పరిషత్ కౌంటింగ్ వాయిదా

Sat,May 25, 2019 01:58 AM

-అభ్యర్థులకు తప్పని నిరీక్షణ
- తదుపరి ఓట్ల లెక్కింపు తేదీలను ప్రకటిస్తామన్న ఈసీ
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రస్తుతం కొనసాగుతున్న ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌ల పదవీ కాలం జూలై 3 వరకు ఉంది. ఇటీవల మూడు విడతల్లో నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ను ఈ నెల 27న నిర్వహించినుండగా, ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌ల ఎంపిక కోసం జూలై 3 వరకు ఆగాల్సి ఉంటుంది. ఎన్నికల కౌంటింగ్‌కు- ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌ల ఎంపికకు మధ్య చాలా వ్యవధి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలలో, ఎంపికైన వారి మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఉండడంతో ఎన్నికల కౌంటింగ్‌ను వాయిదా వేయాలని వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేశాయి. బ్యాలెట్ బాక్స్‌ల భద్రత కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు చాలా వరకు పాఠశాలలు, కళాశాలల్లో ఏర్పాటు చేశారు. పాఠశాలలు పున:ప్రారంభం కానుండడంతో స్ట్రాంగ్ రూంలు, బ్యాలెట్ బాక్సుల స్టోరేజీ, భద్రతకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.

అభ్యర్థులకు తప్పని నిరీక్షణ...
స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా పోటీచేసిన అభ్యర్థులు ఫలితాల కోసం మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు. జిల్లాలోని 15 మండలాల్లో ఉన్న 123 ఎంపీటీసీ, 14 జడ్పీటీసీ స్తానాలకు ఈనెల 6, 10,14 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. ఈనెల 27 ఓట్ల లెక్కింపు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి సిర్పూర్-టిలో, ఆసిఫాబాద్ నియోకవర్గానికి సంబంధించి ఆసిఫాబాద్‌లో ఓట్ల లెక్కింపు కోసం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మరో రెండు రోజుల్లో ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెలువరిస్తారని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వివిధ రాజకీయ పార్టీలు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ను వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని కోరటంతో ఈసీ వాయిదా నిర్ణయాన్ని తీసుకుంది. మళ్లీ ఎప్పుడు కౌంటింగ్ చేసే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles