ప్రచార హోరు

Mon,September 10, 2018 02:19 AM

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లావ్యాప్తంగా ప్రచారం హోరెత్తుతోంది. అన్ని పార్టీల కంటే ముందుగానే సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. ఆ మరుసటి రోజు నుంచి జిల్లావ్యాప్తంగా ప్రచారం ఊపందుకుంది. మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, డోర్నకల్ నుంచి డీఎస్ రెడ్యానాయక్, పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ములుగు నియోజకవర్గం నుంచి పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ఇల్లెందు నుంచి కోరం కనకయ్యకు టికెట్లు లభించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ అభ్యర్థుల పేర్లు ప్రకటించిన మరుసటి రోజు నుంచి అభ్యర్థులు తమతమ నియోజకవర్గాల్లో ప్రచారం ప్రారంభించారు. మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ టికెట్ ప్రకటించిన మరుసటి రోజు నెల్లికుదురు మండలం కాచికల్ నుంచి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వరకు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించి ప్రచారం హోరెత్తించారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. అఖండ మెజార్టీతో గెలుపొందేలా కృషి చేయాలని సూచించారు. కేసముద్రంలో ముఖ్య కార్యకర్తల ఇళ్లకు వెళ్లి తమ గెలుపునకు సహకరించాలని కోరారు. అనంతరం అక్కడే నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనపై నమ్మకంతో టికెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

నాలుగేళ్లలో చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తమ గెలుపునకు కృషి చేస్తాయని, ఇందుకోసం కార్యకర్తలు ప్రజాక్షేత్రంలోకి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తీసుకెళ్లాలని సూచించారు. గూడూరులో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి శంకర్‌నాయక్ గెలుపు కోసం ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు. శనివారం మహబూబాబాద్ నుంచి టికెట్ ఆశించిన టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు బానోత్ రవికుమార్ ఇంటికి తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ వెళ్లి తన గెలుపునకు కృషి చేయాలని కోరారు. డోర్నకల్ తాజా మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా దంతాలపల్లి మండల కేంద్రానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వేలాది మందితో బైక్‌ర్యాలీ నిర్వహించారు. దంతాలపల్లి నుంచే మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దంతాలపల్లి, నర్సింహులపేట మీదుగా మరిపెడకు చేరుకుని అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంటింటా ప్రచారం నిర్వహించాలని తెలిపారు. భారీ మెజార్టీతో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాజా మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి ఇళ్లకు వెళ్లి కలిశారు. తన గెలుపునకు కృషి చేయాలని కోరారు. పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు పెద్దవంగర, తొర్రూరు మండలాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. అంతకు ముందు మసీదు, చర్చిల్లో ప్రార్థనలు చేశారు. తొర్రూరులో ఇంటింటా ప్రచారం ఇప్పటికే ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. ఆదివారం నాంచార్‌మడూరు, వెలికట్టె గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య బయ్యారం, గార్ల మండలాల్లో పర్యటించారు. బయ్యారం మండలంలో ఇతర పార్టీల నుంచి సుమారు 200 కుటుంబాలను టీఆర్‌ఎస్‌లో చేర్పించుకున్నారు. టీఆర్‌ఎస్ గెలుపునకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

టీఆర్‌ఎస్ జోష్
టీఆర్‌ఎస్ అధిష్టానం టికెట్లు ప్రకటించడంతో అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. దీంతో జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్ జోష్ కొనసాగుతోంది. అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు ప్రణాళికలు సిద్ధం చేశారు. మెజార్టీపైనే అందరూ అంచనాలు వేస్తున్నారు. ప్రతిపక్షాల నుంచి అభ్యర్థులు ఎవరైనా మట్టి కరిపించాలనే లక్ష్యంతో దూసుకెళ్తున్నారు.

జోరుగా టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం
ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 105 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఎవరూ ఊహించని విధంగా తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయి. ఇప్పటికీ ఏ నియోజకవర్గానికి ఎవరు అభ్యర్థి అనేది తేల్చుకోలేక తికమక పడుతున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులను సీఎం ప్రకటించిన మరుసటి రోజు నుంచే జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీ శ్రేణులతోపాటు టికెట్ రానివారి ఇళ్లకు వెళ్లి మంతనాలు జరిపి తమ గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు. టీఆర్‌ఎస్ ప్రచార హోరుతో జిల్లా మొత్తం గులాబీమయంగా మారింది. జిల్లానుంచి అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. అన్ని స్థానాల్లో గెలుపు ఖాయమని అభ్యర్థులు భావిస్తున్నప్పటికీ మెజార్టీపైనే అంచనాలు వేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు.

186
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles