నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి

Fri,February 17, 2017 12:59 AM

గార్ల, ఫిబ్రవరి 16: వేసవి సమీపిస్తున్న దృష్ట్యా ముందస్తుగా మండలంలో తాగునీటి సమస్యలు గుర్తించి, వాటిని పరిష్కరించాలని జెడ్పీటీసీ ఎద్దు మాధవి అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీపీ కోనేటి సుశీల అధ్యక్షతన వేసవిలో తాగునీటి సరఫరా కోసం చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై సమావేశం నిర్వహించారు. తాగునీటి సమస్య ఏ గ్రామంలో ఉంది.. వాటి పరిష్కార మార్గాలు ఏంటి.. అని ఎంపీడీవో ఏలూరి అనురాధ ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, గార్ల పంచాయతీ ఈవో, కార్యదర్శులు పాలపర్తి వసుంధర, బుర్రి శ్రీనివాసరావు, వై.లక్ష్మయ్యను అడిగి తెలుసుకున్నారు.

మండలకేంద్రంలోని జీవంజిపల్లిలో మినీ వాటర్ ట్యాంకుకు తాగునీరు ఎక్కించే మోటారు పాడైందని, రెండు బోర్లు పూర్తిగా పని చేయడం లేదని ఈవో బుర్రి శ్రీనివాసరావు వివరించారు. అదేవిధంగా కొత్తపోచారంలోని ఒంటిగుడిసె, గోపాలపురంలోని పినిరెడ్డిగూడెం ఎస్సీకాలనీలో నూతనంగా బోర్లు ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారని కార్యదర్శి వై.లక్ష్మయ్య సమావేశంలో వివరించారు.

తాగునీటి ఎద్దడి నివారణ చర్యలను వేగవంతం చేయాలి
ఎండలు పెరిగిపోయాయని, నీటి ఎద్దడి నివారణ చర్యలు వేగవంతం చేయాలని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అధికారులకు విన్నవించారు. మండలస్థాయి అధికారులు మండలకేంద్రంలోనే ఉండాలని, ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారించాలని మండల కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ ఖదీర్‌బాబా పట్టుబట్టారు. ఎంపీడీవో అనురాధ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎండల తీవ్రత అత్యధికంగా ఉండొచ్చని, ప్రత్యామ్నాయంగా వ్యవసాయ, మరే ఇతర ప్రాంతాల నుంచైనా మండల ప్రజలకు తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఈవోఆర్డీ బాలరాజు, పంపు ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...