ఆర్టీసీ కార్మికుల్లో అంతర్మథనం!

Mon,October 7, 2019 01:31 AM

-యూనియన్ నాయకుల నిర్ణయంపై పునరాలోచన
-పండుగ పూట ప్రజలను ఇబ్బంది పెట్టాల్సివస్తుందనే అభిప్రాయం
-విధుల్లో చేరడంపై మొగ్గు!
-ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)ఆర్టీసీలో పలు సంఘాలతో ఏర్పడిన జేఏసీ తీసుకున్న నిర్ణయం మేరకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి చేపట్టిన సమ్మెపై కార్మికులు అంతర్మథనంలో పడ్డారు. సమ్మెకు దిగారన్నమాటేగానీ పండుగ పూట ప్రయాణికులను ఇబ్బందులు పెట్టాల్సి వస్తున్నదని చాలా మంది కార్మికులు ముందు నుంచే వాదిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సమ్మె మొదలై రెండు రోజులు గడుస్తున్నా అంతగా ప్రభావం చూపడం లేదు. తమకు ఇష్టం లేని నిర్ణయం తీసుకున్నారని కొందరు యూనియన్ నాయకులపై ఇప్పటికే కార్మికులు మండి పడుతున్నారు. యూనియన్ నాయకులు ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయం మేరకు తప్పని సరి పరిస్థితుల్లో సమ్మెలో పాల్గొంటున్నామని చాలా మంది కార్మికులు బాహాటంగానే చెబుతున్నారు. సమ్మె మొదలైన రెండు రోజుల్లో కార్మికులు విధులు మానుకున్నారే తప్పా చాలా చోట్ల సమ్మెలో పాల్గొనడం లేదని తెలుస్తున్నది. అందుకే ఈ రెండు రోజులు సమ్మె ప్రభావం అంతగా కనిపించలేదు. ప్రభుత్వం తీసుకున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా ఎక్కడా అడ్డుకోవడం లేదు. ధర్నాలు, ఆందోళనలు నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీలో కొందరు నాయకులు ఉసి గొల్పుతున్నా చాలా మంది కార్మికులు సంయమనం పాటిస్తున్నారు. సమ్మె మొదలై రెండు రోజులు గడుస్తున్నా ఎక్కడ కూడా కార్మికులు ప్రభుత్వం తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలను ప్రతిఘటించ లేదు. అంతేకాకుండా కొందరు యూనియన్ నాయకులు తమను బ్లాక్‌మెల్ చేసి సమ్మెలోకి దించారని కూడా కార్మికులు వాదించుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే కార్మికులు మునుపటిలా సమ్మెను ఉధృతం చేయకుండా పూర్తిగా శాంతి యుతంగా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. అయితే విధులకు హాజరుకాని కార్మికుల్లో చాలా మంది సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొడం లేదనే విషయం స్పష్టమవుతున్నది.

ప్రజల నుంచి వ్యతిరేకత..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అన్ని సంస్థలను బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని అన్నివిధాల ఆదుకుంటూ, నాలుగైదేళ్లుగా లాభాల బాట పట్టించింది. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటున్న సంస్థను, మళ్లీ నష్టాల్లోకి నెట్టాలనే కొందరి కుట్రలకు కార్మికులు పావులుగా మారుతున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతున్నది. ఆర్టీసీ ఉద్యోగులకు నెలకు సగటున 50 వేల వేతనం వస్తున్నా, ఇంకా వేతనాలు పెంచాలంటూ అర్థం లేకుండా సమ్మెకు దిగడంపై సమ్మెలు చేపట్టడంపై వ్యతిరేకత కనిపిస్తున్నది. దీని వెనక కొందరు యూనియన్ నాయకులు, ప్రతిపక్ష పార్టీల కుట్రలు దాగి ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. పండుగ పూట సమ్మెకు దిగి తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆగ్రహావేశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే ఆర్టీసీకి ఆదాయం వస్తుందనీ, సంస్థ ఆర్థికంగా బలపడుతుందనీ, కానీ ఇందుకు భిన్నంగా కార్మికులు తాము నిలుచున్న కొమ్మను నరుక్కున్న చందంగా సమ్మెకు దిగారని అనేక మంది బాహాటంగానే విమర్శిస్తున్నారు. పండుగ పూట ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుంటే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

లాభాల్లోకి తేవాలనేదే ప్రభుత్వ లక్ష్యం..
నాటి ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ అనేక నష్టాల్లో నడిచేది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలపడుతున్నది. అయితే ఈ సంస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం స్పష్టం చేస్తున్నారు. సమ్మె నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన, కార్మికులపై ఉదారత చూపుతూనే కొందరు కార్మిక సంఘాల నాయకులు స్వార్థం కోసం పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం లొంగదని స్పష్టం చేస్తూనే, వారి మోసానికి గురికావద్దని కార్మికులను కోరారు. ఆర్టీసీని లాభాలబాట పట్టించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంటే, కొందరు యూనియన్ నాయకుల మూలంగా సంస్థను మరింత నష్టాల్లోకి నెట్టవద్దనే విధంగా వ్యాఖ్యానించారు. పండుగ పూట ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం మంచిది కాదని హితవుపలికారు. గడువులోగా విధుల్లో చేరని కార్మికులు, ఉద్యోగులను విధుల్లోంచి శాశ్వతంగా తొలగించి కొత్త వారిని తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కొత్తగా ఉద్యోగాలకు ఎంపికయ్యే వారి నుంచి తాము ఏ యూనియన్‌లో చేరమని ఒప్పంద పత్రం తీసుకోవాలని స్పష్టం చేయడం వెనక ఆర్టీసీలోని కొన్ని సంఘాల నాయకుల వైఖరిని సీఎం చెప్పకనే చెప్పారు.

ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత కూడా కార్మికులు పునరాలోచనలో పడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఒకే సారి 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి, రాష్ట్ర ఉద్యోగుల ముందు ఉన్నత స్థానంలో నిలబెట్టారని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినా నమ్మకుండా జేఏసీగా ఏర్పడిన కొన్ని యూనియన్ నాయకుల మాటలు విని తప్పు చేశామనే పశ్చాతాపానికి కార్మికులు గురవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. రెండు రోజులుగా విధులకు హాజరు కాని అనేక మంది కార్మికులు, అటు సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొనడం లేదంటేనే ఆర్టీసీలో సమ్మె కొందరి సృష్టిగా స్పష్టమవుతున్నది. ఆదివారం కొన్ని పార్టీల నాయకులు ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం ప్రకటించడం పట్ల, అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేయాని చేసిన డిమాండ్లపై కూడా సీఎం కేసీఆర్ స్పష్టమైన వివరణ ఇచ్చారు. ప్రభుత్వం ఎవరితో ఎలాంటి చర్చలు జరపదని స్పష్టం చేశారు. ప్రతి పక్ష పార్టీలకు ఈ విషయంలో మాట్లాడే అర్హత లేదని అన్నారు. ఆయా పార్టీలు అధికారంలో ఉన్న అనేక రాష్ర్టాల్లో ఆర్టీసీ వ్యవస్థ లేదని, కొన్ని రాష్ర్టాల్లో ఉన్నా మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. కానీ అన్ని రకాలుగా ఆర్టీసీని ఆదుకుంటా వస్తున్నప్పటికి ఆర్టీసీ కార్మికులు ప్రజలకు ఇబ్బందులు కలిగించే పనులు చేస్తున్నందునా వారితో చర్చలు జరిపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం విధించిన గడువులోకి విధుల్లో చేరకుంటే ఉద్యోగాల్లోంచి శాశ్వతంగా తొలగించాలని సంస్థ ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles