రోళ్లు పగిలేలా..

Mon,May 27, 2019 02:51 AM

-జిల్లాలో మరింత ముదిరిన ఎండలు
-ఆదివారం గరిష్ఠంగా 46 డిగ్రీలు నమోదు
-ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు
-కర్ఫ్యూని తలపించిన రహదారులు
-జ్యూస్ సెంటర్ల వద్ద బారులు
-ఇప్పటికే వడదెబ్బతో ఐదుగురి మృత్యువాత
భానుడి విశ్వరూపానికి జిల్లా నిప్పుల కుంపటిలా రగులుతున్నది. రోహిణికార్తె ప్రారంభంకావడంతో రోళ్లు పగిలేలా ఎండ దంచికొడుతున్నది. ఉదయం ఆరింటికే భగభగమండుతుండగా, పదింటికే మిట్ట మధ్యాహ్నాన్ని తలపిస్తుంది. ఆదివారం గరిష్ఠంగా 46 డిగ్రీలు నమోదు కాగా, ప్రజానీకం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యింది. వడగాలులతో జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారగా, అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. ఇక జ్యూస్ సెంటర్లు, అంబలి పంపిణీ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరగా, వేడిమిని తట్టుకోలేక మూగజీవాలు సైతం చెట్ల నీడన చేరి సేదతీరాయి. ఇదిలా ఉంటే వడదెబ్బతో ఈ ఏడాది ఇప్పటికే ఐదుగురు మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తున్నది.

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తున్నది. రోహిణికార్తె కావడంతో రోకళ్లు పగిలేలా ఎండలు దంచికొడుతుండగా, 44 నుంచి 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్ర 3 గంటల వరకు 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఆదివారం గరిష్ఠంగా 46 డిగ్రీలు నమోదు కాగా, కనిష్టంగా 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. సాయంత్రం 7 గంటల వరకూ ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు.

అల్లాడిపోతున్న జనం..

రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పెరిగిన ఎండలను దృష్టిలో ఉంచుకుని చిన్నారులు, పెద్దలు, వృద్ధులు సైతం అప్రమత్తంగా ఉండాలంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 6 గంటలకే ప్రారంభమవుతున్న ఎండ ప్రతాపం 10 గంటలకే మిట్ట మధ్యాహ్నాన్ని తలపిస్తుంది. ఇక మధ్యాహ్నం ఒంటిగంటకల్లా భానుడు భగభగ మండుతుండడంతో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రధానంగా తిర్యాణి, రెబ్బెన మండలాల్లో సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనులు ఉండడంతో ఆ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ప్రజలు ఎంతటి అత్యవసర పనులున్నా సాయంత్రానికి వాయిదా వేసుకుంటున్నారు. ఉపాధి హామీ కూలీలు ఉదయయమే పనులు ముగించుకొని ఇళ్లకు చేరుకుంటున్నారు. భవన నిర్మాణ కార్మికులు రాత్రి వేళల్లో పనులు చేస్తున్నారు. భానుడి ఉగ్ర రూపానికి పశుగ్రాసం సైతం ఎండిపోయి పశువులు, మేకలు, గొర్రెలకు మేత దొరకని పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు సైతం అడుగంటిపోతుండడం ఆందోళన కలిగిస్తున్నది.

శీతల పానీయాలకు పెరిగిన గిరాకీ..

ఎండలు మండుతుండడంలో శీతల పానీయాలు, పండ్ల రసాలు, కొబ్బరి బోండాల వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రజలు నిమ్మరసం, చెరుకు రసం, కూల్‌డింక్స్ కోసం తహతహలాడుతున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న వ్యాపారులు ధరలు అమాంతం పెంచేశారు. ఇక మందుబాబులైతే బీర్ల కోసం వైన్‌షాపుల చుట్టూ తిరుగుతున్నారు. ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో మధ్య తరగతి ప్రజలు కూలర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

వడదెబ్బతో ఐదుగురి మృత్యువాత

భానుడి ప్రతాపానికి ఇప్పటికి ఈ ఏడాది ఐదుగురు వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. కౌటాల మండలంలోని మొగడ్‌దడ్ గ్రామానికి చెందిన ఉర్వతి బూరు(50), రెబ్బెన మండలం అమ్మినగూడకు చెందిన లక్ష్మమ్మ(78), రెబ్బెనకు చెందిన శంకర్( 50), గౌతంనగర్‌కు చెందిన రాజ్‌కుమార్(27), గోలేటి టౌన్ షిప్‌కు చెందిన రాజు (31) మృతి చెందారు.

66
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles