మోదం.. ఖేదం..

Sat,May 25, 2019 11:55 PM

-స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు వాయిదా
-త్వరలో మరో తేదీ ప్రకటించనున్న ఎస్‌ఈసీ
-ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు తప్పని నిరీక్షణ
-ఫలితాల రాక ఆలస్యంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ
-ఎంపీపీ, జడ్పీ చైర్మన్ అభ్యర్థులకు ప్రయోజనం
-తప్పిన ఆర్థిక భారం.. క్యాంపుల్లో ప్రలోభాల పర్వం

నిర్మల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 70 మండలాలు ఉండగా.. ఇందులో 66 గ్రామీణ మండలాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1,508 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 66 జడ్పీటీసీ స్థానాలు, 567 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ఒక జడ్పీటీసీ స్థానంతోపాటు తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 65 జడ్పీటీసీ, 558 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో భాగంగా ఈ నెల 6న ఉమ్మడి జిల్లాలో 26 జడ్పీటీసీ, 194 ఎంపీటీసీ స్థానాలకు 192 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. తొలి విడతలో నిర్మల్ జిల్లాలో ఒకరు, మంచిర్యాల జిల్లాలో ఒకరు చొప్పున టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. రెండో విడత కింద 20 మండలాల్లోని 20 జడ్పీటీసీ స్థానాలకు, 181ఎంపీటీసీ స్థానాలకు 174 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నిర్మల్ జిల్లాలో నాలుగు, మంచిర్యాల జిల్లాలో మూడు.. మొత్తం 7 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మూడో విడతలో భాగంగా ఈ నెల 14న ఉమ్మడి జిల్లాలో 20 జడ్పీటీసీ స్థానాలకు.. 19 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ నుంచి ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మీ జైనూర్ జడ్పీటీసీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక 192 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

ఓట్ల లెక్కింపు వాయిదా..
మూడు విడతల్లో స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించగా.. వీటి ఓట్ల లెక్కింపు ఈ నెల 27న నిర్వహించాల్సి ఉంది. ప్రత్యక్ష ఎన్నికల(ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఓట్ల లెక్కింపు తేదీకి.. పరోక్ష ఎన్నికల(మండల, జిల్లా పరిషత్ చైర్మన్లు)కు మధ్య 40 రోజుల సమయం ఉండటంతో.. ఈ లోగా గెలిచిన సభ్యులను ప్రలోభాలకు గురి చేసే అవకాశముందని రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు వాయిదా వేసింది. ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల నిర్వహణకు మధ్య ఉన్న సమయాన్ని తగ్గించాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఎస్‌ఈసీ పేర్కొంది. మరోవైపు జూలై 4న మండల పరిషత్‌లు, జూలై 5న జిల్లా పరిషత్‌ల కాలపరిమితి ముగియనుంది. జూలై 4 తర్వాతే కొత్త మండల, జిల్లా పరిషత్ పాలక వర్గాలు కొలువు దీరేందుకు అవకాశముంది.

అప్పటి వరకు పాఠశాలలు, కళాశాలల్లోని బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలకు పోలీసు భద్రత కల్పిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి నియోజకవర్గ కేంద్రంతోపాటు ఇతర చోట్ల కూడా ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం నాలుగు జిల్లాల పరిధిలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 చోట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మూడు చోట్ల ఆదిలాబాద్, బోథ్, ఉట్నూర్‌లో.. నిర్మల్ జిల్లాకు సంబంధించి మూడు చోట్ల.. నిర్మల్, ముథోల్, ఖానాపూర్‌లో ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించి నాలుగు చోట్ల మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, లక్సెట్టిపేటలో.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి రెండు చోట్ల ఆసిఫాబాద్, సిర్పూర్(టి)లో ఏర్పాటు చేశారు.

నిరాశలో అభ్యర్థులు..
ఎస్‌ఈసీ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు తీవ్ర నిరాశ మిలిగింది. ఎన్నికల ఫలితాల కోసం ఇప్పటికే వారంతా ఎదురు చూస్తుండగా.. తాజా నిర్ణయంతో మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు. మరికొన్ని రోజుల వరకు ఫలితాలపై టెన్షన్ తప్పేలా లేదు. ఇప్పటికే ఓట్ల లెక్కల్లో నిమగ్నమైన వారంతా.. గెలుస్తామా.. లేదో.. తెలియక ఆందోళన చెందుతున్నారు. ఫలితాలు వస్తే తమ భవితవ్యం తేలిపోయేదని భావించారు. ఇక ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ పదవులు ఆశిస్తున్న వారికి మాత్రం ఈ వాయిదా నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా మారింది. స్థానిక సంస్థల ప్రత్యక్ష ఓట్ల లెక్కింపు తర్వాత 40 రోజులపాటు ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులను క్యాంపుల్లో ఉంచటం, వారికి సకల సేవలు, మర్యాదలు చేయాల్సి వచ్చేంది. మరోవైపు డబ్బుల పంపిణీ, నజరానాల ప్రకటన ఎలాగో ఉండనుంది. ఈ నిర్ణయంతో ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల మధ్య గడువు తగ్గటంతో.. వ్యయ, ప్రయాసలు తగ్గనున్నాయి. హమ్మయ్యా అంటూ ఎంపీపీ, జడ్పీ చైర్మన్ అభ్యర్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

కలెక్టర్ అభినందన
తాండూర్: అచ్చలాపూర్‌లో జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ భారతి హోళికేరి అభినందించారు. పదో తరగతి ఫలితాల్లో పాఠశాల విద్యార్థి మొదటి ర్యాంక్ సాధించింది. రేచిని, అచ్చలాపూర్ పాఠశాలలు ఉత్తీర్ణతలో మొదటి స్థానంలో నిలిచాయి. అచ్చలాపూర్ పాఠశాల నుంచి మొ దటి ర్యాంకు సాధించిన డీ అనుశ్రీ (9.8 జీపీఏ), రెండో ర్యాంక్ జీ సా త్విక (9.7 జీపీఏ) మూడో ర్యాంక్ సాధించిన సాహిత్య (9.5 జీపీఏ)ను కలెక్టర్ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. డీఈవో రషీద్, హెచ్‌ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు పీఈటీ బెల్లం శ్రీనివాస్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రవి, సత్యనారాయణ పాల్గొన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles