వన్యప్రాణులకు అనువైన అడవి

Sat,October 12, 2019 12:34 AM

-కాగజ్‌నగర్ ఫారెస్ట్‌లో అటవీ జంతువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
-పాలరాపు గుట్టలో పెరిగిన రాబందుల సంఖ్య
-పులుల సంతానోత్పత్తికి అనుకూల వాతావరణం
-ఇప్పటికే టైగర్ కారిడార్‌గా గుర్తింపు
-ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ

కాగజ్‌నగర్ టౌన్: జిల్లాలో దట్టమైన అడవులు ఉండడంతో మహారాష్ట్రలోని తడోబా నుంచి పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. కాగజ్‌నగర్ అటవీ డివిజన్ ప్రాంతంలో పాలారపు గుట్టలలో రాబందులకు నివాసయోగ్యంగా ఉండడం, దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండడంతో వన్యప్రాణులు నివాసాన్ని ఏర్పర్చుకున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం, వాటికి కావాల్సిన ఆహారం సమృద్ధిగా ఈ ప్రాంతంలో ఉండడంతో వన్యప్రాణుల నివాసం ఏర్పడడంతో వాటి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ప్రత్యేకంగా వన్యప్రాణుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో 6.42 లక్షల ఎకరాల్లో అటవీ భూమి విస్తరించి ఉండడం, 258పైగా గ్రామాల్లో అటవీ భూములు ఉన్నాయి. జిల్లాలో కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, సిర్పూరు(టి), పెంచికల్‌పేట్, బెజ్జూరు, చింతలమానెపల్లి, కెరమెరి, జైనూర్ మండలాల్లో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. వన్యప్రాణులు, పక్షులతో పాటు పులలకు ఆవాసం. సంతానోత్పత్తికి అనుకూలంగా ఉండడంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌ను టైగర్ కారిడార్‌గా ప్రకటించింది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అటవీ డివిజన్‌లో ఒకవైపు మహారాష్ట్ర నుంచి పులులు, రాబందులు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో అటవీ ప్రాంతానికి మహర్దశ రానుంది. మహారాష్ట్రలోని తడోబా, టైగర్ రిజర్వు ప్రాంతంలో పులుల సంఖ్య పెరగడంతో పెన్‌గంగను దాటి డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతానికి వస్తున్నాయి. ఇటీవల మగపులితోపాటు ఆడపులి కూడా వచ్చినట్లు సమాచారం ఉండగా అటవీ శాఖ అధికారుల నిఘా కెమెరాలకు చిక్కలేదు. ప్రస్తుతం డివిజన్‌లో పులుల సంఖ్య రెండు అంకెలలో ఉన్నట్లు తెలుస్తుంది. పులుల వివరాలను అధికారులు ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం గోప్యంగా ఉంచుతున్నారు. సీసీ కెమెరాల ఫొటోలు బయటకు రాకుండా చూస్తున్నారు.

పెరిగిన రాబందులు
అంతరించిపోతున్న అరుదైన జాతి రాబందులను తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో దర్శనమిస్తున్నాయి. కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లోని పెంచికల్‌పేట్ మండలం మొర్లిగూడ బీట్‌లోని నందిగామ గ్రామ సమీపంలోని పాలరాపుగుట్టలో పొడవు ముక్కు రాబందుల ఉనికి ఉన్నట్లు నాలుగేండ్ల క్రితమే అటవీ శాఖ అధికారులు గుర్తించారు. వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పాలారపు గుట్టల్లో పొడవైన ముక్కు (లాంగ్‌బీల్డ్ వల్చర్) రాబందులు ఉండగా మహారాష్ట్రలోని సిరోంచ అటవీ డివిజన్ పరిధిలోని కమలాపూర్ అటవీ ప్రాంతంలో వైట్ రంపుడ్ వల్చర్ రాబందులు ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలో దాదాపు 120పైగా తెలుపుముక్కు రాబందులు ఉండగా మహారాష్ట్ర అటవీ అధికారులు ప్రత్యేకంగా వాటి ఆహారం కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. పాలరాపు గుట్టలోని రాబందులు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆహార కేంద్రానికి వెళ్లి వస్తున్నట్లు కాగజ్‌నగర్ అటవీ అధికారుల పరిశీలనలో తేలింది. ఇటీవల కుమ్రం భీం జిల్లా అటవీ అధికారి రంజిత్‌కుమార్ నాయక్‌తో పాటు సిరోంచ అటవీ అధికారులు ఉమ్మడిగా ఆ ప్రాంతాన్ని సందర్శించారు.

పాలరారపు గుట్ట-కమలాపూర్ అటవీ ప్రాంతం ఆకాశమార్గం 70 కిలోమీటర్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో: కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలోని 2లక్షల26వేల ఎకరాల విస్తీర్ణంలో (91700హెక్టార్ల) అడవులు విస్తరించి ఉన్నాయి. డివిజన్ పరిధిలోని ఐదు అటవీ రేంజ్‌లను ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్, సిర్పూరు(టి), బెజ్జూరు, కర్జవెల్లి, పెంచికల్‌పేట్, అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వేసవిలో జంతువుల దాహార్తిని తీర్చేందుకు సహజసిద్ధంగా ఉన్న నీటి నిల్వలతో పాటు, 319 సాసర్‌ఫిట్స్ ఏర్పాటు చేశారు. వీటిలో నీటి నిల్వల కోసం అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వేసవిలో వివిధ ప్రాంతాలకు చెందిన రకరకాల పక్షులు తలాయి, కోసిని, జలాశయాల్లో దర్శనమిస్తున్నాయి.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles