మిగిలింది 15 రోజులే..!


Thu,January 12, 2017 02:29 AM

మహబూబాబాద్ క్రైం, జనవరి 11 : మహబూబాబాద్‌ను గుడుంబా రహిత జిల్లాగా మార్చాలన్న లక్ష్యానికి ఇంకా 15 రోజుల గడువు మాత్రమే మిగిలింది. అధికారుల అ లసత్వం కారణంగా అది నీరుగారే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ జిల్లాలో నల్లబె ల్లం దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. అనేక ఏళ్లుగా నల్లబెల్లం వ్యాపారంలో ఆరితేరి రూ. కోట్లు గడించినా కూడా దానిని కొందరు వదలలేక పోతున్నారు. ఇది అవినీతి అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఒకవైపు లక్ష్యం చేరుకు నే తుదిగడువు సమీపిస్తున్నా కూడా అధికారుల్లో చలనం కనిపించడం లేదు. మహబూబాబాద్ డివిజన్ పరిధిలో నిన్న మొన్నటి దాకా నత్తనడకన సాగిన గుడుంబా త యారీ కేంద్రాల ఏరివేత కొంత ఊపందుకుంది. జిల్లా అధికారుల చొరవో, మీడియాలో వస్తున్న కథనాలతోనో అధికారుల్లో కొంత మార్పు వచ్చింది. కానీ తొర్రూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎక్సైజ్ దాడులు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి.

గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీల ద్వారా...


నల్లబెల్లం ఎక్కువగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుండే సరఫరా అవుతోంది. డైలీ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీల ద్వారా అయితే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశ్యంతో అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాగా ఏర్పాటైన నాటి నుంచి గుడుంబా తయారీదారులు తమ అడ్డాలను అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించారు. మరిపెడ, తొర్రూరు తదితర ప్రాంతాలకు నిత్యం నల్లబెల్లం రవాణా చేసుకుని అక్కడ నుంచి రాత్రి వేళల్లో జిల్లా అంతటికీ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. వారం రోజుల క్రితం తొర్రూరు బస్టాండ్ ప్రాంతంలో ఉన్న రోజువారీ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీకి చెందిన వాహనంలో అధికమొత్తంలో నల్లబెల్లం దిగుమతైనట్లు తెలిసింది. దీనిలో కొంత రాత్రికి రాత్రే మరిపెడ చుట్టు ప్రక్కల ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. ఈ లోపు సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు మిగిలిన నల్ల బెల్లాన్ని సీజ్ చేసి ఓ ప్రైవేటు గోడౌన్‌కు తరలించి, కేసు నమోదు చేయకుండా వ్యాపారస్తులతో బేరసారాలకు దిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ముడిసరుకు రవాణాపై కొరవడిన నిఘా


గుడుంబా తయారీలో అత్యంత ప్రధానమైన నల్లబెల్లం, ఆలమ్‌ల అక్రమ రవాణాపై నిఘా కొరవడింది. అధికారులు గుడుంబా తయారీ ముడిసరుకు రవాణాను అడ్డుకోకుండా గుడుంబా స్థ్ధావరాలపై దాడులు చేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా ఆ దిశగా ఆలోచించి ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్న నల్లబెల్లంపై ఉక్కుపాదం మోపేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

లక్ష్యానికి తూట్లు పొడుస్తూ...


జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించేందుకు జనవరి 26 నే తుది గడువుగా నిర్దేశించారు. కానీ కొందరు చిత్తశుద్ధి లేని అధికారుల కారణంగా సా ధించాల్సిన లక్ష్యం నీరుగారిపోతోంది. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే జిల్లా స్థితిగతులను ఆధ్యయనం చేసి ఎందరి జీవితాలనో ఛిద్రం చేస్తున్న గుడుంబాను లేకుండా చేయాలనే సంకల్పంతో అధికారులను ఆ దిశగా కార్యోన్ముఖులను చేశారు. కానీ కొందరు అధికారుల అలసత్వం, అవినీతి వల్ల కొన్ని ప్రాంతాల్లో గుడుంబా ఏరులైపారుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు అలసత్వం వీడి అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తేనే లక్ష్యాన్ని చేరుకోవచ్చని, అయితే ఉన్నతాధికారులు ఆ దిశగా ఆలోచించాలని ప్రజలు అంటున్నారు. పోలీసు, ఎక్సైజ్ శాఖలను స మన్వయ పరిచి ఉమ్మడిగా దాడులు నిర్వహించి నల్లబెల్లం రవాణాను నియంత్రించాలని వారు కోరుతున్నారు. మిగిలిన 15 రోజుల్లో చర్యలు తీసుకొని జిల్లాను గుడుంబా రహితంగా మార్చేందుకు బాటలు వేయాలని ప్రజలు పేర్కొంటున్నారు.

283
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS