వీరన్న కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించాలి

Thu,February 16, 2017 01:56 AM

-ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకాలి
-జాతరకు నిధులను వెచ్చిస్తాం
-ఎమ్మెల్యే రెడ్యా, కలెక్టర్ ప్రీతీమీనా

కురవి, ఫిబ్రవరి15 : మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈనెల 24న భద్రకాళి సమేత వీరభద్రస్వామి కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించాలని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా అన్నారు. బుధవారం కురవి వీరభద్రస్వామి నాగుమయ్య దేవస్థాన ఆవరణలో జాతర పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్యా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వీరన్నకు కోర మీసాల మొక్కు చెల్లించుకునేందుకు ఈనెల 24న ఉదయం 11గంటలకు స్వామివారిని దర్శించుకోనున్నారని తెలిపారు. అనంతరం బహిరంగసభలో పాల్గొని మాట్లాడనున్నట్లు తెలిపారు.

జిల్లా ఏర్పాటు అనంతరం తొలిసారిగా నియోజకవర్గానికి రానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలకాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. వీరభద్రస్వామి ఆలయంతోపాటు ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం కృషిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతరలో పారిశుద్ధ్యం, వైద్యం, విద్యుత్, తాగునీరు, రోడ్ల మరమ్మతు పనులను పూర్తి స్థాయిలో చేయాలన్నారు. తాత్కాలిక మరుగుదొడ్ల కోసం సీడీఎఫ్ నిధుల నుంచి రూ.లక్ష కేటాయించినట్లు తెలిపారు.

జిల్లాస్థాయి అధికారులంతా జాతర పనుల్లో నిమగ్నమవ్వాలి : కలెక్టర్


జాతరను జిల్లాస్థాయిలో గుర్తించి అధికారులంతా జాతర పనుల్లోనే నిమగ్నమవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతీమినా సూచించారు. సీఎం కేసిసీఆర్ ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. సీఎం రానున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధికి ప్రజాప్రతినిదులతో కలిసి నిధుల కోసం కృషిచేస్తామన్నారు. జాతరలో చేపట్టే పనులకు ఎమ్మెల్యే సీడీఎఫ్ నిధులతో పాటు కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి వెచ్చిస్తామని అన్నారు.

భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయంలో బారికేడ్లతో పాటు మరుగుదొడ్లు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మెడికల్ క్యాంపులను గతంలో కంటే రెట్టింపు స్థాయిలో నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ కట్కూరి దామోదర్‌రెడ్డి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఆనంద్ కుమార్, ఇన్‌చార్జి ఆర్డీవో కృష్ణవేణి, డీఎంహెచ్‌వో శ్రీరాం, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ రవికుమార్, సర్పంచ్ గుగులోత్ పూర్ణ, జడ్పీటీసీ కొణతం కవిత, డీఎస్పీ రాజమహేంద్రనాయక్, మండల ప్రత్యేక అధికారి పురందర్, ఆర్టీసీ డీఎం రవిప్రసాద్, ఎక్సైజ్ అధికారి శేషు, డీటీడబ్ల్యూవో నారాయణస్వామి, విద్యుత్ శాఖ డీఈ భిక్షపతి, ఆలయ ఈవో రాజేంద్రం, ఆలయ మాజీ చైర్మన్ బాదావత్ రాజునాయక్, పిచ్చిరెడ్డి, రాంచంద్రయ్య, శ్రీనివాస్, మహేందర్‌రెడ్డి, వేణు, మండల అధికారులు పాల్గొన్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...