మంచిర్యాల టూ మహారాష్ట్ర

Wed,August 21, 2019 04:30 AM

-ఆసిఫాబాద్ మీదుగా చంద్రాపూర్‌కు ఫోర్‌లేన్ పనులు వేగవంతం
-రూ. 1500 కోట్లతో.. 90 కిలో మీటర్ల వరకు నిర్మాణం
-ఇప్పటికే రోడ్డు విస్తరణకు 120 ఎకరాలు గుర్తింపు
-సర్వేలో నిమగ్నమైన ఫారెస్టు అధికారులు
-వన్యప్రాణులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
-రహదారి పూర్తయితే గంటకుపైగా సమయం ఆదా..
-రోడ్డు ప్రమాదాలూ జరిగే అవకాశాలు తక్కువ
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :కేంద్ర ప్రభుత్వం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం నుంచి ఆసిఫాబాద్ మీదుగా మహారాష్ట్రలోని చంద్రాపూర్ వరకు నిర్మించే ఫోర్‌లేన్ పనులు వేగవంతం చేసింది. రూ.1500 కోట్లతో 90 కిలో మీటర్ల మేర నాలుగు వరుసల రహదారి విస్తరించనుండగా, ఇప్పటికే అధికార యంత్రాంగం 90 నుంచి 120 ఎకరాలు గుర్తించింది. రోడ్డు విస్తరణలో భూములు, ఇండ్లు తదితర ఆస్తులు కోల్పోయే వారికి ఇచ్చే పరిహారంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానున్నది. ఇక వన్యప్రాణులకు ఇబ్బందులు కలగకుండా ఫారెస్టు సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. వాంకిడి-మహారాష్ట్ర సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో అండర్‌గ్రౌండ్ బ్రిడ్జిలు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. త్వరలోనే రహదారి పూర్తయ్యే అవకాశముండగా, మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానున్నది.

తెలంగాణ టూ మహారాష్ట్ర వరకు నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. 2016 డిసెంబర్‌లో కేంద్రం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నిర్వాసితులకు పరిహారం, రహదారి పనులు ప్రారంభంపై ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించారు. జైపూర్ మండలం ఇందారం మూల మలుపు నుంచి చంద్రాపూర్ వరకు ఎన్‌హెచ్-363 ప్రారంభవుతుంది. 90 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రోడ్డు కోసం రూ. 1500 కోట్లు కేటాయించింది. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల మీదుగా చంద్రాపూర్ వరకు ఈ రహదారి నిర్మాణం ఉంటుంది. రోడ్డు నిర్మాణానికి అధికారులు భూ సర్వే చేపడుతున్నారు. ఫోర్‌లైన్ నిర్మాణానికి సంబంధించి వాంకిడి - మహారాష్ట్ర సరిహద్దుల్లోని అటవీ భూములను సీఎఫ్ వినోద్ కుమార్, జిల్లా అటవీ అధికారి లక్ష్మణ్ రంజిత్‌నాయక్ పరిశీలించారు.
బైపాస్ రోడ్లు.. ైఫ్లె ఓవర్లపై త్వరలో స్పష్టత..
ప్రస్తుతమున్న రెండు వరుసల రహదారిన నాలుగు వరుసలుగా ఉన్నతీకరిస్తూ గ్రామాలు, పట్ణణాలు వచ్చిన ప్రాంతాల్లో బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు. రోడ్డు విస్తరణ కోసం ఇప్పటి వరకు సుమారు 90 నుంచి 120 ఎకరాలు గుర్తించినట్లు తెలుస్తోంది. రోడ్డుకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో ైఫ్లె ఓవర్లు నిర్మిస్తారా లేక.. భూసేకరణ ద్వారా బైసాప్ రోడ్డు నిర్మాణం చేపడుతారా.. అనే విషయాలపై త్వరలోనే స్పష్టత రానున్నది. రోడ్డు విస్తరణలో మూడ వందల నుంచి నాలుగు వంద వరకు గృహాలను తొలగించాల్సి వచ్చే అవకాశం ఉంది. నాలుగు వరుసల రోడ్డు విస్తరణలో భూములు, ఇండ్లు ఇతర ఆస్తులు కోల్పోయే వారికి కేంద్రం ఇచ్చే నష్టపరిహారంపై ఇంకా స్పష్టత రాలేదు.

కొనసాగుతున్న సర్వే..
జిల్లా నుంచి చంద్రాపూర్ వరకు విస్తరించనున్న నాలుగు వరుసల రహదారి వలన అటవీ జంతువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు విస్తరించేందుకు అటవీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం వాంకిడి-మహారాష్ట్ర సరిహద్దుల్లోని అటవీ భూములను సీఎఫ్ వినోద్ కుమార్, జిల్లా అటవీ అధికారి లక్ష్మణ్ రంజిత్‌నాయక్ పరిశీలించారు. జిల్లాలో అడవుల్లో వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు ఇటీవలి కాలంలో వాంకిడి సరిహద్దు అటవీ ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంతో పాటు - మహారాష్ట్ర అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. నాలుగు వరుసల రహదారి విస్తరణ వలన అటవీ జంతువుల స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అండర్ గ్రౌండ్ వంతెనలను నిర్మించేలా ప్రతిపాదనలు చేస్తున్నారు. వాంకిడి- మహారాష్ట్ర మధ్య విస్తరించనున్న నాలుగు వరుసల రహదారిపై ఇప్పటి వరకు మూడు అండర్‌గ్రౌండ్ వంతెనలు అవసరమున్నట్లు గుర్తించినట్లు అటవీ అధికారులు తెలిపారు.

ఫోర్‌లేన్ పూర్తయితే సమయం ఆదా..
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల మీదుగా మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు వేస్తున్న ఫోర్‌లేన్ (నాలుగు వరుసల రహదారి)తో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానున్నది. మంచిర్యాల జిల్లా తాండూర్, రెబ్బెన, ఆసిఫాబాద్, వాంకిడి మీదుగా బల్లార్ష నుంచి చంద్రాపూర్ వరకు వేస్తున్న ఫోర్‌లేన్ (నాలుగు వరుసల రహదారి)తో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానున్నది. నిత్యం వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వేలాది వాహనాలు మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, వాంకిడి మీదుగా మహారాష్ట్రలోని చంద్రాపూర్, నాగ్‌పూర్‌కు వెళ్తుంటాయి. ప్రస్తుతం మంచిర్యాల నుంచి చంద్రాపూర్‌కు వెళ్లేందుకు నాలుగు గంటలు, ఆసిఫాబాద్ నుంచి వెళ్లేందుకు మూడున్నర గంటల సమయం పడుతుంది. ఫోర్‌లేన్ పూర్తయితే గంటకు పైగా సమయం ఆదా అవ్వడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles