సాగు సర్వే సమాప్తం..

Wed,September 18, 2019 02:31 AM

జిల్లాలో వ్యవసాయ శాఖ చేపట్టిన పంటల సాగు సర్వే పూర్తయ్యింది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా ఈ ప్రక్రియ సాగింది. జిల్లా వ్యాప్తంగా ఎన్ని సర్వే నంబర్లు ఉన్నాయి?.. సాగు భూమి ఎంత?.. సాగులో లేని భూమి ఎంత..? తదితర వివరాలు సేకరించింది. మొత్తంగా 3,69,775 ఎకరాల భూమి ఉండగా, 3,29,111 ఎకరాల్లో 19 రకాల పంటలు వేసినట్లు గుర్తించింది. ఇప్పటికే రైతు బంధు పోర్టల్‌లో సమస్త సమాచారం నమోదు చేయగా, వాటి ఆధారంగా మున్ముందు పలు పథకాలు రూపకల్పన చేసే అవకాశమున్నది.

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం గత నెల (ఆగస్టు ఒకటిన)లో సాగు సర్వే చేపట్టగా, నెల రోజుల పాటు కొనసాగింది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా జారీ చేసిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా ఈ ప్రక్రియ సాగింది. జిల్లాలో 1,00,0 36 మంది రైతులు ఉండగా, సర్వే నంబర్ల ఆధారంగా 95,651 మంది రైతుల వివరాలను సేకరించారు. మొ త్తంగా 3,69,775 ఎకరాల భూమి ఉండగా, 3,29,111 ఎకరాల్లో 19 రకాల పంటలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ తన సర్వేలో వెల్లడించింది. ఇందులో ఎక్కువగా పత్తి, కంది, వరి, మొక్క జొన్న పంటలను సాగు చేస్తున్నట్లు గుర్తించింది. మొదట గ్రామాన్ని యూనిట్‌గా చేసుకుని సాగు భూములపై సర్వే చేశారు.ఆ తర్వాత గ్రామ సభలు నిర్వహించిన అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి సాగు భూముల వివరాలు తేల్చారు. ఏ గ్రామంలో ఎన్ని సర్వే నంబర్లు ఉన్నాయి. ఏయే సర్వే నంబర్‌లో ఏయే పంటలు సాగు చేస్తున్నారు. అలాగే నిరుపయోగంగా ఉన్న భూమి వివరాలను సేకరించారు. ఈ విధంగా సేకరించిన వివరాలన్నీ రైతు బంధు పోర్టల్‌లో నమోదు చేశారు.

సర్వేతో అనేక లాభాలు...
తాజాగా నిర్వహించిన సాగు సర్వేతో అనేక లాభాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ ఆధికారులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో గ్రామాల వారీగా ఎంత భూమి ఉంది. అందులో సాగు చేస్తున్న భూమి ఎంత ? సాగుకు యోగ్యంగా లేని భూమి వివరాల స్పష్టంగా తెలుస్తాయని పేర్కొంటున్నారు. అదేవిధంగా గ్రామాల వారీగా రైతులు ఏయే పంటలు సాగు చేస్తున్నారనే విషయాలు కూడా తెలుస్తాయన్నారు. ఈ సర్వే వల్ల రాబోయే రోజుల్లో సాగుకు అవసరమయ్యే పంటలకు విత్తనాలు, ఎరువులు, ఏ మేరకు అవసరమవుతాయనే విషయాలను కూడా అంచనా వేసే వీలుంటుంది. సాగుకు ఎన్ని పని ముట్లు అందిచవచ్చు అనే విషయం పైనా అవగాహన కలుగుతుంది. గ్రామాల వారీగా చిన్న, సన్నకారు, పెద్ద రైతుల వివరాలు సైతం అందుబాటులో ఉంటాయి. పంటలు దెబ్బతిన్న విపత్కర పరిస్థితుల్లో ఎంత మేరకు నష్ట వాటిల్లిందో అనే వివరాలు తెలుసుకోవడం కూడా సులభం అవుతుంది.

సాగు సర్వేతో స్పష్టమైన సమాచారం
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పంటల వివరాలపై సర్వే నిర్వహించాం. పంటలకు సంబంధించి స్పష్టమైన సమాచారం వచ్చింది. పూర్తి స్థాయిలో ఏయే గ్రామాల్లో రైతులు ఏయే పంటలు వేశారో గుర్తించాం. ఈ విధానంతో మున్ముందు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సమాకుర్చుకునే అవకాశం ఉంటుంది. అంతేగాకుండా జిల్లాలో ఆహార పంటలు,వాణిజ్య పంటలపై పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది.
- భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయాధికారి

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles