ఏరియా దవాఖాన ఆధునీకరణ..!


Thu,January 12, 2017 02:22 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జనవరి11 : ప్రభుత్వ ఏరియా దవాఖానను జిల్లాస్థాయి దవాఖానగా ఆధునీకరించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషిచేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా తెలిపారు. కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో ఆమె అధ్యక్షతన ప్రభుత్వ ఏరియా దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా దవాఖానలో చేపట్టాల్సిన రిపేర్లు, కావాల్సిన పరికరాలు, ఆధునీకరణపై బుధవారం కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.50లక్షల్లో రూ.30.25 లక్షలతో అత్యాధునిక లేజర్ గది, రూ.7లక్షలతో దవాఖాన వి ద్యుత్ వైరింగ్, రూ.11లక్షలతో సానిటేషన్ పైపులైను, టాయిలెట్స్ రిపేరు చేసేందుకుగానూ టెండర్లను పిలవాల్సిందిగా ఈఈని ఆదేశించారు. దవాఖానకు అవసరమైన 69 రకాల వై ద్య పరికాలు ప్రభుత్వం నుంచి మార్చి 31లోగా మంజూరు కా నున్నాయని, అత్యవసరమైన పరికరాలను తాను ప్రతిపాదించి మంజూరు చేస్తానని తెలిపారు. జిల్లాస్థాయిలో వైద్యం అందించేందుకు రేడియాలజిస్టు, ఫిజియోథెరపిస్టు, పాథాలజిస్టులను నియమించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపారు. డాక్టర్లను తక్షణమే నియమించి తదుపరి వైద్య శాఖ నుంచి అనుమతి పొందాల్సిందిగా తెలిపారు. రూ.50లక్షలతో చేపట్టాల్సిన పనులను మార్చి 31నాటికి పూర్తిచేయాలని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఈఈ నర్సింహారావును కలెక్టర్ ఆదేశించారు. దవాఖానలో మార్చురీ లేదని, వెనక భాగంలో నిర్మించేందుకు అయ్యే ఖర్చు ప్రతిపాదనలు, ఎస్‌బీఐ ముందున్న 2చ.గ స్థలంలో భవనం నిర్మించినట్లయితే అక్కడ ఓపీ సేవలు నిర్వహించవచ్చునని కమిటీ ప్రతిపాదించిన మేరకు భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి మంజూరు నిమిత్తం పంపనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సానిటేషన్ సరిగా నిర్వహించడం లేదని, సంబంధిత ఏజెన్సీ సానిటేషన్ మెటీరియల్ పంపిణీ చేయడం లేదని దృష్టికి రాగా, నేరుగా ఏజెన్సీతో జేసీ ఫోన్‌లో మాట్లాడి సానిటేషన్‌లో శ్రద్ధ తీసుకోకుంటే రద్దుచేసి ఇతరులకు ఇస్తామని హెచ్చరించారు. ఇద్దరు స్టాఫ్ నర్సులను డోర్నకల్ నుంచి పంపాల్సిందిగా డీఎంహెచ్‌వోను కలెక్టర్ ఆదేశించారు. బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. వైద్యం, రెవెన్యూ, ము న్సిపల్ అధికారులు సమన్వయంతో సమావేశం ఏర్పాటు చేసి దవాఖానకు అవసరమయ్యే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గత ఏడాది ఆరోగ్యశ్రీలో 594 శస్త్ర చికిత్సలు జరిగాయని, ఈ ఏడాది ఆ సంఖ్యను పెంచాల్సిందిగా కలెక్టర్ కోరగా న్యూరో ఫిజిషియన్ లేనందున కేవలం పిడియాట్రిక్ సర్జరీలు జరుగుతున్నాయని వైద్యులు ఆమె దృష్టికి తెచ్చారు. న్యూరో ఫిజిషియన్‌ను త్వరలోనే నియమించనున్నట్లు నిర్ణయించారు. ఈ సమావేశంలో జేసీ దామోద్‌రెడ్డి, డీఎంహెచ్‌వో శ్రీరాం, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ భీంసాగర్, ఆర్డీవో భాస్కర్‌రావు, ఆర్‌అండ్‌బీ ఈఈ చిన్న పుల్లాదాసు, దవాఖాన అభివృద్ధి కమిటీ సభ్యులు, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధి వరప్రసాద్, ఐఎంఏ అధ్యక్షుడు కుమారస్వామి, నాగేశ్వర్, టి.విజయ, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ సమంత్‌రెడ్డి, డాక్టర్ వెంకట్రాములు, ఆర్‌ఎంవో డాక్టర్ జగదీశ్వర్‌రావు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS