స్వచ్ఛత వైపు..

Fri,May 17, 2019 01:30 AM

- జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో ప్రగతి
-ఇప్పటికే 17800 పూర్తి... నిర్మాణ దశలో 1377
-బహిరంగ మల విసర్జన లేని పల్లెల కోసం సర్కారు చర్యలు
- జూన్‌కల్లా లక్ష్యం పూర్తికి అధికారుల కసరత్తు
కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేసి బహిరంగ మలమూత్ర విసర్జన లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్వచ్ఛ మిషన్‌లో భాగంగా ప్రభుత్వం ఇంటింటా వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించాలన్న సంకల్పంతో ప్రారంభించిన కార్యక్రమం, ప్రస్తుతం ప్రగతి దశలో ఉంది. జిల్లాలో సుమారు లక్షా 4 వేల గృహాలు ఉన్నాయి. వీటిలో సుమారు 54 వేల 873 గృహాలకు మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటి వరు దాదాపు 17 వేల 800 ఇళ్లకు మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. మరో 36 వేల మరుగుదొడ్లు నిర్మాణాల్లో ఉన్నాయి. ఇంకా 1377 ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభించాల్సి ఉంది. జిల్లాలో తెల్లరేషన్‌ కార్డులు కలిగిన ప్రతీ కుటుంబానికి మరుగుదొడ్డి ఉండాలనే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణానికి రూ 12 వేలు అందిస్తోంది. మరుగుదొడ్డిని కట్టుకోలేని వారికి డబ్ల్యూసీ కింద రూ. 6 వేల చెల్లిస్తున్నారు. విలేజ్‌ వాటర్‌ శానిటేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో మరుగుదొడ్లను నిర్మించి ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఓడీఎఫ్‌పై ప్రత్యేక దృష్టి
జిల్లాను ఓడీఎఫ్‌ జిల్లాగా మార్చేందుకు కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించటంతో డీఆర్‌డీఓ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ఇంటింటా మరుగుదొడ్డి నిర్మించేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలపై ఎప్పటికప్పుడు కలెక్టర్‌ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ.. పనులు సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో కలుగుతున్న ఇబ్బందులు, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేమితో జరుగుతున్న జాప్యం, బిల్లుల చెల్లింపుల్లో కలుగుతున్న ఇబ్బందులను అధిగమిస్తూ నిర్మాణాలు వేగంగా సాగేలా చర్యలు చేపడుతున్నారు. మరుగుదొడ్లు నిర్మించుకుంటున్న ప్రతి లబ్ధిదారుడికి రూ. 6 వేల మెటీరియల్‌ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి వెంకట శైలేశ్‌ జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ మరుగుదొడ్ల నిర్మాణాలను ఎప్పటిప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నాలుగు బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి మండలంలో ఉదయం రెండు, మధ్యాహ్నం రెండు బృందాలు గ్రామాల్లో పర్యటిస్తారు. బెజ్జూర్‌, కౌటాల, సిర్పూర్‌-టి, తిర్యాణి, కాగజ్‌నగర్‌, దహెగాం మండలాల్లో ఒక బృందం, సర్పూర్‌-యు, కెరమెరి, జైనూర్‌, ఆసీఫాబాద్‌, రెబ్బన, వాంకిడి మండలాల్లో మరో బృందాన్ని ఏర్పాటు చేశారు. మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించడంతో పాటు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపు జరిగేలా చూడడం, మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రతి ఇంటిలో జరిగేలా చర్యలు తీసుకుంటారు. గ్రామ పంచాయతీల వారీగా కార్యదర్శులు పర్యటించి ప్రతి ఇంట్లో మరుగుదొడ్డికి సంబంధించిన సమాచారం తీసుకోవడంతో పాటు నిర్మించుకునేలా అవగాహన కల్పిస్తారు. జూన్‌ చివరి నాటికి జిల్లాలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles