ఇంటర్ పరీక్షలకు సాంకేతిక దన్ను

Fri,February 17, 2017 01:03 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 16 : ఇంటర్ బోర్డు పరీక్ష నిర్వహణ విషయంలో ప్రభుత్వం పలు మార్పులు తీసుకువస్తోం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా వినియోగించుకుంటోంది. ఈ యేడాది ప్రాక్టికల్ పరీక్షలకు ఆన్‌లైన్ విధానాన్ని జోడించి ప్రశ్నపత్రాలతో పా టు మూల్యాంకనాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గతంలో ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాలకు ముందుగానే రిజిస్టర్ పోస్టు ద్వారా ప్రశ్నపత్రాలు చేరుకునేవి.

ప్రస్తుతం పరీక్ష సమయానికి అరగంట ముందు పరీక్ష పర్యవేక్షకుడి సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ (వన్ టైం పాస్‌వర్డ్) ద్వారా ప్రశ్నపత్రం డౌన్‌లోడ్ చేయనున్నారు. దీనివల్ల ప్రశ్నపత్రం లీకేజీ, చూచిరాత వంటి సమస్యలు తలెత్తకుండా చేస్తున్నారు. వార్షిక పరీక్షలకు కూడా మార్పులు తీసుకువస్తున్న అధికారులు విద్యార్థులు ఇబ్బందులు పడకుండా కేంద్రాల వివరాలను సెల్‌ఫోన్‌లో తెలుసుకునేలా లోకేటర్ పేరుతో సరికొత్త యాప్‌ను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నారు.

మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ 10, ప్రైవేట్ 43, మోడల్ స్కూల్ 8, ఎయిడెడ్ 1, గిరిజన సంక్షేమ 1, దళిత సంక్షేమ జూనియర్ కళాశాలలు 4 ఉన్నాయి. థియరీకి సంబంధించి మొత్తం 21 పరీక్ష కేంద్రాలను అధికారులు గుర్తించగా మొదటి సంవత్సరం 6,810, ద్వితీయ సంవత్సరం ఇంటర్‌ను 6,766 మంది విద్యార్థులు చదువుతున్నారు.

దారిచూపే లొకేటర్ యాప్..


ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 1 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఇతర కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పర్యవేక్షకులతో పాటు వి ద్యార్థులకు కూడా పరీక్ష కేంద్రం చిరునామా గుర్తించటం కష్టంగా మా రుతోంది. ఇలాంటి ఇబ్బందులను గుర్తించిన ఇంటర్మీడియట్ బోర్డు సెంటర్ లొకేటెడ్ యాప్‌కు శ్రీకారం చుట్టింది.

సెల్‌ఫోన్‌లో ప్లే స్టోర్‌లోకి వెళ్లి టీఎస్‌బీఐఈ సెంటర్ లొకేటర్ యాప్ అని టైప్ చేస్తే ఇంటర్ బోర్డు లోగో వస్తుంది. దీనిని మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని వ్యూ లొకేషన్ అన్న ఆప్షన్‌ను ఎంచుకుంటే పరీక్ష కేంద్రం ఏ ప్రాంతంలో ఉందో తెలిసిపోతుంది. ఈ యాప్‌ను జీపీఎస్‌కు అనుసంధానం చేయడం వల్ల కేంద్రానికి చేరుకునే దారి కూడా చూపుతుంది. దీనివల్ల విద్యార్థుల ఇబ్బందులు తీరడంతో పాటు పర్యవేక్షణ అధికారులు కూడా చిరునామా కోసం ఎవరినీ అడగకుండా నేరుగా చేరుకునే వీలుంటుంది.

పరీక్ష కేంద్రాల ఫొటోల అప్‌లోడ్...


ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలుగా ఎంపికచేసిన 21 జూనియర్ కళాశాలల ఫొటోలను జిల్లా అధికారులు ఇప్పటికే అప్‌లోడ్ చేసినట్లు ఇంటర్ బోర్డు అధికారి అహ్మద్ తెలిపా రు. స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న విద్యార్థులు టీఎస్‌బీఐఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే పరీక్ష కేంద్రానికి దారి చూపడంతో పాటు దానిని గుర్తించేందుకు ఫొటో కూడా కనిపిస్తుంది. ఎంత సమయంలో కేంద్రానికి చేరుకోవచ్చు? ఇంకా ఎంత దూరం వెళితే పరీక్ష కేంద్రం వస్తుంది? అన్న సమగ్ర సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా ఉంటుంది. దీంతో సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకునే విధంగా విద్యార్థులు ప్రణాళికను రూపొందించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

142
Tags

More News

మరిన్ని వార్తలు...