ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు


Thu,February 16, 2017 01:55 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 15 : లంబాడీ గిరిజనుల గురువుగా, ఆరాధ్య దైవంగా కొలిచే సంత్ సేవాలాల్ సేవా నిరతిని ప్రతిగిరిజనుడు పునికి పుచ్చుకోవాలని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. బుధవారం అనంతాద్రి వద్ద సేవాలాల్ 278వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు పెద్ద ఎత్తున సేవాలాల్ కీర్తిని చాటుతూ భారీ ప్రదర్శన నిర్వహించారు. లాంబాడీ మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తూ పట్టణంలో ర్యాలీగా అనంతాద్రి ఆలయం వద్దకు చేరుకున్నారు.

గుట్టలపై స్వయంభూ వెలసిన సేవాలాల్ ఆలయ నిర్మాణ ప్రాంతంలో భోగ్‌బండార్ కార్యక్రమాన్ని గిరిజనుల సంప్రదాయరీతిలో సంత్‌సేవాలాల్ సాధువులు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో శాస్ర్తోక్తంగా నిర్వహింపజేశారు. అనంతరం ఎమ్మెల్యే అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ బంజార జాతికి సేవాలాల్ చేసిన సేవలను కొనియాడారు. గిరిజన జాతినుంచి ఎదిగిన వారు తమ తండాల్లో చైతన్యాన్ని నింపడంతోపాటు గిరిజనుల సంప్రదాయ పండుగల విశిష్టతలు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.

ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతిని కోరుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి బంజారహిల్స్‌లో గిరిజన భవన్ నిర్మించేందుకు శంకుస్థాపన చేసిన విషయం గుర్తు చేశారు. అలాగే మానుకోటలో కూడా రూ.1.50 కోట్లతో గిరిజన భవనాన్ని నిర్మించేందుకు కృషిచేస్తున్నట్లు ప్రకటించారు. సేవాలాల్, మరియమా మాత(జగదాంబ) ఆలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రూ.75లక్షల సబ్సిడీతో కూడిన రుణాలను లంబాడీలకు అందించి చిరువ్యాపారాలు, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు.

కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా మాట్లాడుతూ సేవాలాల్ లాంటి సామాజిక, ఆధ్యాత్మికవేత్త అతి సామన్యమైన జీవితాన్ని గడుపుతూ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ప్రముఖ పాత్ర పోషించాడని వివరించారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇక్కడ సేవాలాల్ గుడి నిర్మాణ విషయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధిరుల దృష్టికి తీసుకువస్తామని ప్రకటించారు. జేసీ కట్కూరి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం చేసుకుంటూ ప్రజలకు ఆహారాన్ని అందించే గిరిజన జాతిని చైతన్యవంతులను చేసేందుకు సేవాలాల్ శాంతి, అహింసా పద్ధతులను బోధిస్తూ సన్మార్గంలో నడిచేందుకు బాటలు వేశారన్నారు.

కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భూక్యా నెహ్రూనాయక్, గుగులోత్ సుచరిత, పద్మ, గుగులోత్ కిషన్‌నాయక్, భూక్యా లక్ష్మి, భూక్యా ప్రవీణ్‌నాయక్, కునుసోతు హట్యానాయక్, మంగీలాల్, బానోత్ కిషన్, బానోత్ శంకర్‌మేస్త్రి, ధరావత్ స్వామినాయక్, ఇస్లావత్ వెంకన్న, లూనావత్ అశోక్, హాల్యానాయక్, బానోత్ బాలోజీనాయక్, బోడ లక్ష్మణ్, రాజునాయక్, మోహన్‌నాయక్, గుగులోత్ హరినాయక్, బిక్కునాయక్, దామునాయక్, భూక్యా రాంజీనాయక్, బోడ రాంజీ, డీటీడీవో నారాయణస్వామి, ఏటీడబ్ల్యూవో దేశీరాంనాయక్, ప్రత్యేకాధికారి విరేషం, సాధువులు, టీఆర్‌ఎస్ నాయకులు మార్నేని వెంకన్న, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, గడ్డం అశోక్, ఎండి.ఫరీద్, పెద్ది వెంకన్న, ఫరీద్, నిమ్మల శ్రీను, భూర్ల ప్రభాకర్, బంజార సాధువులు, మహిళలు పాల్గొన్నారు.

165
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS