ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి

Thu,May 23, 2019 01:13 AM

-అందుబాటులో సాంకేతిక నిపుణులు
-ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సీసీ కెమెరాలు
-ఎన్నికల రిటర్నింగ్ అధికారి దివ్యదేవరాజన్
-ఉమ్మడి జిల్లా అధికారులకు శిక్షణ

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ :ఆదిలాబాద్ లోక్‌సభ ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దివ్యదేవరాజన్ ఆదేశించారు. ఎన్నికల పరిశీలకులు, పర్యవేక్షకులతో కలిసి ఆదిలాబాద్‌లో బుధవారం ఉమ్మడి జిల్లా కౌంటింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలనీ, ప్రతి టేబుల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రాష్ట్ర కార్యాలయానికి అనుసంధానం చేశామని పేర్కొన్నారు.

లోకసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలని పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి,సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సహాయకులు, సూపర్‌వైజర్లు, సూక్ష్మ పరిశీలకులకు ఎన్నికల నియమావళి మేరకు లెక్కింపు జరపాలన్నారు. ఏమైనా సమస్యలు ఉత్పన్నమైనపుడు ఆయా సహాయ రిటర్నింగ్ అధికారులకు తెలియజేయాలన్నారు. రౌండ్ల వారీగా ఫలితాలను ఎప్పటికప్పుడు అందజేయాలని సూచించారు. ఈవీఎంలు మొరాయిస్తే సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

ప్రతి టేబుల్ వద్ద సీసీకెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కెమెరాలను రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయానికి అనుసంధానం చేసినట్లు చెప్పారు. కౌంటింగ్ సమయంలో అధికారులు ఒత్తిడికి గురికావద్దన్నారు. నిబంధనల మేరకే కౌంటింగ్ చేపట్టాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులుంటే ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలన్నారు.

గురువారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుందనీ, అధికారులు సకాలంలో హాజరు కావాలని తెలిపారు. జిల్లాల వారీగా ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తారనీ, పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా తాను మూడు జిల్లాల కౌంటింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకుడు సంజయ్‌కుమార్ సింగ్, అదనపు లెక్కింపు పరిశీలకుడు మల్లికా నిగమ్ నగర్, రాబిన్ తప్పో, అబ్దుల్ రషీద్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య, జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, ఇతర సహాయ రిటర్నింగ్ అధికారులు, లెక్కింపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles