కంది..కల్లాస్

Wed,January 11, 2017 02:53 AM

-ధరాఘాతంతో ఆవేదనలో రైతన్న
-సగానికి పైగా రేటు పోటు
-గతేడాది క్వింటాల్‌కు రూ.9291
-ఈ ఏడాది రూ.3800
-ఆశలన్నీ నాఫెడ్ పైనే..

కేసముద్రంటౌన్, జనవరి 10: కంది పంట సాగు చేసిన రైతులకు కష్టాలు మొదలయ్యాయి. కందుల ధర పూర్తిగా పడిపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. గత ఏడాది కందులకు అధిక ధర పలకడంతో రైతులు వానాకాలంలో కంది పంట సాగుపై దృష్టి సారించారు. పత్తి సాగు చేస్తే నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుందని ప్రభుత్వం సూచించడంతో రైతులు.. కందులు, పెసరు వంటి పప్పు దినసుల పంటలు సాగుపై మొగ్గు చూపారు. ఈ ఏడాది కందుల సాగు విసీర్ణం గత ఏడాది కంటే గణనీయంగా పెరిగింది. జిల్లాలో 2014లో 7335 హెక్టార్లు, 2015లో 6800 హెక్టార్ల కంది పంట సాగు కాగా, ఈ ఏడాది 16,840 హెక్టార్లలో కంది పంట సాగైంది. ధర అధికంగా ఉన్న నేపథ్యంలో గతేడాది కంటే 10 వేల హెక్టార్లలో కంది పంట అధికంగా సాగైంది.

ఆశలు ఆవిరి..


కోటి ఆశలతో అన్ని పంటలను వదులుకొని కంది సాగు చేసిన రైతులకు ధర తీవ్ర నిరాశకు గురిచేసింది. వేల రూపాయలు అప్పులు చేసి అధిక పెట్టుబడి పెట్టారు. పంట పూత దశలో ఉన్న సమయంలో వాతావరణ పరిస్థితులు పంట దిగుబడికి నష్టాన్ని కలిగించింది. పచ్చపురుగు, చీడపీడలు, ఎండు తెగుళ్లు సోకడంతో ఆశించిన మేర దిగుబడి రాలేదు. దిగుబడి కలిసి రాకపోయినప్పటికీ ధర కలిసి వస్తుందని ఆశ పడిన రైతులకు నిరాశే ఎదురైంది.

కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం..


రోజురోజుకు కందుల ధరలు నేలను తాకుతుండడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంలో తయారైంది. ఇదిఇలా ఉంటే.. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కంది సాగు చేసిన కౌలు రైతులకు కౌలు కూడా మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. మంగళవారం మార్కెట్‌లో క్వింటాల్‌ల్‌కు గరిష్టంగా రూ. 3800 పలికింది. కేసముద్రం మార్కెట్‌లో 2015 జనవరిలో క్వింటాల్‌కు రూ. 6 వేలు పలుకగా, 2016 జనవరిలో గరిష్టంగా క్వింటాల్‌కు రూ. 9291 పలికింది. గత ఏడాది కంటే ఈ ఏడాది క్వింటాల్‌కు 5491 రూపాయలు తగ్గింది. భారీ స్థాయిలో కందుల ధర పడిపోవడంతో రైతులకు చివరికి కన్నీల్లే మిగులుతున్నాయి. కాగా, వ్యాపారులు కావాలనే ధర తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

నాఫెడ్‌పైనే ఆశలు..


ఈ ఏడాది కందుల ధర ఒక్కసారిగా పడిపోవడంతో ప్రభుత్వ రంగ సంస్థ అయిన నాఫెడ్‌పై రైతులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రతీ రైతును ఆదుకోవడం కోసం ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వ రంగ సంస్థ కందులను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. కేసముద్రం మార్కెట్‌లో మూడు రోజులుగా నాఫెడ్ సంస్థ క్వింటాల్‌కు రూ. 5050 కొనుగోలు చేస్తున్నప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ఈ ధర చాలా తక్కువగా ఉంది.

36
Tags

More News

మరిన్ని వార్తలు...