రంజాన్ కానుకలు సిద్ధం

Sat,May 25, 2019 02:00 AM

-జిల్లాకు చేరుకున్న గిఫ్ట్ ప్యాక్‌లు
-3,500 బహుమతుల పంపిణీకి ఏర్పాట్లు
-ఇఫ్తార్ విందుకు రూ. 7 లక్షల కేటాయింపు
-నేడు కలెక్టర్ రాజీవ్‌గాంధీ అధ్యక్షతన మజీద్ కమిటీలతో సమావేశం
ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : అన్ని మతాలు, పండుగలకూ ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర సర్కారు రంజాన్ సందర్భంగా ముస్లింలకు ప్రత్యేక బహుమతులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం రంజాన్ నెలను పురస్కరించుకుని ప్రభుత్వం తరపున కానుక అందించేందకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గానికి 1500 గిఫ్ట్‌లు, సిర్పూర్(టి) నియోజకవర్గానికి 2000 గిఫ్ట్ ప్యాకులు రాగా, ఈ నెల 27 తర్వాత పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని సిర్పూర్(టి),ఆసిఫాబాద్ నియోజకవర్గాల పరిధిలోని 15 మండలాల్లో మైనార్టిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలను గుర్తించారు. జనాభాను బట్టి మండలాల వారీగా ఈ బహుమతులను పంపిణీ చేయనున్నారు.

ప్యాకెట్‌లో ఏమేం ఉంటాయంటే..
ముస్లింలకు పంపిణీ చేయనున్న గిఫ్ట్ ప్యాకెట్‌లో చీర, జాకెట్, ప్యాంట్, షర్టు, కూతురికి ప్యాంటు, చున్నీ, స్కర్టు ఉంటాయని అధికారులు వెల్లడించారు. పేద ముస్లిం కుటుంబాలు పండుగకు కొత్త దుస్తులు వేసుకుని ఆనందంగా జరుపుకోవాలని సర్కారు భావించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. నియోజకవర్గాల వారీగా కేటాయించిన గిఫ్ట్ ప్యాక్‌లను అర్హులకు అందించనున్నారు.

కోడ్ నేపథ్యంలో ఆలస్యం..
రంజాన్‌కు సంబంధించిన బహుమతుల పంపిణీకి సంబంధించి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో గిఫ్ట్ ప్యాకుల పంపిణీ కొంత ఆలస్యమైంది. పండుగకు ముందుగానే పేద ముస్లిం కుటుంబాలకు బహుమతులు అందించనున్నారు. ఈ కార్యక్రమాలు ఆర్డీవోల పర్యవేక్షణలో జరగనున్నాయి. గతంలో మాదిరిగా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల, కలెక్టర్, ఆర్డీవోల ఆధ్వర్యంలో పంపిణీ చేపట్టనున్నారు. దీంతో మజీద్ కమిటీల ఆధ్వర్యంలో పేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాకులు అందజేస్తారు. రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందుల కోసం ప్రభుత్వం రూ. 7 లక్షలు మంజూరు చేసింది. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి రూ. 3 లక్షలు, సిర్పూర్(టి) నియోజకవర్గానికి రూ. 4 లక్షల చొప్పున అందచేయనున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా బహుమతులు పంపిణీ చేయడంపై ముస్లింలతో పాటు, మత పెద్దలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మసీద్ కమిటీల ఆధ్వర్యంలో..
పండుగ సందర్భంగా మసీద్ కమిటీల ఆధ్వర్యంలోనే విందు కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం నుంచి మంజురైన నిధులు నేరుగా మసీద్ కమిటీల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఆసిఫాబాద్ నియోజవర్గంలో జైనూర్,కెరమెరి,ఆసిఫాబాద్, సిర్పూర్ (టి) నియోజకవర్గంలో కాగజ్‌నగర్,బెజ్జుర్,సిర్పూర్(టి) మండలంలో విందు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు 7 మసీద్ కమిటీలను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.
నేడు సమావేశం
రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం పేద ముస్లింలకు అందజేస్తున్న గిఫ్ట్ ప్యాకులు, విందు భోజనం ఏర్పాటుపై 25న కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా మైనార్టీ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు.ఈ సమావేశానికి సూచించిన మసీద్ కమిటీ సభ్యులు, సంబంధిత ఆధికారుల సకాలంలో హాజరు కావాలని పేర్కొన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles