రైతుబంధు రెడీ

Mon,May 20, 2019 11:10 PM

-ఎన్నికల కోడ్‌ తొలగిన వెంటనే పంపిణీ చేయాలంటూ ఆదేశాలు
-ఎకరాకు అదనంగా రూ.వెయ్యి పెంచిన సర్కారు..
-జిల్లాకు రూ.118 కోట్ల నుంచి రూ.135 కోట్ల వ్యయం

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ :తెలంగాణ ప్రభుత్వం మరోమారు ‘రైతుబంధు’ సాయం అందించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నెలాఖరుకల్లా ఎన్నికల కోడ్‌ తొలగనుండగా, అధికార యంత్రాంగం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నది. గత రబీలో రూ. 118 కోట్లు ఇవ్వగా, ఈ ఏడాది ఎకరాకు అదనంగా మరో రూ. వెయ్యి ఇవ్వనుండగా, వ్యయం మరింత పెరగనున్నది. రూ. 135 కోట్ల వరకు వ్యయం రైతులకు అందించనుండగా గత ఖరీఫ్‌, రబీలో రాని వారికి కూడా ఖాతాల్లో జమ చేయనున్నది.

తెలంగాణ ప్రభుత్వం మరోమారు రైతు బంధు పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే దానికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందించారు. గత రబీలో రూ. 118 కోట్లు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయగా, ఇప్పు డు మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సాగులో రైతులకు అండదండలు అందిస్తున్న ప్రభుత్వం పెట్టుబడి సాయం గడువులోగా అందించి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు ఈ సాయం ఉపయో గపడాలని భావిస్తోంది. ఆ మేరకు అధికారులకు ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. వేసవి ముగిసేందుకు కేవలం మరో 15 రోజులు ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం నిధులను సైతం మంజూరు చేసింది. ఈ నెలఖారులోగా అందించాలని సన్నాహాలు చేస్తున్నారు. 2017-18 ఖరీఫ్‌లో 91,978 మంది రైతులకు రూ. 118 కోట్లు పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటి వరకు రెవెన్యూ పట్టాదారులకు 93,985 చెక్కులు రాగా 87,412 చెక్కులకు సంబంధించి రూ 112 కోట్లు పంపిణి చేశారు. దీంతో పాటు అటవీహక్కుదారులకు 12,306 మందకి 12,317 చెక్కులు రాగా 10,814 చెక్కులు అందజేశారు. రూ. 15.89 కోట్లు అటవీభూమి హక్కుదారులకు రైతు బంధు అందజేశారు. రబీలో రూ. 87.50 కోట్లు పంపిణీ చేశారు.

పట్టా పాసు పుస్తకాలు రాకపోవడం, వివాదాలు ఉండటం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, వివిధ కారణాలతో రైతు బంధు అమలు కాలేదు. అనంతరం రబీలో కూడా దాదాపు అంతే మొత్తాన్ని విడుదల చేసింది. రబీ సీజన్‌ సమయంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో రైతుల ఖాతాల్లోకే నేరుగా నగదు బదిలీ చేశారు.

కోడ్‌ ముగిసిన వెంటనే పంపిణీ..
ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం వ్యవసాయ, రెవెన్యూ, ట్రెజరీ శాఖ అధికారులు సన్నద్ధంగా ఉన్నారు. గతంలో ఎకరానికి రూ. 4 వేలు అందజేయగా, ఈయేడు రూ. 5 వేలకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో రైతులకు అధిక మొత్తంలో చేతికి అందనుంది. గత ఖరీఫ్‌, రబీలో రాని వారికి కూడా పెట్టుబడి సాయం అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

ఎదురుచూపులు..
జిల్లాలో ఖరీఫ్‌లో ఎక్కువగా పత్తి, వరి సాగు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు పెద్ద ఎత్తున పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటికే వేసవి దుక్కులు దున్నుకుని సిద్ధంగా ఉన్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెలఖారులోగా రైతుబంధు సాయం అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యిందని కోడ్‌ ముగియగానే ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వాటిని పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఈసారి పెట్టుబడి సాయం ఎకరానికి మరో రూ. 1000 పెంచారు. దీంతో బడ్జెట్‌ మరింత పెరగనుంది. ఖరీఫ్‌, రబీలో రూ. 118 కోట్లు కేటాయించారు. ఇప్పుడు అది రూ. 135 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రైతులకు నూతనంగా పాసు పుస్తకాలు అందచేయడం వల్ల 2019-20 సంవత్సరం ఖరీఫ్‌కు ఎక్కువ మంది రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నూతనంగా పాసు పుస్తకాలు పొందిన వారు, తప్పులు దిద్దినవి, ఇతర కారణాలతో పెట్టుబడి సాయం పొందని ఖాతాలు అన్నింటి వివరాలను ప్రస్తుతం వ్యవసాయ విస్తరణాధికారులు సేకరించారు.

70
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles