ముమ్మరంగా సాగు సర్వే

Sat,May 18, 2019 12:48 AM

సాగును లాభసాటిగా మార్చేందుకు సర్కారు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆహార, వాణిజ్య పంటల డిమాండ్‌ను బట్టి పంట కాలనీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో 44 అంశాలపై సర్వే చేపడుతున్నది. జిల్లాలో 70 వ్యవసాయ క్లస్టర్లలోని 415 గ్రామాల్లో 94,244 మంది రైతులు ఉండగా, ఇప్పటి వరకు 73,530 మంది నుంచి వివరాలు సేకరించింది. ఈ నెలాఖరుకల్లా సర్వే పూర్తి చేయనుండగా, ఆ తర్వాత సర్కారుకు నివేదికలు అందించనున్నది.
ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : ఆహార, వాణిజ్య పంటల డిమాండ్‌ను బట్టి పంట కాలనీలు ఏర్పాటు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన సాగు సర్వే జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, సిబ్బంది పంటల వివరాలతో పాటు 44 అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. వ్యవసాయం దండుగన్న పాలకుల విధానాలను వ్యతిరేకిస్తూ.. సాగును లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే అనేక సంస్కరణలు చేపడుతూ వస్తున్నది. మార్కెట్‌లో అవసరాలు, డిమాండ్‌ను బట్టి పంటల ఉత్పత్తి చేపడితే రైతుకు మేలు జరుగుతుందని ప్రభుత్వం పంటకానీలను ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నది. వాతావరణ పరిస్థితులు, భూముల్లోని సారాన్ని బట్టి పంటలు సాగు చేస్తే మంచి దిగుబడి రావడంతో పాటు రైతుకు ఆర్థిక పనరులు సైతం పెరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే జిల్లాలో సాగు సర్వే చేపడుతున్నది. ఆధార్ సమాచార వినియోగాన్ని అంగీకార పత్రం పేరుతో ఈ సర్వేలో భాగంగా ప్రతి రైతు నుంచి 44 అంశాలను సేకరిస్తూ ఇప్పటి వరకు 78.10 శాతం పూర్తి చేసింది.

44 అంశాలతో కూడిన సర్వే...
రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్‌లో ప్రారంభమైనటువంటి సాగు సర్వే రైతుల వారీగా ముమ్మరంగా కొనసాగుతుంది. వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ సిబ్బంది సహకారంతో అన్ని గ్రామాల్లో రైతుల వారీగా 44 అంశాలతో కూడిన వివరాలు సేకరిస్తున్నారు. తొలుత 39 అంశాలే ఉండగా.. ఆ తర్వాత మరో 5 అంశాలను ప్రభుత్వం చేర్చింది. ప్రతి రైతు ప్రస్తుతం ఏ పంట వేశాడు& దానిని విస్తీర్ణం, పెట్టుబడి, దిగుబడి, మార్కెటింగ్, మిగులుబడి తదితర కోణాల్లో వివరాలు సేకరిస్తూ సర్వే చేపడుతున్నారు. రైతువారీగా చేపట్టే ఈ సర్వేలో రైతు సాగు చేసిన పంట భూమి వివరాలు, వాటిని మార్కెటింగ్ చేయడంపై ప్రధాన దృష్టి పెట్టారు. ఈ నెల చివరి వరకు రైతుల వారీగా వివరాలు సేకరించి ఎప్పటికప్పడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 70 క్లస్టర్లలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారులు ఉద్యానశాఖ అధికారులతో సమన్వయం చేసుకొని తీసుకున్న డేటాను సేకరిస్తున్నారు.

