క్రీడారంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం


Thu,January 12, 2017 02:23 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ, జనవరి11 : క్రీడారంగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహిస్తోందని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ మెన్ అండ్ ఉమెన్ డబుల్స్ పోటీలను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుధాకర్‌రావుతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. అసోసియేషన్ అధ్యక్షుడు గట్టు నాగార్జున అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తొర్రూరులో మినీ స్టేడియం ఏర్పాటుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. రూ.కోటితో నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి కృషిచేస్తానని అన్నారు. ప్రతి గ్రామానికి రూ.లక్ష కేటాయించి క్రీడా మైదానాలు, సామాగ్రి సమకూర్చుతానని అన్నారు. డివిజన్ కేంద్రంలో క్రీడాకారుల సౌకర్యం కోసం క్రీడా సంఘాలు ప్రతిపాదనలు పంపిస్తే క్రీడా స్థలం కేటాయించి ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కృషిచేస్తానన్నారు. క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి తొర్రూరులో మైత్రి అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మైత్రి నిర్వహించే కార్యక్రమాలకు తన వంతు సహకారం అందజేస్తానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావు మాట్లాడుతూ తొర్రూరులో ఇండోర్ స్టేడియం అవసరమని, నిర్మాణ బాధ్యత ఎమ్మెల్యేదేనన్నారు.

ప్రతీ పాఠశాలలో క్రీడా మైదానం, వ్యాయామ ఉపాధ్యాయులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆటలను ప్రోత్సహించాలని అన్నారు. ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు టి.రవీందర్, పి.రమేశ్‌రెడ్డిలు మాట్లాడుతూ సింధు పతకం సాధించిన తర్వాత షటిల్‌కు ఆదరణ పెరిగిందన్నారు. తెలంగాణ బ్యాడ్మింటన్ క్రీడాకారులే దేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వకారణమన్నారు. తొర్రూరులో మినీ స్టేడియం నిర్మాణం, బ్యాడ్మింటన్ కోచింగ్ ఏర్పాటు చేయడం కోసం స్పోర్ట్స్ అథారటీ తెలంగాణ చైర్మన్‌ను సంప్రదిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.కృష్ణవేణి, డీఎస్పీ రాజారత్నం, జడ్పీటీసీ జడ్పీటీసీ జాటోత్ కమలాకర్, సర్పంచ్ రాజేశ్‌నాయక్, సీఐ కె.శ్రీధర్‌రావు, డాక్టర్ పి.సోమేశ్వర్‌రావు, దళితరత్న నర్సయ్య, మైత్రి గౌరవ సలహాదారులు సురేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్, వ్యవస్థాపక అధ్యక్షుడు విప్లవ్‌రెడ్డి, మైత్రి ప్రతినిధులు పృథ్వీరాజ్, కిశోర్, సతీశ్, సునీల్, శేఖర్, సురేశ్, శివ, రాజ్‌కుమార్, సురేశ్, శ్రీకాంత్, విక్రం పాల్గొన్నారు. ప్రారంభానికి ముందు అతిథులకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేతో పాటు ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ కమలాకర్‌రెడ్డి, మైత్రి ప్రతినిధులు సన్మానించారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS