వీరన్న జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు


Fri,February 17, 2017 01:01 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 16: ఈనెల 24న జరిగే కురవి వీరభద్రస్వామి కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కురవి శ్రీవీరభద్రస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండాతగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో చలవ పందిళ్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు దర్శించుకునేందుకు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు.

ఆలయాన్ని ప్రత్యేక విద్యుద్దీపాలతో అలంకరించాలి


ఆలయాన్ని ప్రత్యేక విద్యుద్దీపాలతో అలంకరించాలని అధికారులకు కల్టెకర్ సూచించారు. ఆలయ ప్రాంగణంలో మూడు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు. బైపాస్‌రోడ్డు నుంచి చెరువు వరకు, పోలీస్‌స్టేషన్ నుంచి మరిపెడ రోడ్ వరకు, ఎస్సారెస్పీ కెనాల్ వరకు తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వీటి ఏర్పాటు ఈనెల 20లోగా పూర్తి కావాలని కోరారు. దేవాలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించేలా షిప్టుల వారీగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసి, ప్రతి పది మందికి ఒక సూపర్‌వైజర్ ద్వారా పర్యవేక్షించాలని డీపీవోను ఆదేశించారు.

ఆర్‌అండ్‌బీ సిబ్బంది రోడ్లకు ఇరువైపులా ఉన్న ఉపయోగం లేని చెట్లను తొలగించాలని, రోడ్లను మరమ్మతులు చేయాలని కోరారు. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు స్నాన ఘట్టాలు, మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగునీటి సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. మంచినీటి ఓహెచ్‌ఆర్‌ఎస్‌ను ట్యాంకులకు క్లోరినేషన్ చేయాలని డీపీవోను ఆదేశించారు.

మందులను అందుబాటులో ఉంచాలి


గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి కల్యాణ మండపం వరకు ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి, మందులు అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. దేవాలయం వద్ద నుంచి సినిమా థియేటర్ వరకు మురికి కాల్వలను శుభ్రం చేయాలన్నారు. జాతరలో ఎవరైనా పిల్లలు తప్పిపోతే వెంటనే వారి వివరాలు ప్రకటించేలా ఏర్పాట్లు తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాల్లో మద్యం దుకాణాల్లో ఎంఆర్‌పీకే మద్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో జేసీ దామోదర్‌రెడ్డి, అన్ని శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS