రేపటి నుంచి చెక్కుల పంపిణీ

Fri,February 17, 2017 01:02 AM

మహబూబాబాద్‌జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ:పేద కుటుంబాల్లో జన్మించిన ఆడ పిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందజేసేందుకు చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబార్ పథకాలు.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. అంతేకాకుండా ఆయా కుటుంబాల్లో ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాయి. ఒక్కో వధువుకు ప్రభుత్వం రూ. 51 వేలు అందజేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే జిల్లాలో చాలా మంది లబ్ధిపొందారు. డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇటీవల మరిపెడలో పంపిణీ చేశారు. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్దవంగర మండలాలకు చెందిన లబ్ధిదారులకు సైతం చెక్కులు అందజేశారు.

పెండింగ్ దరఖాస్తులకు మోక్షం


ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తహసీల్దార్లు, ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో పరిశీలించి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు శనివారం నుంచి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇల్లెందు నియోజకవర్గమైన బయ్యారం, గార్ల, ములుగు నియోజకవర్గం గంగారం, కొత్తగూడ, మహబూబాబాద్ నియోజకవర్గం మానుకోట, కేసముద్రం, నెల్లికుదురు, గూడురు మండలాల్లో శనివారం నుంచి వరుసగా పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

బయ్యారం తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెలే కోరం కనకయ్య చెక్కులు పంపిణీ చేయనున్నారు. మహబూబాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో శనివారం మహబూబాబాద్, నెల్లికుదురు మండలాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ నెల చివరి వారంలో కేసముద్రం, గూడూరు మండలాలకు చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.

అలాగే, గార్ల మండలంలోని లబ్ధిదారులకు ఈ నెలలో చెక్కులు అందజేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. లబ్ధిదారులకు అందించే రూ. 51 వేలు నేరుగా వధువు ఖాతాల్లోనే జమ అవుతుండడంతో అనేక పేద కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఆడపిల్లల పెళ్లిళ్లు భారమైన ఈ రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం తమకు అండగా నిలుస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెబుతున్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...