మహబూబాబాద్ టౌన్ : జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు మోరెం వెంకటాద్రి(96) ఆదివారం మృతి చెందాడు. పట్టణంలోని వెంకటేశ్వరబజార్లో ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు భార్య రాధాలక్ష్మి, ఇద్దరు కుమారులు బాలరాజు, రామ్మూర్తి, కుమార్తెలు సావిత్రి, రాజ్యం ఉన్నారు. కాగా, సీపీఐ జిల్లా కార్యదర్శి బీవిజయసారథి వెంకటాద్రి మృతదేహంపై పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నగూడూరు ప్రాంతానికి చెందిన మోరెం వెంకటాద్రి నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దళంలో పనిచేసి తుపాకి గుండ్లకు గురైన గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. చివరి శ్వాస వరకు కమ్యూనిస్టు పార్టీ కోసం ఆలోచించిన గొప్ప నాయకుడన్నారు. కాగా అంతిమయాత్రలో సీపీఐ నాయకులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బీ అజయ్, సీపీఐ పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చింతకుంట్ల వెంకన్న, జిల్లా కౌన్సిల్ సభ్యులు రేషపల్లి నవీన్, తోట విజయ్, లింగాల విజయ్, భారత రమేశ్, ఏ వీరన్న, కన్నె రాజు పాల్గొన్నారు.