70 క్లస్టర్లు... 415 గ్రామాలు..
జిల్లాలో 70 వ్యవసాయ క్లస్టర్లలోని 415 గ్రామాల్లో 94,244 మంది రైతుల నుంచి సాగు వివరాలు సేకరించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 73,530 మంది రైతుల నుంచి వివరాలను సేకరించారు. సర్వే 78.10 శాతం వరకు పూర్తయ్యింది. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 15 మండలాలల్లో ఇప్పటి వరకు అత్యధికంగా లింగాపూర్ మండలంలో79.97 శాతం సర్వే పూర్తి కాగా, అత్యల్పంగా సిర్పూర్(టి) మండలం 77.02 శాతం పూర్తయ్యింది. అన్ని మండలాల్లోనూరెండు మూడు శాతం అటు ఇటుగా సర్వే ఫలితాలు ఉన్నాయి. మార్చి 25న జిల్లాలో సర్వే ప్రారంభమైనప్పటీకీ తొలి 15 రోజులు కొంత మందకొడిగా సర్వే జరిగింది. ఈ నెలాఖరు వరకు సర్వే వివరాలను నివేదించాల్సిన నేపథ్యంలో ఇటీవల అధికార యాంత్రం ముమ్మరంగా రైతుల నుంచి వివరాల సేకరణ చేపడుతుంది.
పంట కాలనీలు... ప్రాసెసింగ్ యూనిట్లు..
ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే ఉదేశంతో పంటకాలనీల వైపు దృష్టి పెట్టింది. ప్రస్తుతం జిల్లాలో వాణిజ్య పంట ఆయిన పత్తి అధికంగా సాగవుతుండగా, రెండో స్థానంలో వరి ఉంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో కంది, వరి, పెసర, జొన్న తదితర పంటలపై రైతులు ఎక్కవగా మొగ్గుచూసేది.. కానీ ఇటీవలి కాలంలో రైతులు వాణిజ్య పంటలపైన ఎక్కవగా దృష్టి పెట్టారు. పప్పు దినుసులు, కూరగాయల వైపు రైతాంగం ఆలోచనే చేయడం లేదు.ఈ కోణంలో వివరాలు సేకరిస్తున్న అధికార యంత్రాంగం జిల్లా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏ మేరకు అవసరం ఉంటాయి. ఇక్కడ నేలల పరిస్థితి ఏమిటి.. ఏ పంట దిగుబడి వస్తుంది.. అనే వివరాలు సేకరిస్తున్నారు ఈ సర్వే అనంతరం సర్కార్ సూచన మేరకు మండలాల వారీగా.. లేదంటే క్లస్టర్ల వారీగా పంట కాలనీలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో యంత్రాంగం ఉంది. అదే విధంగా పండించినటువంటి పంటలకు అనుగుణంగా రైతుకు గిట్టుబాటు ధర రావాలని ప్రాసెసింగ్ యూనిట్లను సైతం సర్కారు ఏర్పాటు చేసే యోచనలో ఉంది. పత్తి పండిస్తే జన్నింగ్ మిల్లులు, వరి పండిస్తే రైస్ మిల్లులు అవసరం. పప్పుదినుసులు ప్రత్యేక ప్రాసెసింగ్ యూనిట్లు కావల్సి ఉంటుంది. పండ్లు, మిర్చీకి కోల్డ్, స్టోరేజీలు అవసరమని యోచించి వ్యవసాయ, ఉద్యాన, ఐకేపీ, పరిశ్రమలు, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో ఈ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి దిగ్విజయంగా నడిపించాలని ప్రణాళికలు రూపొందించింది. ఆయా శాఖల ఆధ్వర్యంలో ప్రాసెస్ అయినటువంటి ఉత్పత్తులను విక్రయించే చర్యలు తీసుకోనున్నది.

నెలాఖరుకు పూర్తి చేస్తాం
జిల్లా వ్యాప్తంగా సాగు సర్వే వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ముమ్మరంగా చేస్తున్నాం. 70 క్లస్టర్లు 415 గ్రామాల్లో రైతుల వారీగా చేపట్టిన సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రధానంగా పంట కాలనీల ఏర్పాటే లక్ష్యంగా ఈ సర్వే కొనసాగుతుంది.
- భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, ఆసిఫాబాద్

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles