రెండో విడత ప్రశాంతం

Fri,May 10, 2019 11:26 PM

-జిల్లావ్యాప్తంగా 76.14 శాతం పోలింగ్ నమోదు
-పటిష్టబందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
-పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు హజీమ్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎస్పీ మల్లారెడ్డి
-బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌లకు తరలింపు
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ;జిల్లాలో రెండో విడత ప్రాదేశిక పోరు శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్ మండలాల్లో నాలుగు జడ్పీటీసీ, 42 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ప్రజలు ఉదయం ఏడింటి నుంచే బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 76.14 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యధికంగా ఆసిఫాబాద్ మండలంలో 78 శాతం, అత్యల్పంగా తిర్యాణి మండలంలో 74.60 శాతం పోలింగ్ నమోదైంది. పలు పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు హజీమ్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎస్పీ మల్లారెడ్డి సందర్శించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక బ్యాలెట్ బాక్సులను ఆసిఫాబాద్, సిర్పూర్(టి)లోని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు.


జిల్లాలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్ మండలాల్లో 4 జడ్పీటీసీ స్థానాలకు 21 మంది, 42 ఎంపీటీసీ స్థానాలకు 152 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 228 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 1,05,599 మంది ఓటర్లకుగాను 80,401 మంది ఓటర్లు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 53,500 మంది పురుష ఓటర్లకుగాను 40,665 మంది, 52,096 మంది మహిళా ఓటర్లకుగాను 39,736 మంది ఓట్లు వేశారు. ఉదయం 9 గంటల వరకు 11.20 శాతంగా నమోదైన పోలింగ్, 11 గంటలకు 35.93 శాతంగా నమోదైంది. సాయంత్రం 3 గంటల వరకు 69.48 శాతం, 4 గంటల వరకు 76.14 శాతం పోలింగ్ జరిగింది. గ్రామీణ ప్రాంత ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. రెండో విడతలోని నాలుగు మండలాల్లో అత్యధికంగా ఆసిఫాబాద్ మండలంలో 78 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మండలంలో మొత్తం 24,891 మంది ఓటర్లకుగాను 19,416 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అతి తక్కువగా తిర్యాణి మండంలో 74.60 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మండలంలో 15,862 మంది ఓటర్లకుగాను 11,833 మంది ఓట్లు వేశారు. కాగజ్‌నగర్ మండలంలో 38,716 ఓటర్లకుగాను 29,202 మంది, రెబ్బెన మండలంలో 26,130 మంది ఓటర్లకుగాను 19,950 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పొలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్ మండలం కోసిని, లైన్‌గూడ, నజ్రూల్‌నగర్ విలేజ్ నంబర్-1లోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, ఎస్పీ మల్లారెడ్డి పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని పీటీజీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు బ్యాలెట్ బాక్సులను తరలించారు. కాగజ్‌నగర్ మండలంలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను సిర్పూర్(టి)లోని బాలికల గురుకుల పాఠశాలకు తరలించారు.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles