నకిలీ విత్తనాలతో నష్టపోయాం


Fri,February 17, 2017 01:00 AM

కురవి, ఫిబ్రవరి16 : పంటలపై రైతులకు అవగాహన, మిర్చి, పత్తి పంటలను పరిశీలించేందుకు వచ్చిన జిల్లా వ్యవసాయాధికారి ఛత్రునాయక్‌ను కురవి మండల కేంద్రంలో నకిలీ విత్తనాలపై మహిళా రైతులు నిలదీయడంతో ఆయన కంగుతిన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం పత్తిసాగుపై అవగాహన కల్పించేందుకు వచ్చిన వ్యవసాయాధికారులకు తిరుగుముఖంలో ఎక్కేటి నాగమణి, ఎక్కేటి సుభద్ర అనే మహిళా రైతులు నకిలీ విత్తనాలతో వేసిన మిర్చి పంట నష్టపోయామంటూ నిలదీసారు. మొక్కలను తీసుకువచ్చి సంబంధిత అధికారులకు చూపిస్తూ తమ ఆవేదన వెలిబుచ్చారు.

మండల కేంద్రానికి చెందిన వారిరువురు మహిళా రైతులు మండల కేంద్రంలోని ఓ ఫెర్టిలైజర్ షాపులో అంజని అనే కంపెనీకి చెందిన మిర్చి విత్తనాలను 25ప్యాకెట్లను కొనుగోలు చేసారు. ఆ విత్తనాల ద్వారా మిర్చి సాగుచేయడంతో కాపు అంతా పైకి కాసి మొక్క ఎదగకపోవడంతో సంబంధిత డీలర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వాపోయారు. ఈ విషయంపై మండల వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారే తప్ప ఫలితం శూన్యమన్నారు.

కొంతమందికి ప్యాకెట్‌కు రూ.3,500 చొప్పున నష్టపరిహారం చెల్లించారని, తమకు మాత్రం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా దాటవేస్తున్నారన్నారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టినా ఫలితం లేదని, సంబంధిత డీలర్‌ను పిలిచి న్యాయం చేసేవరకూ అధికారులు కదిలేది లేదంటూ బీష్మించారు. వెంటనే డీలర్‌ను పిలిచి సెటిల్‌మెంట్ చేసుకోవాలని సూచించారు. డీలర్లు తమకు న్యాయం చేయరని, రైతులు పట్టుబట్టారు. రెండు రోజుల్లో న్యాయం చేస్తామని లేకపోతే సంబంధిత షాపుల లైసెన్సు రద్దుచేస్తామని ఛత్రునాయక్ తెలిపారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS