విలేజీకో పోలీస్..!


Wed,January 11, 2017 02:50 AM

-ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా జిల్లాలో సంస్కరణలు
-ప్రతీ పంచాయతీకి గ్రామ పోలీస్ అధికారి
-వీపీవోల నియామకం షురూ
-నేర నియంత్రణకు పకడ్బందీ చర్యలు

మహబూబాబాద్ క్రైం, జనవరి 10: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తోంది. పోలీస్‌స్టేషన్లకు నూతన భవనాలు, కొత్త వాహనాలు ఇచ్చి పోలీస్ శాఖలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా మహిళల భద్రత కోసం అన్ని జిల్లాల్లో షీటీమ్స్ ఏర్పాటు చేసి.. మహిళా రక్షణకు నడుం బిగించింది. తాజాగా ప్రతీ గ్రామంలో విలేజ్ పోలీస్ ఆఫీసర్‌ను నియమించేందుకు చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలతో పోలీసులు మరింత సఖ్యత కలిగి..

క్షేత్రస్థాయిలో నేరాల నియంత్రణతోపాటు ఏదైనా సంఘటన జరిగినప్పుడు సకాలంలో సమాచారం ఇవ్వడమే కాకుండా నిందితులను పట్టుకునేందుకు కావాల్సిన సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకునే దిశగా చర్యలు చేపడుతోంది. ఠాణాల్లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుళ్లకు తమ మండల పరిధిలో ఉన్న ఒక్కో పంచాయతీకి గ్రామ పోలీస్ అధికారిగా బాధ్యతలను అప్పగించనున్నారు. జిల్లాలోనూ ఈ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. మహబూబాబాద్ మండలం వెంకటేశ్వరస్వామి ఆలయంతో ప్రసిద్ధి గాంచిన అనంతారం గ్రామంలో ఎస్పీ మురళీధర్ గ్రామ పోలీస్ అధికారిని నియమించి జిల్లాలో ఈ వ్యవస్థకు బీజం వేశారు. రానున్న రోజుల్లో జిల్లాలోని 231 గ్రామ పంచాయతీల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు.

గ్రామాల్లో నేరాలు అధికమే...


జిల్లాలో నేరాల తీవ్రత ఎక్కువగానే ఉందని చెప్పాలి. ముఖ్యంగా హత్యలు, ఆత్మహత్యలు, చోరీలు, చైన్‌స్నాచింగ్‌లు, రోడ్డు ప్రమాదాలతోపాటు ఇతరత్రా నేరాలు ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో సైతం నేరాల సంఖ్య అధికమే. ఎక్కువగా ఆస్తి వివాదాలు, వ్యక్తిగత ఘర్షణలు, రాజకీయ కక్షలు చోటుచేసుకుంటాయి. వీటి నియంత్రణకు గ్రామ పోలీస్ వ్యవస్థ దోహదపడనుంది. జిల్లాలోని 16 మండలాల్లో 17 స్టేషన్లు ఉండగా, 231 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో పంచాయతీకి కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్‌కు బాధ్యతలు కట్టబెట్టనున్నారు.

వీపీఓల విధులు..


వీరు తమకు అప్పగించిన గ్రామాన్ని వారంలో మూడు రోజులు సందర్శించి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేయాలి. గ్రామ పెద్దలతో చర్చించి జీపీ భవనంలో ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేసుకుని నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలకు పరిష్కార మార్గాలను చూపాలి. గ్రామానికి వెళ్లిన ప్రతిసారి స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్దలను కలుస్తూ గ్రామంలో జరిగే సంఘటనలను అడిగి తెలుసుకోవాలి. చిన్నచిన్న సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించాలి. పెద్ద సమస్యలుంటే ఉన్నతాధికారులకు తెలియజేయాలి. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు, కొత్త వ్యక్తులు సంచరిస్తే సమాచారం తెలుసుకుని సబ్ ఇన్‌స్పెక్టర్‌కు చెప్పాలి.

ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ


ఉమ్మడి జిల్లాలో ప్రతీ గ్రామానికో పోలీస్‌కు బాధ్యతలను అప్పగించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక ఈ వ్యవస్థ అంతటితోనే ఆగిపోయింది. మానుకోట జిల్లాలో ఈ వ్యవస్థను మరింత పక్కాగా చేపట్టేందుకు ఎస్పీ జన్మహంతి మురళీధర్ ప్రత్యేక దృష్టి సారించారు. సిబ్బంది నియామకంతోపాటు వారు గ్రామీణులతో సఖ్యత పెంచుకునే విధంగా ఇప్పటికే తన కిందిస్థాయి అధికారులకు తగిన సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. మహబూబాబాద్, తొర్రూరు డివిజన్ల పరిధిలో ఈ ప్రక్రియ మొదలైంది. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఇందుకు సంబంధించిన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తు పూర్తి చేసి.. పోలీస్ అధికారుల నియామకంపై దృష్టి సారించారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS