వెంకన్న ఆలయానికి మహర్దశ

Thu,September 6, 2018 01:45 AM

-అభివృద్ధి వైపు నర్సింహులపేట దేవాలయం అడుగులు
-రూ.కోటితో పది వసతి గదులు
-ఎమ్మెల్యే రెడ్యానాయక్ కృషి..
-ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు,అర్చకులు

నర్సింహులపేట, సెప్టెంబర్ 05: సమైక్య రాష్ట్రంలో ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాల రూపురేఖలు మారుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రతీ ఆలయానికి పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. నియోజకవర్గంలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే వేంకటేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి ఇప్పటికే రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసి.. ఆలయాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. ధూపదీప నైవేద్యాలతో కోవెలలు నిత్యం కళకళలాడేలా ప్రభుత్వం నిధులు వెచ్చిస్తోంది. నర్సింహులపేట ఆలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి రూపాయలు ప్రకటించారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే కళియుగ ఆరాధ్య దైవంగా, తెలంగాణలో పేరుగాంచిన మండలకేంద్రంలోని ఇంద్రకీలాద్రి పర్వతాలపై పద్మావతి, ఆండాళ్ అమ్మవారి సమేతలుగా 1968లో శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటా స్వామి వారి బ్రహ్మోత్సవాలను హోళి పౌర్ణమి రోజున ఘనంగా నిర్వహిస్తారు. 50 ఏళ్ల క్రితం కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి కోసం నాటి పాలకులు నామమాత్రంగా నిధులు విడుదల చేసి చేతులు దులుపుకునేవారు. ఆలయ అభివృద్ధి కోసం నాటి మంత్రి నెమరుగొమ్ముల యతిరాజారావు, ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్‌రావు సహకారంతో కొంత అభివృద్ధికి నోచుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ప్రజాప్రతినిధులు మారినా ఆలయ అభివృద్ధి కోసం ఎలాంటి పనులు చేపట్టలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి రూ. కోటి మంజూరు చేయించారు. దేవస్థాన పరిధిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పది వసతి గదుల నిర్మాణం, ముఖద్వారం మంజూరు చేయించారు. ఇప్పటికే అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులుతో సమానంగా వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి

స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 1993లో రూ. 16 లక్షల వ్యయంతో సత్రాలను నిర్మించారు. అవి మూన్నాళ్ల ముచ్చటగానే మారి పది కాలాలపాటు ఉండాల్సిన సత్రాలు శిథిలావస్థకు చేరుకోగా విశ్రాంతి భవన గదుల్లో ప్లోరింగ్ పగిలిపోయింది. నిర్మించిన భవనం ఎప్పుడు కూలుతుందోననే భయం భక్తుల్లో నెలకొనడంతోపాటు ఈ సత్రాలకు ఉన్న కిటికీలు ధ్వంసమయ్యాయి. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు చెట్లకిందే సేదతీరాల్సిన పరిస్థితి. ప్రతీ శనివారం మండలకేంద్రంలో సంత ఉండడంతో భక్తుల రాక ఉన్నా నాటి ప్రజాప్రతినిధులు కనీస వసతులు కూడా కల్పించకపోవడం, చెట్లకింద వంట లు చేసుకోవడంతో కోతుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొవడం, తలనీలాలు సమర్పించుకునే వారికి ప్రత్యేక గదులు లేకపోవడంతో శిథిలావస్థకు చేరిన పాత కల్యాణ మండపం దిక్కయింది. దేవస్థాన ప్రాంగణంలో వ్యాపార సముదాయాలకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో చెట్లకింద భక్తులు రద్దీగా ఉండే ప్రదేశంలోనే వీటిని ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పడటాన్ని గమనించిన ఎమ్మెల్యే రెడ్యా దేవాలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి నిధులు కేటాయించేందుకు చొరవ తీసుకున్నారు.

కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం..

శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థాన అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. కోటి మంజూరు చేయడంతో బుధవారం దేవస్థాన కమిటీ చైర్మన్ కాల్సాని వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 ఏళ్ల చరిత్రలో దేవస్థాన అభివృద్ధి కోసం ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించేందుకు సహకరించిన ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల మాజీ అధ్యక్షుడు ఎండీ ఖాజామియా, వీరారెడ్డి, విజయ్‌రెడ్డి, నర్సింహరెడ్డి, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, భిక్షం, శైలం, అభినయ్ తదితరులు పాల్గొన్నారు.

112
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles