింట్లు రావడంతో ఎన్‌క్యూఏఎస్‌కు ఎంపికయ్యాయి. వీటికి మూడేళ్లపాటు జాతీయ హెల్త్ మిషన్ ద్వారా వైద్యశాలల అభివృద్ధికి నిధులు సమకూరనున్నాయి. కలెక్టర్ శివలింగయ్య పలుసార్లు ప్రభుత్వ దవాఖానల పటిష్టానికి సూచనలు, తనిఖీలు చేయడం.. తదనుగుణంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరాం వైద్యశాలల సందర్శన, జాతీయ తనిఖీ బృందానికి ఇచ్చిన నివేదికలతో ఈ రెండు దవాఖాలనకు మహర్దశ పట్టినట్లయింది.

కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా..
కార్పొరేట్ వైద్యశాలలకు తీసిపోకుండా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నుంచి మొదలు.. సామాజిక, ఏరియా, జిల్లా వైద్యశాలలు అనే తేడా లేకుండా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఎన్‌క్యూఏఎస్ విధానాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ దవాఖానల్లో నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలపై గత జూలై 30, 31వ తేదీల్లో తొర్రూరు, ఆగస్టు 1, 2వ తేదీల్లో బయ్యారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జాతీయ తనిఖీ బృందం ప్రతినిధులు పరిశీలన చేశారు. ఈ బృందం పరిశీలనలో ఉన్న అంశాల ప్రాతిపదికన 75 మార్కులకు పైబడి ఏ ప్రభుత్వ దవాఖాన అర్హత సాధిస్తే.. దానికి మూడేళ్లపాటు వివిధ కార్యక్రమాల కోసం నిధులు సమకూరుతాయి. జిల్లాలోని తొర్రూరు, బయ్యారం పీహెచ్‌సీలను ముందుగా పరిశీలించాలని నిర్ణయించుకున్న బృందం.. నాలుగు రోజులపాటు ఈ రెండు దవాఖానలను పరిశీలించారు.

శాఖల వారీగా పరిశీలన..
ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆరు డిపార్ట్‌మెంట్లుగా విభజించి.. కేంద్రం నుంచి వచ్చిన ఎన్‌క్యూఏఎస్ ప్రతినిధులు మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన కంద్వా జిల్లా వైద్యశాల ఆర్‌ఎంవో డాక్టర్ శక్తిసింగ్‌రాథోడ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టానికి చెందిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ అల్కాగుప్తా పరిశీలించారు. దవాఖానల్లోని రికార్డుల నిర్వహణ, వైద్య సేవల్లో నాణ్యత, రోగులకు సేవలు అందించే సమయంలో వారి హక్కులకు ఎక్కడైనా భంగం కలుగుతోందా, వైద్య సేవలు అందించే సమయంలో వైద్యులకు, రోగులకు సంక్రమిత వ్యాధులు ప్రబలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో పరిశీలించనున్నారు. ఔట్‌పేషంట్, ఇన్‌పేషంట్, లేబర్ రూం(ప్రసవాల గది), చికిత్స నిమిత్తం వచ్చిన వారికి ప్రయోగశాలలో వైద్య పరీక్షలు, మందుల వితరణ, జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల నిర్వహణ తీరు, దవాఖాన పరిశుభ్రత, నిబంధనలకు లోబడి నిర్వహణ ఏ విధంగా ఉంది అనే అంశాలను పరిశీలిస్తూ వైద్యశాలల్లో పని చేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందిని వివిధ కోణాల్లో ప్రశ్నించి మార్కులను కేటాయించారు.

దవాఖానల అభివృద్ధికి నిధుల వినియోగం
ఎన్‌క్యూఏఎస్ అధికారుల బృందం తనిఖీల్లో తొర్రూరు, బయ్యారం పీహెచ్‌సీలు 75 మార్కులకు పైగా పాయింట్లు పొందడంతో అర్హత సాధించాయి. ఈ రెండు పీహెచ్‌సీల అభివృద్ధి కోసం మూడేళ్లపాటు జాతీయ హెల్త్ మిషన్ ద్వారా ఏటా రూ. 3 లక్షల చొప్పున నిధులు కేటాయించనున్నారు. మూడేళ్లపాటు ఈ నిధులను కేంద్రం మంజూరు చేస్తుంది. ఈ నిధులతో వైదశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. తొర్రూరు దవాఖాన డీఎంహెచ్‌వో డాక్టర్ కోటాచలంతోపాటు వైద్యులు ఈ ఎంపికపై ఆనందాన్ని వెలుబుచ్చారు. ప్రభుత్వ వైద్యశాలల పనితీరుకు ఈ అర్హత అద్దం పడుతోందన్నారు.

పీహెచ్‌సీల ఎంపిక ఆనందంగా ఉంది
జిల్లాలోని బయ్యారం, తొర్రూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎన్‌క్యూఏఎస్ ప్రతినిధుల బృందం తనిఖీల్లో అర్హత పాయింట్లను సాధించడం ఆనందంగా ఉంది. ఈ గుర్తింపు ద్వారా ఈ రెండు దవాఖానల అభివృద్ధికి మూడేళ్లపాటు నిధులు సమకూరడమే కాకుండా జాతీ య స్థాయిలో తీసుకునే విధానపరమైన నిర్ణయాలకు తగినట్లు సౌకర్యాల కల్పన కోసం జాతీయ హెల్త్ మిషన్ ద్వారా సహకారం లభిస్తుంది. జిల్లాలో రెండు వైద్యశాలలను తనిఖీలు చే యగా, ఈ రెండు అర్హత సాధించడం సంతోషాన్ని కలిగించింది.
- డాక్టర్ శ్రీరాం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

105
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles