కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం..!


Thu,January 12, 2017 02:23 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ, జనవరి11 : ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టపరిచే సంకల్పంతో పలురకాల సంస్కరణలకు శ్రీకారం చుట్టిన తరుణంలో ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించాలని తలచి పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేసే దిశగా ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యూహరచన చేశారు. కళాశాలకు వచ్చే విద్యార్థి కడుపు నిండా భోజనం చేయాలని, తద్వారా విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందన్న ఆలోచనతో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులతో ప్రమేయం లేకుండా అవినీతికి ఆస్కారం కల్పించకుండా మహిళలతో ప్రత్యేక కమిటీ వేసి ఔత్సాహికుల నుంచి విరాళాలు సేకరించి కళాశాల విద్యార్థులకు భోజనం పెట్టాలని భావిస్తున్నారు. రెండు రోజుల్లో మండలాల వారీగా కమిటీల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు.

పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు, రాయపర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, తొర్రూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ఎర్రబెల్లి వ్యూహరచన చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని భావించినప్పటికీ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాలేజీల్లో గదుల కొరత, భోజన ఏజెన్సీల నియామకం వంటి సమస్యలు కొలిక్కి వచ్చిన తర్వాతే సమర్థవంతంగా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇంటర్, డిగ్రీ వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరయ్యేందుకు, మధ్యాహ్నం వేళ కూడా తరగతుల కొనసాగింపునకు మధ్యాహ్న భోజనం ఉపకరిస్తుందని విద్యావేత్తలు కూడా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని ఎమ్మెల్యే దయాకర్‌రావు భావించారు. తొర్రూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 186 మంది విద్యార్థులు, డిగ్రీకళాశాలలో 188 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ రెండు కళాశాలల్లో ప్రస్తుతం విద్యాబోధనకు సరిపడా అధ్యాపకులు ఉన్నారు. కానీ డిగ్రీ కళాశాలలో మాత్రం తరగతి గదుల కొరత ఉండడంతో తక్షణం అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే దయాకర్‌రావు నిధుల మంజూరుకు భరోసా ఇస్తూ ఉత్తర్వులు ఇప్పించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు.

ఉషాదయాకర్‌రావు నేతృత్వంలో కమిటీకి సన్నాహాలు..


ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు ఔత్సాహికులైన వారి నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే దయాకర్‌రావు సతీమణి ఉష నేతృత్వంలో మహిళలతోనే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. విరాళాల సేకరణలో పారదర్శకత ఉండేలా ఎక్కడ కూడా నాయకుల ప్రమేయాలు లేకుండా నిబద్దతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. స్వచ్ఛంద సేవల్లో ముందుండే మహిళా సంఘాల ప్రతినిధులకు కమిటీలో స్థానం కల్పించి రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల ప్రయోజనం కోసం ఈనెల 18నుండి మధ్యాహ్న భోజనం వడ్డించేలా తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. విద్యాభిమానుల నుంచి విరాళాలు సేకరించిన తరువాత నిధులు ఇంకా అవసరమైతే ఎమ్మెల్యే తన ట్రస్టు ద్వారా కొంత మేర సమకూర్చేందుకు యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ విద్యాసంవత్సరం ముగిసే వరకు కనీసం ఈనెల 18నుంచి ఫిబ్రవరి 29వరకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని, రానున్న విద్యాసంవత్సరంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే సమస్య లేదు. లేదంటే నియోజకవర్గంలో మాత్రం ప్రస్తుతం రెండు నెలల్లో ఏ తరహాలో భోజనాన్ని అందిస్తారో దాన్ని కొనసాగింపు చేయాలని భావిస్తున్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS