ఎరువుల ధరలు తగ్గాయ్..!


Thu,January 12, 2017 02:28 AM

నర్సింహులపేట, జనవరి 11 : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో వివిధ కంపెనీల ఎరువుల ధరలు తగ్గాయి. పెద్ద నోట్ల రద్దు సాగుపై తీవ్ర ప్రభావం చూపి పెట్టుబడుల కోసం రైతులు ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. డీఏపీ బస్తాకు రూ. 60 నుండి రూ.70, కాంప్లెక్స్ బస్తాకు రూ. 50 నుంచి రూ.70 వరకు తగ్గిస్తూ వ్యాపారులు విక్రయిస్తున్నారు. యూరియా ధరలు సైతం స్వల్పంగా తగ్గాయి. ఎరువుల ధరలు తగ్గడంతో రైతులకు కాస్త ఊరట కలిగింది. మహబూబాబాద్ జిల్లాలోని 16 మండలాల్లో వానాకాలంలో సుమారు 35 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేశారు.

యాసంగి వచ్చే సరికి సుమారు 30 వేల హె క్టార్లలో అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చింది. యాసంగికి సంబంధించి 56,384 హెక్టార్ల విస్తీర్ణానికి, వరి 20 వేల హెక్టార్లు, మొక్కజొన్న 760 హెక్టార్లు, పెసర 425 హెక్టార్లు, మినుములు 1250 హెక్టార్లు, మిర్చి 8,549 హెక్టార్లు, వేరుశనగ 12,150 హెక్టార్లు, నువ్వులు 25 హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నారు. వానాకాలంలో రైతు లు అమ్ముకున్న పంటలకు సంబంధించిన నగదును వ్యాపారులు చెక్కుల రూపంలో ఇవ్వడంతో బ్యాంకుల్లో డబ్బులు తీసేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఫలితంగా యాసంగి సాగుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే క్రమంలో దిగివచ్చిన కేంద్రం ఎరువుల ధరలను తగ్గించాలని కంపెనీలను ఆదేశించింది. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులు సాగును తగ్గించుకొని ఎరువుల కొనుగోళ్లు చేపట్టడం లేదు. ధరలు తగ్గిస్తే కొనుగోళ్లు పెరుగుతాయనే భావంతో ప్రభుత్వ ఆదేశాలను కంపెనీలు వెంటనే అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం 50 కిలోల డీఏపీ బస్తాను రూ.1155 నుంచి రూ.1087కు తగ్గించాయి. కోరమండల్ కంపెనీ బస్తా ధరపై రూ. 60 వరకు తగ్గించినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

అందుబాటులో ఎరువులు...


యాసంగి సాగు కోసం ప్రభుత్వం ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలను విడుదల చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలకు నీరు సమృద్ధిగా వచ్చి చేరింది. దీంతో వానాకాలం కంటే యాసంగి వరి సాగు విస్తీర్ణం పెరిగింది. రైతుల పంటలకు అవసరమైన ఎరువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉంచారు. డీఏపీ 7,704 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 11,101 మెట్రిక్ టన్నులు, పొటాష్ 5,025 మెట్రిక్ టన్నులు, యూరియా 16,850 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఎక్కువ రేట్లకు అమ్మితే చర్యలు


- జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఛత్రునాయక్
ప్రభుత్వం నిర్ణయించిన విధంగా డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల అమ్మకాలు చేపట్టాలి. పాత రేట్లకు విక్రయిస్తే చర్యలు తప్పవు. అన్ని మండలాల్లో ఫెర్టిలైజర్, సీడ్స్ దుకాణాలను మండల వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తారు. యాసంగి సాగుకు రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. రైతులు ఇష్టం వచ్చినట్లు మందులు పిచికారి చేయకుండా వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.

199
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS