మానుకోటలో ముగిసిన నగదు రహిత సర్వే


Wed,January 11, 2017 02:49 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జనవరి 10: జిల్లా కేంద్రంలో నగదు రహిత సమగ్ర సర్వే ముగిసింది. వీఆర్వోలు, వీఆర్‌ఏలు, కార్యదర్శుల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు పట్టణంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. మొత్తం 16 అంశాల్లో చేపట్టిన ఈ సర్వే ద్వారా ఆయా కుటుంబాల వివరాలను సేకరించారు. పట్టణంలోని 16,250 ఇండ్లను ఒక్కో అధికారి 75 చొప్పున సర్వే చేపట్టారు. రెండు వార్డులకు 14 మంది గెజిటెడ్ అధికారుల పర్యవేక్షణలో మొత్తం పట్టణంలోని 28 వార్డుల్లో సర్వేలు చేశారు.

14,671 ఇళ్లలో సర్వే పూర్తి..


పట్టణ పరిధిలో మొత్తం 16,250 ఇండ్లకు 14,671 ఇండ్లల్లో సర్వే పూర్తి చేశారు. మిగతా ఇండ్లల్లో తాళాలు వేసి ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా సర్వే సిబ్బంది సేకరించిన వివరాల ప్రకారం.. 14,671 ఇండ్లల్లో సర్వే చేపట్టగా.. 4,902 మందికి ఆధార్ కార్డులు, 17,954 మంది బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారు. 693 మంది ఖాతాలు నిరుపయోగంగా ఉన్నాయి. 6967 మందికి ఏటీఎం కార్డులు ఉన్నాయి. 884 మంది ఏటీఎం కార్డులు పనిచేయడం లేదు. స్వచ్ఛభారత్‌లో భాగంగా మరుగుదొడ్లు కలిగిన ఇండ్లు 7348. మరుగుదొడ్లు లేని ఇళ్లు 2022 ఉన్నాయి. అలాగే, నల్లా కనెక్షన్లు కలిగిన కుటుంబాలు 5,786. ఇంకా 2294 కుటుంబాలకు లేవని సర్వేలో తేలింది.

అధికారులకు నివేదిక అందజేత..


మానుకోటను క్యాష్‌లెస్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పట్టణంలో మూడు రోజులపాటు నిర్వహించిన సర్వే నివేదికను ఉన్నతాధికారులకు అందించే ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నగదు రహిత సేవలను ప్రజల ముంగిట తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా సిద్దిపేట జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న విషయం తెల్సిందే. అయితే, మిగతా మున్సిపల్ పట్టణ పరిధిలో కూడా ఏ మేరకు నగదు రహిత సేవలను వినియోగంలోకి తీసుకురావాలనే సంకల్పంతో సమగ్ర సర్వేలు నిర్వహించాలని యోచించారు.

నగదు రహిత సేవలను ప్రజల ముంగిటకు తీసుకురావడం ద్వారా అక్రమ వ్యాపారాలు, అవినీతికి తెరతీసేందుకు కేంద్రం ప్రయత్నాలు ఆరంభించింది. ఇందులో భాగంగానే ఇంటింటి సర్వే నిర్వహించింది. ప్రాథమికంగా అందిన సమాచారాన్ని క్రోడీకరించి ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు ఉద్దేశించిన సర్వే పనులు పూర్తి కావడంతో ఓ నిర్ణయానికి వచ్చిన అధికారులు పట్టణంలో పూర్తి స్థాయిలో నగదు రహిత సేవలను వినియోగంలోకి తేచ్చేందుకు ముందడుగు వేసేందుకు ప్రయత్నాలు ఆరంభించేందుకు ఉపకరిస్తుందని భావిస్తున్నారు. అదే రీతిలో స్వైప్ మిషన్లు కూడా ప్రతీ షాపులో అందుబాటులోకి తేవ డం ద్వారా ఈ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయొచ్చని అధికారులు అంటున్నారు. మానుకోటను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని చేపట్టిన సర్వే విజయవంతం కావడంతో ఇక ముందు చేపట్టే చర్యల కోసం పట్టణవాసులు ఎదురుచూస్తున్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS